‘రుద్రం కోట’ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు

304

ఎఆర్‌కె విజువల్స్ బ్యానర్‌పై సీనియర్ నటి జయలలిత మొట్టమొదటిసారి సమర్పిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. అనిల్ కండవల్లి, విభీష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర టైటిల్‌ లుక్ పోస్టర్‌ని గురువారం డైలాగ్ కింగ్ మోహన్ బాబు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర టీమ్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఫంక్షన్లకు హాజరై చాలా రోజులైంది. జయలలిత చాలా మంచి అమ్మాయి. నాకు ‘రౌడీ గారి పెళ్ళాం’ చిత్రం నుండి పరిచయం. అప్పటి నుండి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. అలాంటి తను ఈ రోజు మొదటిసారిగా ఒక చిత్రాన్ని సమర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్‌ను అందించాలని పిలవగానే వచ్చాను. ఎవరైనా చిన్న సినిమాతోనే మొదలుపెట్టి ఎంతో పెద్ద స్థాయి వరకు వెళతారు. నిర్మాతగా నేను కూడా చిన్న సినిమాతోనే మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ సాయిబాబా ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమాలో అందరూ కొత్త వారే అని తెలిసింది. ఏం పరవాలేదు ఇప్పుడు కొత్తే కానీ తరువాత పాతదే. ఈ చిత్ర నిర్మాత అనిల్ చాలా మంచి స్థాయికి వెళ్లాలని, అలానే దర్శకుడు కోన రాము పెద్ద డైరెక్టర్ అయ్యి నాకు కూడా తన సినిమాలో అవకాశం ఇవ్వాలని, అలానే ఆ సాయినాథుని ఆశీస్సులు ఈ చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను. మేము తిరుపతిలో ఆ తిరుమలేషుని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరుపతిలోని సాయిబాబా దేవాలయానికి కూడా వచ్చి వెళ్లేంత పెద్ద దేవాలయాన్ని నిర్మించనున్నాము..’’ అన్నారు.

జయలలిత మాట్లాడుతూ.. ‘‘రుద్రం కోట చాలా మంచి కథ. అందుకే మొదటి సారి అటెంప్ట్ చేస్తున్నాను. హీరో అనిల్ రుద్రంగా, నేను కోటమ్మగా నటిస్తున్నాము. ఈ ఊరు ఖమ్మం జిల్లాలో పోలవరం చుట్టుపక్కల ఉండేది. ఇప్పుడది పోలవరం ప్రాజెక్ట్‌లో పోయింది. అక్కడే షూటింగ్ జరుపుకున్నాము. ఇందులో నటించిన ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంది. ఇందులో 5 పాటలుంటాయి. అందరి ఆశీస్సులు కావాలి..’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో, నిర్మాత అనిల్ కండవల్లి, దర్శకుడు కోన రాము, హీరోయిన్ విభీష, రైటర్ వెంకట్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ నటి జయలలిత, అనిల్ కండవల్లి, విభీష, భాస్కర్, రియా, శివశంకర్ మాస్టర్ తదితరులు నటించిన

ఈ చిత్రానికి
డైలాగ్స్: రంగ,
మ్యూజిక్: సుభాష్,
ఫైట్స్: జాషువా,
లిరిక్స్: సాగర్,
కొరియోగ్రాఫర్: స్వర్గీయ శివశంకర్ మాస్టర్, సుచిత్ర చంద్రబోస్,
ఎడిటింగ్: ఆవుల వెంకటేష్,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: అనిల్ కండవల్లి,
కథ-దర్శకత్వం: కోన రాము.


Veerababu PRO
9396410101