జబర్ధస్త్ ప్రోగ్రాంతో పాటు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఆర్పీ ఇప్పుడు కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి హౌస్‌బోర్డ్ 3వ ఫేజ్‌లోని మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో టెక్ ఏవే ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ను ఎందరో స్టార్ హీరోలకు నటనలో మెళకువలు నేర్పిన వైజాగ్ సత్యానంద్ మాస్టార్ ప్రారంభించడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, సినిమా ప్రొడక్షన్ చీఫ్ పచ్చళ్ల ప్రకాష్, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యానంద్ మాస్టార్ మాట్లాడుతూ… ఇప్పటి వరకూ నటుడిగా ఉన్న ఆర్పీ ఇప్పుడు తనకు భిన్నమైన వృత్తిలోకి ఎంటర్ అవుతూ ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది. చేపల పులుసు కోసం హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్లే వారు నాకు చాలా మంది తెలుసు. ఆ రుచికరమైన చేపల పులుసు కోసం ఇప్పుడు వారు కూకట్‌పల్లి వస్తే చాలు. నెల్లూరులో అందించే రుచిని ఇక్కడే అందివ్వనున్నారు. ఈ సందర్భంగా ఈ తొలి బ్రాంచి రాబోయే రోజుల్లో 10 బ్రాంచ్‌లుగా మారాలని కోరుకుంటున్నా. ఆర్పీ గారికి ఆల్‌ది బెస్ట్ అన్నారు.
సినిమా ప్రొడక్షన్ చీఫ్ పచ్చళ్ల ప్రకాష్ మాట్లాడుతూ.. 600 గజాల్లో 50 లక్షల రూపాయలతో కిచెన్‌ను ఏర్పాటు చేయడం ఆర్పీ గారికి ఈ బిజినెస్ మీద ఉన్న ఆసక్తిని తెలియజేస్తోంది. నా 40 సంవత్సరాల ప్రొడక్షన్ చీఫ్ లైఫ్‌లో నాకు నచ్చక పోతే వండిన వంటకాలను పారేయించేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫుడ్ విషయంలో అంత కరెక్ట్‌గా ఉంటా. ఆర్పీ గారితో కిచెన్‌కు వెళితే అక్కడ చేపల పులుసు తిని, ఆ టేస్ట్‌కు ఫిదా అయిపోయాను. ఆర్పీ గారి శ్రద్ధకు ఆశ్చర్యం వేసింది. మరిన్ని బ్రాంచీలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా సక్సెస్ సాధిస్తామనే నమ్మకం ఉంది అన్నారు.
జబర్ధస్త్ ఆర్పీ మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు సత్యానంద్ మాస్టార్ గారు, ఆర్పీ పట్నాయక్ గారు, ప్రొడక్షన్ చీఫ్ ప్రకాష్‌గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు. వారి సమక్షంలో నా ఈ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మాది నెల్లూరు జిల్లా. నాకు చేపల పులుసు అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. నాలాగే చాలా మందికి నెల్లూరు చేపల పులుసు అంటే ఇష్టం. ఎవరైనా నెల్లూరు నుంచి వస్తుంటే చేపల పులుసు తీసుకురమ్మని చెపుతుంటారు. నేను కూడా చాలా మంది సెలబ్రిటీలకు, వీఐపీలకు కుండల్లో తీసుకువచ్చి ఇచ్చాను. ఇంతటి రుచికరమైన చేపల పులుసును హైదరాబాద్‌లో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నేను 10 సంవత్సరాల క్రితమే అనుకున్నాను. ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకు వస్తున్నాం. పూర్తిగా సంప్రదాయ పద్దతిలో కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే వండటం జరుగుతుంది. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో కూడా టై అప్ అయ్యాం. నాతో పాటు సత్తెన్న అనే నా మిత్రుడు ఇందులో పార్టనర్‌గా ఉన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ..ఎవరికీ రాని ఐడియాతో ఈ రోజు జబర్ధస్త్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’రెస్టారెంట్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది.తను సిటీ లో ఇలాంటివి అనేక బ్రాంచి లు ఓపెన్ చేసే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ.. జబర్దస్త్ ఆర్పీ అంటే నాకు ప్రత్యేక అభిమానం. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసును నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అన్నారు.