సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్నాను.. ‘అమ్మాయి’ ప్రమోషన్స్‌లో పూజా భాలేకర్

297

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడ్కీ’(తెలుగులో ‘అమ్మాయి‘) చిత్రం జూలై 15న విడుదల కాబోతోంది. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో రాబోతోంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పూజా భాలేకర్ మీడియాతో పంచుకున్నారు.

మీకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. వర్మ లాంటి దర్శకుడి నుంచి ఆఫర్ రావడం మీకు ఎలా అనిపిస్తోంది?

నేను ఎప్పుడూ నటిని అవుతానని అనుకోలేదు. నేను చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ పెట్టాను. అయితే నేను ఆర్జీవీ గారికి పెద్ద అభిమానిని. ఆయన్నుంచి ఫోన్ రాగానే ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. నేను నా తండ్రితో కలిసి ముంబైలోని ఆయన ఆఫీస్‌కు వెళ్లాను. అయితే బ్రూస్‌లీకి నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నాకు ఆ టైంకు తెలీదు. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కావాలని అన్నారు.. నేను అందుకే వచ్చానని అనుకున్నాను. ఆడిషన్ ఇచ్చాను. ఆయనకు నచ్చింది. ఆ తరువాత స్టోరీ చెప్పారు. బ్రూస్‌లీ మీద సినిమా అని, బ్రూస్‌లీ మీద ఆయనకున్న ఇష్టాన్ని చెప్పారు. ఇలాంటి ఓ సినిమాతో, ఆర్జీవీ లాంటి దర్శకుడితో నా కెరీర్ స్టార్ట్ చేయడం సరైన చాయిస్ అనుకున్నాను. వెంటనే ఓకే చెప్పాను.

మార్షల్ ఆర్ట్స్ ఉందని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఒక వేళ వేరే సినిమా కోసం అప్రోచ్ అయితే మీరు చేసేవారా?

మార్షల్ ఆర్ట్స్ అనేది లేకపోతే నేను ఆయన ముందుకు వచ్చేదాన్ని కాదు. మార్షల్ ఆర్ట్స్ వచ్చు కాబట్టే నన్ను తీసుకున్నారు. లేదంటే నాకంటే బాగా అందంగా ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ అనేది ఉండటంతోనే నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే నేను ఎప్పుడూ కూడా నటిని అవ్వాలని అనుకోలేదు. ముంబైలో ఆడిషన్స్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమాతో మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికీ చెప్పొచ్చు.. దీనిపై అవగాహన కల్పించగలమని అనుకున్నాను. అమ్మాయిలకు ఇది అవసరం అని చెప్పదల్చుకున్నాను. ఈ సినిమాతో కొంత మందికైనా అవగాహన కలిగి, నేర్చుకుంటారని ఈ సినిమా చేశాను.

మీరు నటించే మొట్టమొదటి చిత్రమే పాన్ వరల్డ్ అవుతుందని మీరు ఊహించారా?

లేదు. మొదట్లో ఈ చిత్రాన్ని ఇన్ని భాషల్లో విడుదల చేస్తామని అనుకోలేదు. నాకు తెలిసి వర్మ సర్ కూడా అనుకోలేదు. షూటింగ్ ప్రారంభమయ్యేకంటే ముందే.. ఎన్నో టెస్ట్ షూట్‌లు చేశారు. వాటిని ప్రొడక్షన్ కంపెనీలకు చూపించడం, వారికి ఎంతో నచ్చడంతో ఈ సినిమా ఇన్ని భాషల్లో ప్లాన్ చేశారు.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

ఈ మూవీలో నా పేరు పూజా కానిక్. నేను సర్‌ను కలిసేకంటే ముందే పాత్రకు ఆ పేరు ఫిక్స్ చేశారు. నా పేరు కూడా అదే అయింది. ఇదే విధి అనుకున్నాను. అందుకే నేను ఇక్కడకు వచ్చానని అనుకున్నాను. పూజాకు బ్రూస్‌లీ అంటే ఇష్టం. అతను చేసే మార్షల్ ఆర్ట్స్, ఆయన ఫిలాసఫీ అంటే పిచ్చి. ఆయన మీదున్న ప్రేమతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఆమెకు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలతో ఆత్మ రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ అవసరమని అనుకుంటుంది. ఆమె తీసుకున్న నిర్ణయాలతో జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అవన్నీ తెరపై చూడటానికి బాగుంటాయి.

మీరు మార్షల్ ఆర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి?

నేను నా చిన్నతనంలో యోగా చేసేదాన్ని. ఆ తరువాత అథ్లెట్‌గా మారాను. ఓ సారి చిన్న పిల్లలు మా స్కూల్ గ్రౌండ్‌లో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నారు. అప్పుడు నేను కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాను. అయితే మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటో నాకు అప్పుడు తెలియదు. దాని ప్రాముఖ్యత ఏంటో కూడా తెలీదు. అయితే నేర్చుకుంటాను అనే విషయాన్ని ఇంట్లో చెప్పాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఎన్నెన్నో మెడల్స్, అవార్డ్స్ వచ్చాయి. ఇక ఇదే కెరీర్‌గా ఎంచుకుంటే బాగుంటుందని అనుకున్నాను. అయితే మొదట్లో నాకు దీని ప్రాముఖ్యత తెలిసేది కాదు. అందుకే ఈ సినిమా ద్వారా మార్షల్ ఆర్ట్స్ గొప్పదనాన్ని చెప్పదల్చుకున్నాను.

ఈ సినిమాలో పాత్రను పోషించేందుకు మార్షల్ ఆర్ట్స్ ఎంత వరకు దోహదపడింది?

యాక్షన్ సీక్వెన్స్‌ చేయడంలో మార్షల్ ఆర్ట్స్ నాకు ఎంతో కలిసి వచ్చింది. స్టామినా, ఫిట్ నెస్ అన్ని కలిసి వచ్చాయి. నాకు యాక్టింగ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ సర్ మాత్రం నాకు ఎంతో చక్కగా వివరించారు. ఆ పాత్ర ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి.. అన్నీ కూడా ఎంతో చక్కగా చెప్పేవారు.

యాక్టింగ్ కోసం వర్క్ షాప్స్ ఏమైనా నిర్వహించారా?

యాక్టింగ్ కోసం అలాంటిదేమీ చేయలేదు. కానీ యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా రిహార్సల్స్ చేశాం.

మీరు, ఆర్జీవీ గారు కలిసి యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయడం ఎలా అనిపించింది?

ఆర్జీవీ సర్‌కి ఫిజికల్‌గా మార్షల్ ఆర్ట్స్ రాకపోయినా.. థియరీ పరంగా ఎంతో నాలెడ్జ్ ఉంది. బ్రూస్‌లీ చేసే యాక్షన్స్ మీద ఆయనకు ఎంతో పట్టుంది. ఆయన ఇచ్చిన సలహాల వల్లే ఈజీగా కంపోజ్ చేయగలిగాను.

యాక్షన్‌తో పాటు, గ్లామర్ కూడా ఉంది కదా.. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు?

నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చు. అయితే ఈ సినిమాలో గ్లామర్ కూడా ఉండాలన్నారు. అందుకే నాకు నేనుగా గ్లామర్‌గా కనిపించేందుకు ప్రయత్నించాను. ఎందుకంటే ఈ సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు రావాలి. అందుకే నేను గ్లామర్ పరంగా అందంగా కనిపించాలని అనుకున్నాను. యాక్షన్, ఫిట్ నెస్, గ్లామర్ పరంగా నేను పర్ఫెక్ట్ అని చూపించాలనుకున్నాను. గ్లామరైనా, యాక్షన్ అయినా ఏదైనా చేయగలను అని చెప్పదల్చుకున్నాను. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేశాను.

సినిమాల్లోకి వెళ్లమని ఎవరైనా సలహా ఇచ్చారా? మీ కెరీర్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందని అనిపించలేదా?

ఎవరూ సలహాలు ఇవ్వలేదు. అయినా మనం చేసే పని మన ఇంట్లో వాళ్లకి నచ్చితే సరిపోతుంది. మనకు నచ్చింది చేయమని చెప్పే పేరెంట్స్ ఉంటే.. మిగతా వాళ్ల గురించి అవసరం లేదు. మా అమ్మ ఎప్పుడూ నన్ను వెనక్కి లాగలేదు. నాకు నచ్చింది చేసే ఫ్రీడం ఇచ్చారు. అయినా నేను ఎప్పుడూ ఇంట్లో ఉండేదాన్ని కాదు. నేను నా కాంపిటీషన్స్ కోసం ఇండియాను చుట్టి వస్తుండేదాన్ని. ఒక్కోసారి ఆరు నెలలు, ఏడాది పాటు ఇంటికి కూడా వచ్చేదాన్ని కాదు. ఆ నమ్మకం వాళ్లకి ఉంది. నేను ఆర్జీవీ గారికి పెద్ద అభిమానిని. నాకు ఈ అవకాశం వచ్చినందుకు వారు కూడా ఎంతో ఆనందించారు.

ఆర్జీవీ సినిమాలు మీరు చూశారా?

నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. ఆయన తీసిన రంగీలా, సత్య, సర్కార్ ఇవన్నీ కూడా నా ఫేవరెట్ సినిమాలు.

సినిమాల్లో కంటిన్యూ అవుతారా? లేదా మార్షల్ ఆర్ట్స్‌ కెరీర్‌లోనే ఉంటారా?

మార్షల్ ఆర్ట్స్‌లో నేను ఇప్పటికే ఎంతో సాధించాను. ఇక నా ఈ టాలెంట్‌ను ఉపయోగించుకుని ఇప్పుడు సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాను.

మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం కాకుండా వేరే పాత్రలు వస్తే అంగీకరిస్తారా?

నా పాత్ర ప్రత్యేకంగా, స్ట్రాంగ్‌గా, ఈ కారెక్టర్‌కు కాస్త దగ్గరగా అనిపిస్తే చేస్తాను. ‘అమ్మాయి’ సినిమాను ఆర్జీవీ సర్ ఆ లెవెల్‌లో తెరకెక్కించారు. ఆ బార్ హైలెవెల్‌లో ఉంది. దాని కంటే తక్కువగా అనిపిస్తే చేయను. ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను.

తెరపై స్పోర్ట్స్ డ్రామాలు రావడం అరుదు. వుమెన్ సెంట్రిక్, థ్రిల్లర్ వంటి చిత్రాలు కూడా చేస్తారా?

స్క్రిప్ట్‌ను బట్టి సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంది అభినందించారు. ఎంతో మంది నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఆ కథలు నాకు నచ్చలేదు. ఈ చిత్రాన్ని చూసి నేనేం చేయగలనో తెలుసుకుని అలాంటి స్క్రిప్ట్స్ నాకోసం రాస్తారని అనుకుంటున్నాను.