వైభవంగా SLB కూచిపూడి కళానిలయం 18వ వార్షికోత్సవ వేడుకలు

80

ఈ మధ్య కాలంలో డాన్స్ ఇన్స్టిట్యూట్స్ వార్షికోత్సవాలు అని గెస్ట్ గా రమ్మని ఆహ్వానిస్తుంటే వెళ్లడం మానేసాను! ఎందుకంటే ఆ పిల్లలకు మేకప్ మమ అనిపిస్తారు! వాళ్ళు ధరించే అద్దె డ్రెస్ లు సెట్ కావు! ఇక ప్రదర్శన చూస్తే వామ్మో అనిపిస్తుంది. సమన్వయం ఉండదు ఇంక రిథమ్ ఏముంటుంది? చాలా బాధ అనిపిస్తుంటుంది! అందుకే ఆ డేట్ వీలు పడదని చెప్పి తప్పించుకుంటాను! కానీ, నిన్న రవీంద్రభారతిలో SLB కూచిపూడి కళానిలయం వారి 18వ వార్షికోత్సవ వేడుకలకు వెళ్ళాను! మనసు పులకరించిపోయింది! చిన్నారులు ఎంతో చక్కగా ఆయా అంశాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు! ఏర్పాట్లు కానివ్వండి, అలంకరణ, నిర్వహణ అంతా మైండ్ బ్లోయింగ్ అంటే నమ్మండి!

గతంలో కూడా శ్రీ లలిత భవాని (SLB) వారి కార్యక్రమానికి వెళ్ళాను! అప్పుడూ అంతే వైభవం! నిన్న అంతకు మించి వేరే లెవెల్! నాట్య గురు డాక్టర్ వినీలారావు కొరియోగ్రఫి వైవిధ్యంగా స్టైలిష్ గా ఉంటుంది! ఎంతో ఈజ్ కనిపిస్తుంది! చూడముచ్చటగా ఉంటుంది! చక్కని రిథమ్ ఉంటుంది! వినీలరావు తన శిష్య బృందం తో కలసి చేసిన “చందన చర్చిత” ఐటమ్ చూపరుల హృదయాలను దోచేసింది! రవీంద్రభారతి నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది! ఇదే కాదు ప్రతి అంశానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు!

ఉదయం 10 గంటల నుంచి ఒక స్లాట్, సాయంత్రం ఆరు గంటల నుంచి మరో స్లాట్…. దాదాపు 200 మంది శిష్యులు వివిధ అంశాలను ప్రదర్శించారు. ఇందులో ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణి వరకు అందరూ వినీలరావు శిష్యులే! చక్కని కూచిపూడి నృత్యాంశాలు ప్రదర్శించి కనువిందు చేశారు! ఎంపిక చేసుకున్న నృత్యాంశాలు అద్భుతం! ఆహార్యం అద్భుతం! శిష్యుల క్రమశిక్షణ మరీ అద్భుతం! తల్లిదండ్రుల ప్రోత్సాహం స్ఫూర్తిదాయకం!

Kuchipudi Exponent వినీలరావు ఎక్కువగా మాట్లాడరు! ఆమె ప్రతిభ అంతా శిష్యులు ప్రదర్శించే ఆయా అంశాల్లో కనిపిస్తుంది! అదే ఆమె ప్రత్యేకత! అదే కదా కావాల్సింది! హైదరాబాద్ లో మధురానగర్, అమీర్ పేట్, మోతి నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లో తమ SLB కూచిపూడి శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు వినీలరావు తెలిపారు.

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసి కూచిపూడి నాట్యం గురించి అద్భుతంగా కీలకోపన్యాసం చేసి వినీల నాట్యం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. సినీ దర్శకుడు వై. వి. ఎస్. చౌదరి ఓపిగ్గా రెండు వందల మందికి పైగా శిష్యులను మెడల్స్ తో సత్కరించి ఆశీర్వదించారు. డా. మహ్మద్ రఫీ, నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ, వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి బి. విజయ్ కుమార్, దైవజ్ఞ శర్మ పాల్గొని కళాకారులను అభినందించి SBL చేస్తున్న నాట్య సేవలను ప్రశంశించారు. వినీల గారిని ఘనంగా సత్కరించారు. ఆది సమన్వయం చేశారు.

డా. మహ్మద్ రఫీ
ఫోటోలు : ఈశ్వర్