కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున గారు ఒక పాటను ఆలపించారు. ఈ పాటలకు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా అనూప్ రూబెన్స్ తో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం.
నాగార్జున గారితో సినిమా చేయడం మీకు లక్కీనా. నాగ్ సార్‌కు లక్కీనా?
ఇది టీమ్ వర్క్. లక్ అనేది దైవ నిర్ణయం. నాగార్జున గారితో సినిమా చేయడం ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావరణం కలుగుతుంది. ఆయనతో నేనే కాదు ఎవరు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్రతీ టెక్నిషియన్ ఫీలింగ్ ఇదే. దానితో ఇంకాస్త బాధ్యతగా వుండాలనుకుంటారు. నాగార్జున సార్‌తో ఇంతకుముందు చేసిన సినిమాలు హిట్ కావడం కూడా ఓ భాగం.
కొత్తమంది హీరోలకు కొంతమంది సంగీత దర్శకులు ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు ఇందులో నిజమెంతా?
నాదృష్టిలో ఎఫర్ట్ అనేది అన్ని సినిమాలకు పెడతాం. ఒక్కో హీరోతో సినిమా చేయడం అనేది మాతృ సంస్థలా ఫీలయ్యే వాతావరణం కనిపించడమే. మనకు ఏం కావాలో వారికి తెలుసు.వారు ఏం కోరుకుంటున్నారో మనకు తెలుసు. ఇదంతా కాంబినేషన్ వల్లే జరుగుతుంది. దర్శకుడు, హీరో అనే కాంబినేషన్‌లు ఔట్‌పుట్ క్లారిటీ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఫైనల్‌గా ఏ సినిమాకైనా పడే కష్టం ఒక్కటే.
సీక్వెల్‌కు సంగీతం కష్టం అనిపించిందా?
ఇంతకుముందు చేసిన సోగ్గాడే చిన్నినాయనా అనేది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానితో కాస్త ఒత్తిడి అనేది సహజమే. ఎందుకంటే దానితోనే కంపేర్ చేస్తుంటారు. అందుకే ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మంచి ఔట్‌పుట్ ఇవ్వాల్సి వుంటుంది. నాగార్జున సార్ కూడా మనకు ఓ బెంచ్ మార్క్ వుందనేవారు. అలాగే దర్శకుడు కళ్యాణ కృష్ణ కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చేశారు.
నాగార్జున గారితో పాట పాడించాలనే ఆలోచన ఎవరిది?
నేను `మనం` సినిమా చేస్తుండగా పియోరే.. సాంగ్‌ను ఆయన లొకేషన్‌లో సరదాగా పాడారు. ఆ వాయిస్ బాగా నచ్చింది. మీ వాయిస్ బాగుంది. ఓ పాట పాడండి అన్నా. అలా `సోగ్గాడే..లో డిక్కడిక్కడుండుం.. అనే ది ట్రై చేశాం. ఆ పాటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. దానికి కొనసాగింపుగా పాడించాలని బంగార్రాజులో పాడారు. ఈ పాట పాత్రపరంగా సందర్భానుసారంగా ఆయన పాడితేనే మరింత ఎఫెక్ట్ వుంటుంది. అలా సినిమాకు కలిసి వచ్చింది. దానితో మొత్తం సాంగ్ ఆయనే పాడేశారు.
పాట పాడడం కష్టమేనా?
నాకు నటించడం కష్టం. ఎవరి పని వారు చేయాలి. కానీ కొంతమంది ఏదైనా పట్టుదలతో చేసి సక్సెస్ సాధిస్తారు.
ఈ సినిమాలో మీరు యూనిక్ గా గ్రహించింది ఏమిటి?
ఇది గ్రామీణ కథ. ఏ ఒక్క సాంగ్‌కూ పాశ్చత్య పరికరాలు వాడలేదు. సాంప్రదాయంగా వుంటాయి. పల్లెటూరి ఫీల్‌ను కలిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. వెస్ట్రన్ పరికరాలు చాలా తక్కువగా వాడాం.
మొన్న నాగార్జున గారు రిలీజ్ డేట్ ప్రకటించేటప్పుడు అంతా హరీ బరీగా వర్క్ జరుగుతుంది అన్నారు. అప్పుడు మీ పరిస్థితి ఎలా వుంది?
ఈ సినిమాకు రీరికార్డింగ్ ముందుగానే పూర్తయింది. ఒకరకంగా చెప్పాలంటే తక్కువ సమయంలోనే పూర్తి చేశాం. సహజంగా పెద్ద సినిమాలకు టైం తీసుకోవాలి. కానీ ఈ సినిమాకు 12గంటలు పనిచేయాల్సింది 20గంటలు పనిచేశాం. అలా సాంకేతిక సిబ్బంది అందరూ పనిచేశారు. సినిమా కూడా నాలుగు నెలలోనే పూర్తయింది. ఇలా అందరూ చేయబట్టే అనుకున్న టైంలో వచ్చింది.
అప్పటికీ ఇప్పటికీ కళ్యాణ్ కృష్ణలో మీరు ఏం గ్రహించారు?
సోగ్గాడే.. సినిమా వచ్చి ఐదేళ్ళయింది. అప్పటికీ ఇప్పటికే దర్శకుడిలో టేకింగ్‌లోనూ పరిణితి పెరిగింది. సంబాషణలు చాలా హార్ట్ టచింగ్‌గా వుంటాయి. దర్శకుడులో చాలా క్లారిటీ వుంది.
బంగార్రాజు ఆల్బమ్ మీ అంచనాలకు రీచ్ అయిందా?
ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశాం. లడ్డుండా.. జనాలకు బాగా చేరువయింది. `నా కోసం` అనే మెలోడి సాంగ్, తస్సాదియ్యా.. బాగా ఆదరణ పొందాయి. మూడు రోజుల్లో మరో సాంగ్ రాబోతుంది.
గతంలో అన్ని పాటలు ఒకేసారి వచ్చేవి. ప్రస్తుతం ఒక్కో పాటను విడుదల చేస్తున్నారు ఈ ప్రక్రియ అనేది సినిమాకు ఏమేరకు హెల్ప్ అవుతుంది?
ఒకరకంగా ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి ఇలా చేయడమే బెటర్. బంగార్రాజులో తొలిపాటను మూడు నెలల నాడే విడుదల చేశాం. అలాగే మిగిలిన పాటలు కూడా. ఇక ఒక్కో సాంగ్‌కు ఒక్కో పత్రేకత వుంటుంది. దాని వల్ల అందరూ వినగలుగుతున్నారు. గతంలో సీడీలు పెట్టుకుని వినేవారు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఒక్కోపాటను హాయిగా వినడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో పాట విడుదల చేయడంవల్ల కొంతమందినైనా టచ్ చేస్తుంది. దాని వల్ల సినిమా చూడాలనిపిస్తుంది.
సిద్ శ్రీరామ్ కలయిక ఎలా అనిపిస్తుంది?
ఆయన పాడిన మొదటి సాంగ్ 5 మిలియన్ కు చేరువయింది. మూడు పాటలు పాడించాను. ఇంతకుమందు `మంచిరోజులు వచ్చాయి`లో కూడా పాడాడు. ఆయన గాడ్ గిఫ్టేడ్ సింగర్. ఆయన వాయిస్‌లో తెలీని సోల్ వుంటుంది. ఏ పాట పాడినా ఆహ్లాదకరంగా వుంటుంది. నాకు అది ప్లస్ అయింది. నేను మెలోడీనే ఇష్టపడతాను. ఆయన అవే పాడతారు.
మీకు బాణీలు రావాలంటే ప్రేరణ కలిగించే అంశాలేమిటి?
ముందు కథ. ఆ తర్వాత నేను ప్రయాణాలు చేస్తున్నప్పడు షడెన్‌గా ఓ ఆలోచన వస్తుంది. అ ప్రేరణలో బాణీలు కూరుస్తుంటాను.
కోవిడ్ వల్ల పనివిధానంలో ఇబ్బంది అనిపించిందా?
కష్టపడేవారికి ఎక్కడున్నా ఒక్కటే. పూర్తి లాక్‌డౌన్‌లో ఇంటిలో కుటుంబంతో గడిపే సమయం దొరికింది.
తదుపరి సినిమాలు?
`శేఖర్` సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. దానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. బాగా వచ్చింది. తర్వాత విక్ర మ్ కె. కుమార్ సినిమా వుంది.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385