“వకీల్ సాబ్” ఘనవిజయం మా బాధ్యత మరింత పెంచింది – నిర్మాత దిల్ రాజు

457

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ “వకీల్ సాబ్”. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. “వకీల్ సాబ్” విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు…

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ…వకీల్ సాబ్ ఈరోజు మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు దగ్గరైంది. వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వస్తున్న సినిమా అంటే ఒక విలువ ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా, ఆడియెన్స్ ఆదరిస్తేనే ఆ సినిమాకు విలువ. హిట్ గానీ సూపర్ హిట్ గానీ ప్రేక్షకులే ఇవ్వాలి. ఇవాళ ప్రేక్షకుల దగ్గర నుంచి మాకు అలాంటి ఆదరణ దక్కుతోంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా వకీల్ సాబ్ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు. ఈ విజయం మీరు మాకూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చిన బహుమతి. మంచి సినిమా చేస్తే ఆ సినిమా విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు వకీల్ సాబ్ సినిమాతో మరోసారి నిరూపించారు. మీరు ఇచ్చిన విజయం జీవితాంతం మా మనసులో ఉంటుంది. రాజు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కష్టపడ్డాను. కానీ ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు. మా టీమ్ అందరికీ కరోనా వచ్చిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. అందరం రోజూ టెస్ట్ చేసుకుంటున్నాం. నెగిటివ్ వస్తోంది. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమంతా జాగ్రత్తగానే ఉంటున్నాం. కరోనా సోకిన వారు స్వయంగా వాళ్లే వెల్లడించారు. యూనిట్ అందరికీ వచ్చిందనడంలో నిజం లేదు. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…ఈ సినిమా మొదలుపెట్టిన రోజే అనుకున్నాం, ఇది ఎంత పెద్ద సినిమా అయితే అంత మనం విజయం సాధించినట్లు అని. ఎంత పెద్ద సినిమా అంటే డబ్బుల వసూళ్ల పరంగా కాదు, ఎంతమంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది అనేది మా లక్ష్యం. నేను వకీల్ సాబ్ సక్సెస్ మీట్ రోజు కూడా ఇదే చెప్పాను. డబ్బులు వస్తుంటాయి, అది ముఖ్యం కాదు. అవి టీవీ, థియేటర్, ఓటీటీ ఇలా మూడు విధాలుగా నిర్మాతకు డబ్బులు వస్తాయి. థియేటర్లో మేము ఎక్స్ ట్రీమ్ గా వెళ్లిపోయాం. ఈ కొవిడ్ టైమ్ లో ఎంత మంది చూడాలో అంత కంటే ఎక్కువే చూస్తున్నారు. థియేటర్లకు రిపీటెడ్ గా వస్తున్నారు. ఇటీవల 12 సినిమాల దాకా రిలీజ్ అయితే అందులో ఐదారు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. క్రాక్ దగ్గర నుంచి ఉప్పెన, జాతిరత్నాలు, జాంబిరెడ్డి ఇలా సక్సెస్ లు వచ్చాయి. అదే బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేయాలంటేనే సందేహపడుతున్నారు. గత నాలుగు నెలలుగా మనం ధైర్యం చేయగలిగాం. సినిమాలు ఆగితే కార్మికులు, టెక్నీషియన్స్ అందరికీ ఉపాధి పోతుంది. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. వకీల్ సాబ్ విజయం మాకు మరింత బాధ్యత ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాలను జాగ్రత్తగా చేయాలని, చేస్తే ప్రశంసలు పేరు వస్తాయని మరోసారి గుర్తు చేసింది. అన్నారు.