స్టార్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఎన్.శివ కళ్యాణ్ దర్శకత్వంలో ఎమ్‌డి అసీఫ్ జాని నిర్మిస్తోన్న చిత్రం `తురుమ్ ఖాన్ లు`. శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, సీతా పులి, ఐశ్వర్య ఉల్లింగల, శ్రియాంక, విజయ, హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో ని శ్రీ సత్య సాయి నిగమాగమంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు వి.సముద్ర మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వి.సముద్ర మాట్లాడుతూ…“తురుమ్ ఖాన్ లు` టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ చాలా బావుంది. ఈ సినిమాతో పరిచయం అవుతోన్న దర్శక నిర్మాతలతో పాటు నటీనటులకు శుభాకాంక్షలు“ అన్నారు.
నిర్మాత ఎమ్.డి.అసిఫ్ ఖాన్ మాట్లాడుతూ…“మా చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన సముద్ర గారికి ధన్యవాదాలు. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. దర్శకుడు ఒక మంచి కథతో సినిమాను అనుకున్నవిధంగా తెరకెక్కించారు. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. జూన్ లో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
దర్శకుడు ఎన్.శివ కళ్యాణ్ మాట్లాడుతూ…“పల్లె టూరి నేపథ్యంలో సాగే రివేంజ్ కామెడీ డ్రామా చిత్రం `తురుమ్ ఖాన్ లు`. సినిమా చాలా అల్లరల్లరిగా ఉంటూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది. దర్శకుడుగా నాకిది తొలి చిత్రం. మా నిర్మాత క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. సినిమా అంతా మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో పిక్చరైజ్ చేశాం. ఇందులో నాలుగు అద్భుతమైన పాటలు ఉన్నాయి. త్వరలో పాటలు రిలీజ్ చేస్తాం“ అన్నారు.
శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, సీతా పులి, ఐశ్వర్య ఉల్లింగల, శ్రియాంక, విజయ, సింగం విజయ్, భాస్కర్ గౌడ్, లక్ష్మణ చారి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ః నాగేశ్వర రెడ్డి బొంతాల; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః దేవరాజ్ పాలమూర్; మ్యూజిక్ః వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, డిఓపిః అంబటి చరణ్ బాబు; కో-ప్రొడ్యూసర్ః కె.కళ్యాణ్ రావ్; నిర్మాతః ఎమ్.డి.అసిఫ్ జాని, రచన-దర్శకత్వంః ఎన్. శివకళ్యాణ్.