HomeTeluguటిల్లు స్క్వేర్' చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

టిల్లు స్క్వేర్’ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ

ఈమధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సీక్వెల్ అంటే ‘టిల్లు స్క్వేర్’ అని చెప్పవచ్చు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం యువత మరియు సినీ ప్రియుల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘టిల్లు స్క్వేర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘డీజే టిల్లు’కి మించిన వినోదాన్ని అందించడానికి ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో ముచ్చటించిన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డీజే టిల్లు లాంటి భారీ విజయానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా కదా.. ఏమైనా ఒత్తిడి ఉందా?
డీజే టిల్లు సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ ని అందించడానికి కృషి చేశాం.

ఈ సీక్వెల్ పాత్రకి కొనసాగింపుగా ఉంటుందా? లేక కథకి కొనసాగింపుగా ఉంటుందా?
రెండింటికి కొనసాగింపుగా ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు.

డీజే టిల్లు లో మీకు వన్ మ్యాన్ షో అనే పేరు వచ్చింది. ఇప్పుడు మీకు అనుపమ లాంటి స్టార్ హీరోయిన్ తోడయ్యారు.. ఆమె డామినేషన్ ఏమైనా ఉంటుందా?
అలా ఏముండదు. కథలో ఏ పాత్రకు ఉండాల్సిన ప్రాధాన్యత ఆ పాత్రకు ఉంటుంది. డీజే టిల్లులో కూడా హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు.

సినిమా నిడివిని తగ్గించడానికి కారణం?
కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం.

సీక్వెల్ కి దర్శకుడు ఎందుకు మారాడు?
సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.

త్రివిక్రమ్ గారు ఏమైనా సూచనలు చేశారా?
ఆయనకు సినిమాల్లో ఎంతో అనుభవం ఉంది. అలాగే ఎన్నో పుస్తకాలూ చదివిన నాలెడ్జ్. ఆయనలా నాలెడ్జ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు.

సీక్వెల్ లో రాధిక పాత్ర కూడా ఉంటుందా?
అది మీరు థియేటర్ లో చూసి తెలుసుకోవాలి. (నవ్వుతూ)

పార్ట్-3 కూడా ఉంటుందా?
సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది.

సంభాషణలు మీరు రాసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అంటారా?
ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది.

భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం ఎలా ఉంటుంది?
డీజే టిల్లుకి థమన్ గారి నేపథ్య సంగీతం ఎంత ప్లస్ అయిందో.. టిల్లు స్క్వేర్ కి భీమ్స్ సంగీతం అంత ప్లస్ అవుతుంది.

డీజే టిల్లు పాత్ర ఎలా పుట్టింది?
టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES