సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్షన్ చిత్రం “ఆదికేశవ” నవంబర్ 10న విడుదల

138

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రేక్షకులు మెచ్చే వైవిధ్య భరిత చిత్రాలను అందిస్తోంది. వారు ఓ యాక్షన్ చిత్రం కోసం పంజా వైష్ణవ్ తేజ్‌తో చేతులు కలిపారు. యువ నటుడు వైష్ణవ్ తేజ్‌ విభిన్న తరహా చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, ‘ఆదికేశవ’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.

ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మాస్ మూవీ ప్రియులను, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవాలని ఈ నూతన దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, పంజా వైష్ణవ్ తేజ్‌ను మునుపెన్నడూ లేని విధంగా కొత్త అవతార్‌లో చూపించి మెప్పించింది.

ఆదికేశవలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ఆమె చిత్ర అనే పాత్రలో సందడి చేయనున్నారు. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో ఆమె అందం, పాత్రలోని చిలిపితనం ఆకట్టుకున్నాయి. శ్రీలీలతో పాటు జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని ఆగస్ట్ 18 నుంచి నవంబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ఆదికేశవ చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవ‌లే ఆదికేశ‌వ చిత్రీకరణ ప్యారిస్‌లో జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.

జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.