సినిమా కొందరికి వ్యాపారం,ఇంకొందరికి వ్యాపకం, మరి కొందరికి సినిమాయే జీవితం.ఎన్నో కలలతో ఇండస్ట్రీకి వచ్చి వాటిని సాకారం చేసుకోలేక వెనుతిరిగినవారు ఎంతోమంది. ఏదిఏమైనా ఇక్కడే అనుకున్నది సాధించాలి అని బలంగా నమ్మి కష్టపడేవారు అతి తక్కువ మంది. ఆ అతి తక్కువమందిలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు.
కేవలం వెయ్యి నూట పదహార్లతో మొదలైన నిఖిల్ ప్రయాణం ఈరోజు వంద కోట్లకు చేరింది.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి కేవలం 1116/- రూపాయల పారితోషికం తీసుకుని, సుఖంగా బ్రతకడానికి తనకంటూ అవకాశం ఉండి కూడా, కేవలం వేయి ఈ వేయి రూపాయలతోనే బ్రతుకుతూ, అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు పడుతూ, హ్యాపీ డేస్ సినిమాతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజేష్ పాత్రతో తెలుగు ప్రేక్షకులలో ఒక గుర్తింపును సాధించాడు.
వచ్చిన గుర్తింపుతో మూస ధోరణి సినిమాలు చేసుకుంటూ వెళ్లకుండా, వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తనకు తానుగా ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ గా గుర్తింపును పొందుకున్నాడు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా లాంటి యూనిక్ కాన్సెప్ట్ సినిమాలు చేసి తనకు తానుగా నిలద్రొక్కుకున్నాడు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ప్రక్కన పెడితే నిఖిల్ సిద్దార్థ్ అంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తాడు అని అభిప్రాయాన్ని సంపాదించుకున్నాడు.
అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ కొట్టిన నిఖిల్, తాజాగా కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.కార్తికేయ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్బంగా జరిగిన ఈవెంట్ లో కూడా అభిమానుల మధ్యకు వెళ్లి కూడా నిఖిల్ ముచ్చటించటం జరిగింది. కేవలం తెలుగు ప్రేక్షకుల దగ్గరే గుర్తింపు ఉన్ననిఖిల్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ప్రేక్షకులు వద్ద కూడా మంచి గుర్తింపును పొందాడు. దీనికి కార్తికేయ సినిమాకు వస్తున్న కలెక్షన్సే నిదర్శనం అని చెప్పొచ్చు. తెలుగు పాన్ ఇండియా స్టార్స్ లో ఐదవ హీరోగా తన స్థానాన్ని సాధించాడు నిఖిల్.
కేవలం వేయి రూపాయలతో మొదలైన తన ప్రయాణం 100 కోట్లు సాగే దిశగా తన సత్తాను చాటాడు. ఈ విజయం ఒక రాత్రిలో వచ్చినది కాదు, దీని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది, శ్రమ ఉంది. కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అనడానికి నిఖిల్ ప్రయాణం నిదర్శనం. చాలామందికి ఇది ఆశ్చర్యకరమైన విజయం, కానీ నిఖిల్ కి ఇది సాధించాలకున్న విజయం.ఏదేమైనా తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉండటం మనం గర్వించాల్సిన విషయం.