1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’ . తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా ‘పలాస 1978 ’ లోని కొన్ని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ యానిమేటడ్ బుక్ ని తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన మీడియా సమేవేశంలో
చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ:
‘ఈ సినిమాకు నేను ఉన్నాననే ధైర్యాన్ని మాత్రమే ఇవ్వగలిగాను. ఈ సినిమాను అంతా తానే అయి నడిపించింది దర్శకుడు కరుణ్ కుమార్. కథ నాకు తెలుసు, నాకు చెప్పిన దానికన్నా బాగా సినిమాను తీసాడు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ వాళ్ళకు నచ్చడం వారు ఈ సినిమా విడుదలకు ముందుకు రావడంతో ఈసినిమా స్టేటస్ పెరిగింది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీసినందుకు అసలు ఇలాంటి కథను, ఎమోషన్ ను తెరమీదకు తెచ్చిన్నందుకు దర్శకుడు కరుణ్ కుమార్ ని అభినందించాలి. ఈ సినిమా లో పార్ట్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేక్షకుల ముందుకు ఒక మంచి సినిమాతో వస్తున్నామని ధైర్యంగా తొడగొట్టి చెప్పగలను’ అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ:
‘సినిమాలు బాగుండటం, రికార్డ్స్ కలెక్ట్ చేయడం లాంటి మాటలు వింటుంటాం.. కానీ తక్కువ సందర్భాల్లో ‘గొప్పసినిమా’ అనే మాటలు వాడతాం. ‘పలాస 1978’ గొప్పసినిమా అని నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా గురించి పూర్తిగా తెలియక ముందే దర్శకుడు కరుణ్ కుమార్ కి జిఎ 2, యువి నుండి అడ్వాన్స్ ఇప్పించాను. అతన్ని చూస్తుంటే ఈ రోజుల్లో టైం లో నన్ను నేను చూసుకున్నట్లు అనిపించింది. ఈ కథను డీల్ చేయడం చాలా కష్టం ఎలా తీస్తారు అనుకున్నాను కానీ సినిమా చూసాక ఒక గొప్ప సినిమా చూసాను అనిపించింది, తప్పకుండా తెలుగు అసురన్ అవుతుంది వెంటనే అల్లు అరవింద్ గారికి సినిమా చూపించాను ఆయనకు సినిమా బాగా నచ్చింది. అందుకే ఈసినిమా ను జిఎ2, యువి నుండి విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరిలో గ్రాండ్ గా ఈ సినిమా విడుదల అవుతుంది.
పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ:
‘ ఈసినిమా ప్రయాణం లో నాకు సహాకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..ఇలాంటి సినిమాలు ప్రజలకు చేరువ కావాలంటే మీడియా సహాకారం చాలా అవసరం . మా సినిమాకు మీడియా సహాకారం అందించమని కోరుకుంటున్నాను. మాకు అండగా నిలిచిన జిఎ2, యువి క్రియేషన్స్ వారికి చాలా థ్యాంక్స్ ’ అన్నారు.
హీరో రక్షిత్ మాట్లాడుతూ:
‘ చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఇలాంటి అద్బుతమైన కథను, పాత్రను ఇచ్చిన దర్శకుడు కరుణ కుమార్ గారికి నా ధన్యవాదాలు. సినిమా చూసి సుకుమార్ గారి కాల్ చేసిన మాట్లాడారు, ఆ మాటలు ఎప్పటికీ మరిచిపోలేను. గీతా ఆర్ట్స్ మా సినిమాను రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయం . మేము సగం సక్సెస్ అయ్యాం అనిపించింది. అరవింద్ గారు సినిమా చూసి అభినందించారు. మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత వరకూ రాగలిగాను. తప్పకుండా ఒక మంచి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ ఉంది’ అన్నారు.
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి. రచన- దర్శకత్వం : కరుణ కుమార్.