ప్రముఖ నటుడు– ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ–‘‘ గతేడాది ఓ కార్యక్రమంకోసం గెస్ట్‌గా పిలిస్తే ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ ఉన్న మన తెలుగువారందరూ ఒకేమాట మీద ఉంటూ ఎంతోమందికి సాయం చేయటం నా కళ్లారా చూశాను. ఆరోజు అక్కడున్న మన తెలుగువారు విష్ణురెడ్డి, శశి కొలికొండను పిలిచి అడిగాను. మీరు ఆస్ట్రేలియాలో ఉండి ఇంతమంచి చేస్తున్నారు కదా, అదేమంచి మన తెలుగువారికి కూడా చేయొచ్చు కదా అని అడిగాను. శశిగారు, విష్ణు జగ్గిరెడ్డి గారు రేపు కలుద్దాం అలీగారు అన్నారు. నేను ఇద్దరో ముగ్గురో వస్తారని అనుకున్నాను. దాదాపు 60మందికి పైగా వచ్చి ఎలా సాయం చేయాలి అని అడిగారు. ఆరోజు నేను కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటంతో అందరూ సరే అన్నారు. కట్ చేస్తే 9 నెలల తర్వాత ఆర్వేన్సిస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఇవో శశిగారు ఆర్వేన్సిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి సంబంధించిన ఆస్ట్రేలియన్ బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్ ( డైరెక్టర్– గవర్నర్ అండ్ కంప్లేయిన్స్) ఇండియాకు తీసుకుని వచ్చారు. ఆ కంపెనీవారు బాగా చదువుకుని టాలెంట్ ఉండి డబ్బుల్లేక ఇబ్బంది పడే ఎంతోమందికి సాయం చేయటానికి ఇక్కడకి వచ్చారు. నన్ను నమ్మి అవసరంలో ఉన్న వారికి సాయం అందించే ఉద్ధేశ్యంతో ఇంతదూరం వీరంత ఇండియాకి వచ్చారు. నావల్ల ఒక పది కుటుంబాలకి మంచి జరిగిన ఫరవాలేదనిపించింది. అందుకే ఆర్వేన్సిస్ కంపెనీకి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌లా పని చేయటానికి మీ ముందుకు వచ్చాను’’ అన్నారు. ఆర్వేన్సిస్
సీఈవో డైరెక్టర్ శశిధర్ కొలికొండ మాట్లాడుతూ– ‘‘ హైదరాబాద్ నుండి ఆస్ట్రేలియా సిటిజన్ అయ్యి అక్కడినుండి మా ఆపరేషన్స్‌ను నిర్వహిస్తున్నాను. అలీ గారు కలసిన తర్వాత నా మైండ్‌సెట్ అంతా మారిపోయింది. అందుకే మేము ఆస్ట్రేలియాలో చేసే సేవలను ఇండియాలో చేయాలి అని నిర్ణయించుకుని చాలా పెద్ద ఎత్తున మనవాళ్లకు విద్య– వైద్య– టెక్నాలజీ రంగాల్లో ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చాలని మా టీమంతా కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం. అందుకే మా టీమంతా కలిసి వైజాగ్‌లో మార్చి 3–4 తారీకుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరవుతున్నాం ’’ అన్నారు. బ్రూస్ మ్యాన్‌ఫీల్డ్ మాట్లాడుతూ–‘‘ అలీ లాంటి మంచి వ్యక్తి మాకు, మా కంపెనీకి అండగా నిలబడటం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో వేత కుటుంబాలకు మా సేవలను అందిస్తాం’’ అన్నారు. ఇండియాలో మా కంపెనీ సాయం కోరి వచ్చిన అర్హులకు సాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆర్వేన్సిస్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సుకన్య కంభంపాటి తెలిపారు.