‘పిండం’ సినిమా చూసి ప్రేక్షకులు ఖచ్చితంగా భయపడతారు: ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

125

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించిన చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకున్నారు.

కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ.. “పిండం సినిమా ఏంటి అనేది మీకు డిసెంబర్ 15న తెలుస్తుంది. ఈ సినిమాని థియేటర్ లో చూడటానికి నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీరందరూ మా సినిమాని చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాను.” అన్నారు.

కథానాయిక ఖుషి రవి మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ మంచి నటులు, మంచి దర్శకులు, మంచి నిర్మాణ సంస్థ, మంచి సాంకేతిక నిపుణులతో కలిసి పని చేయాలని కోరుకుంటాను. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. డిసెంబర్ 15న విడుదలవుతున్న మా చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

దర్శకుడు సాయికిరణ్ దైదా మాట్లాడుతూ.. “నల్గొండ జిల్లాలో జరిగిన ఒక యదార్థ ఘటనను తీసుకొని, దాని చుట్టూ కల్పిత కథ అల్లుకొని, దీనిని హారర్ జానర్ లో చెప్తే బాగుంటుంది అనే ఆలోచనతో పిండం కథను రాసుకున్నాము. హారర్ జానర్ ని ఇష్టపడే ప్రేక్షకులు భయాన్ని ఆశించి సినిమాకి వస్తారు. భయం ఎంత బాగా పండితే, సినిమా అంత బాగా ప్రేక్షకులను కనెక్ట్ అవుతుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ఎంతో శ్రద్ధతో ఈ స్క్రిప్ట్ ని రాసుకోవడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ కోసం పెద్ద సినిమాల కంటే ఎక్కువ సమయాన్ని కేటాయించి, పక్క ప్లానింగ్ తో సినిమాని చిత్రీకరించాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమా చూసి భయపడతారు. ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి సినిమాని తీసుకొస్తుంది. అలాంటి బలమైన కథతో వస్తున్నదే మా పిండం చిత్రం. మీడియా మిత్రులు కూడా ఇలాంటి మంచి సినిమాలకు అండగా నిలిచి, ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను.” అన్నారు.

నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మాట్లాడుతూ.. “ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. డిసెంబర్ 15న మా పిండం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతుంది. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సూరంపల్లి మాట్లాడుతూ.. “నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతఙ్ఞతలు. థియేటర్లలో మీరు ఈ సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా ఓ అనుభూతిని పొందుతారు. ఇందులో హారర్ తో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఇది మూడు విభిన్న కలల్లో జరిగే కథ. సాయికిరణ్ దైదా చాలా స్పష్టత ఉన్న దర్శకుడు. సినిమాని అద్భుతంగా రూపొందించారు.” అన్నారు.

రచయిత కవి సిద్ధార్థ మాట్లాడుతూ.. “పిండం సినిమా గురించి మాట్లాడినప్పుడు మొట్టమొదటగా నన్ను కదిలించింది కథలోని అంశం. మన బాల్యంలో ఉండే అనేకానేక భయాలను యధాతధంగా ఎలా చూపించాలనే ప్రశ్నతో ఈ కథ మొదలైంది. కథలో మానవ బంధాల గురించి మాట్లాడుతూనే భయాన్ని స్పృశించే ప్రయత్నం చేశాము. అన్ని విభాగాలు కథని బాగా అర్థంచేసుకొని, మంచి చిత్రాన్ని రూపొందించాయి. ప్రేక్షకులు మా చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

డీఓపీ సతీష్ మనోహర్ మాట్లాడుతూ.. “సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. థియేటర్లలో చూసేటప్పుడు మీకు మంచి అనుభూతి కలుగుతుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తారాగణం: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు
కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ
డీఓపీ: సతీష్ మనోహర్
సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి
ఆర్ట్: విష్ణు నాయర్
ఎడిటర్: శిరీష్ ప్రసాద్
కాస్ట్యూమ్స్: పద్మ ప్రియ
పోరాటాలు: జష్వ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ. వి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ పెన్మత్స
సహ నిర్మాత: ప్రభు రాజా
సమర్పణ: ఆరోహి దైదా
నిర్మాత: యశ్వంత్ దగ్గుమాటి