HomeTelugu'టిల్లు స్క్వేర్' వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ

‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు వసూలు చేస్తుంది : చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా నేడు(మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ విజయానందంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ” ముందుగా నేను నిర్మాత నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి. నన్ను నమ్మి, ఇలాంటి సబ్జెక్టుని నమ్మి, మంచి బడ్జెట్ తో ‘డీజీ టిల్లు’ చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత సీక్వెల్ అవకాశం కూడా ఇచ్చారు. టిల్లు స్క్వేర్ కి థియేటర్లలో మంచి స్పందన లభిస్తుండటం ఆనందం కలిగిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుంది అని నాకు తెలుసు. కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగాను. ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.

కథానాయిక అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. ఈ సినిమా ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిత్రం చేసే సమయంలో ప్రతి క్షణం ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. నా పాత్రకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. నేను మొదటిసారి ఇలాంటి పాత్ర పోషించాను. అయినప్పటికీ నేను పోషించిన లిల్లీ పాత్ర నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం నిజమై, ఇప్పుడు నా పాత్రకు వస్తున్న స్పందన చూసి సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. “మొదటి షోకే అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మేము ముందు నుంచి అనుకున్నట్టుగానే.. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది. సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షోకి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నాను.” అన్నారు.

ఈ కార్యక్రమంలో కళ్యాణ్ శంకర్, రవి ఆంథోనీ, ప్రణీత్ రెడ్డి తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES