విరాటపర్వం గొప్ప ప్రేమ కావ్యం : వరంగల్ ఆత్మీయ వేడుకలో విరాటపర్వం టీమ్

413

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, నేచురల్ పెర్ఫా ర్మర్ సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ వరంగల్ లో ఆత్మీయ వేడుక నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. విరాట పర్వం ఎందుకు చేస్తున్నారు ? పెద్ద యాక్షన్ మూవీ చేయొచ్చు కదా? అని చాలా మంది నన్ను అడిగేవారు. చాలాసార్లు సినిమాలు ఎందుకు చేస్తారంటే ఇలా చప్పట్లు కోసం, విజిల్స్ కోసం, ఫ్యాన్స్ కోసం. ఈసారి ఈ సినిమా ఎందుకు చేశానంటే.. చప్పట్ల మధ్యలో నిశబ్ధంగా కూర్చుని ఇది నిజమే కదా..అని ఒకరు చూస్తుంటాడు. అలాంటివారి కోసమే ఈ సినిమా చేశా. దర్శకుడు వేణు గారు ఈ సినిమా అద్భుతంగా రాశారు. తీశారు. తెలంగాణలో కట్టె పుల్లని పట్టుకున్నా కవిత్వం వస్తుందని వేణు గారు చెప్పారు. అది నిజం. ఇలాంటి గొప్ప కథలు ఎన్నెన్నో చెప్పదలచుకున్నాం. విరాటపర్వం జూన్ 17న వస్తుంది. మీ ప్రేమ మాకు కావాలి. ఈ వేడుకకు వచ్చే ముందు సైబర్ పోలీసులు నా దగ్గరకి వచ్చి క్రెడిట్ కార్డ్, బ్యాంక్ వివరాలు ఎవరికీ షేర్ చే యొద్దని మీ అందరికి మెసేజ్ ఇవ్వమని చెప్పారు. చాలా సైబర్ క్రైమ్ జరుగుతుంది. మీ డబ్బులు జూన్ 17విరాట పర్వం కోసం దాచుకోండి. టికెట్లు కొనండి. థియేటర్ లో కలుద్దాం. సక్సెస్ మీట్ కి మళ్ళీ ఇక్కడికే వస్తా” అన్నారు.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన అతిధులకు, అభిమానులకు కృతజ్ఞతలు. వరంగల్ ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చిన భావనే కలుగుతుంది. కళ లేకుండా మనం ఉండలేం, మనం లేకుండా కళ కూడా వుండదు. విరాట పర్వం చాలా నిజాయితీ గల కథ. విరాట పర్వం  మన సినిమా. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. వెన్నెల పాత్ర ఇచ్చిన దర్శకుడు వేణు గారికి కృతజ్ఞతలు. రానా గారితో నటించడం గొప్ప అనుభూతి. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నటీనటులు, టెక్నికల్ టీం ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అందరికీ కృతజ్ఞతలు. విరాట పర్వంలో భాగం కావడం చాలా గర్వంగా వుంది. మీ ప్రేమకి ఎప్పుడూ రుణపడి వుంటాను. కథ ద్వారా నా ప్రేమని వ్యక్తపరచగలము. విరాట పర్వం కూడా అలా ప్రేమని వ్యక్తపరిచే కథ. జూన్ 17న మీఅందరూ తప్పక చూడాలి” అన్నారు.