‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ లో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల తరువాత నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల-కళ్యాణి మాలిక్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 17న ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘కనుల చాటు మేఘమా’ పాట, టైటిల్ సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది.
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి మేకర్స్ గురువారం సాయంత్రం విడుదల చేసిన ‘నీతో ఈ గడిచిన కాలం’ అనే పాట ఆకట్టుకుంటోంది. ఈ పాట కూడా ‘కనుల చాటు మేఘమా’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టైటిల్ సాంగ్ తరహాలోనే వినసొంపుగా, వినగానే నచ్చేలా ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ చిత్రాలలోని మెలోడీ పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో.. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుంచి విడుదలవుతున్న ఒక్కో పాట అంతకుమించి అనేలా ఉన్నాయి. ‘నీతో ఈ గడిచిన కాలం’ పాట చిరుజల్లులో ప్రేయసితో కలిసి నడిచినట్లుగా హాయిగా ఉంది. మెలోడీలను స్వరపరచడంలో కళ్యాణి మాలిక్ ది ప్రత్యేక శైలి అని ఈ పాటతో మరోసారి రుజువు చేసుకున్నారు. ఈ పాటకు ప్రముఖ గీత రచయిత భాస్కర భట్ల రవికుమార్ అద్భుతమైన సాహిత్యం అందించారు. “నీతో ఈ గడిచిన కాలం నడిచిన దూరం ఎంతో ఇష్టం చెవిలో చెప్పే కబురులు అన్నీ ఇష్టం ఇష్టం ఇష్టం” అంటూ సాగిన పాటలోని ప్రతి వాక్యం ఆకట్టుకుంటోంది. గాయని గీతామాధురితో కలిసి కళ్యాణి మాలిక్ ఈ పాటను ఎంతో అందంగా ఆలపించారు. ఈ పాటలో “విడి విడి రెండు ప్రాణాలిలా.. ముడిపడి ఏకమయ్యాయిలా.. మన పయనం సాగాలి వెన్నెల్లో గోదారిలా” అనే వాక్యముంది. దానికి తగ్గట్లుగానే నిజంగానే ఈ పాట వెన్నెల్లో గోదారిలా ఉంది.
నాయకా నాయికలకు ఒకరిపై ఒకరికున్న ఇష్టాన్ని, ప్రేమని తెలిపేలా సాగిన ‘నీతో ఈ గడిచిన కాలం’ సాంగ్ లిరికల్ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి అందాల నడుమ వారి ప్రేమ బంధాన్ని చూపించిన తీరు మెప్పిస్తోంది. పాట ఎంత అందంగా ఉందో.. లిరికల్ వీడియోలోని ప్రతి ఫ్రేమ్ అంత అందంగా ఉన్నాయి. వీడియోలో కథానాయకుడు బాలగంగాధర తిలక్ రచించిన ప్రసిద్ధ కవితా సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి’ని చదవడం చూస్తుంటే అతనికి సాహిత్యంపై మక్కువ ఉన్నట్లుగా అర్థమవుతోంది. “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పినట్లుగా.. ఈ పాటలోని సంగీతం, సాహిత్యం, గాత్రం ఎంతో అందంగా ఉన్నాయి. ఈ పాటకు రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు.
నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్
నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – – శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్