మిథున్‌ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి హీరోగా మాధవ్‌ థ్రిల్లర్‌ చిత్రం

503

బాలీవుడ్‌లో ‘డిస్కోడాన్సర్‌’తో అప్పట్లో యువతను ఉర్రూతలూరించిన కథానాయకుడు మిథున్‌ చక్రవర్తి. ఆయన కుమారుడు మిమో చక్రవర్తి ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతున్నాడు. భోషో సమర్పణలో శ్రీకళా చిత్ర బేనర్‌పై రమణారావు బసవరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాధవ్‌ కోదాడ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ బాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. జర్నలిజం, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మిమో చక్రవర్తి సరసన ‘ఎయిర్‌టెల్‌’ మోడల్‌ సశాఛెత్రి నాయికగా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు 90శాతం చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రంలోని పబ్‌ సాంగ్‌ను గురువారంనాడు హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో చిత్రిస్తున్నారు.

చిత్రం గురించి చిత్ర దర్శకుడు మాధవ్‌ కోదాడ మాట్లాడుతూ.. ఇందులో కథరీత్యా భారీతారాగణం నటిస్తున్నారు. మహేష్‌ మంజ్రేకర్‌, మురళీశర్మ, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్‌, షిండే, రవికాలే వంటి ప్రముఖులు నటిస్తున్నారు. ఈరోజు తామనుకున్న సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ చేసుకునే పార్టీ నేపథ్యంగా ఈ సాంగ్‌ వుంటుంది. శేఖర్‌ చంద్ర అందించిన బాణీలకు ప్రేమ్‌ రక్షిత్‌ చక్కటి నృత్యరీతులు సమకూర్చారు. బెల్లీడాన్స్‌గా చిత్రిస్తున్న ఈ సాంగ్‌లో రష్యన్‌ డాన్సర్లు నర్తించడం విశేషం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని’ అన్నారు.

నిర్మాత రమణారావు బసవరాజు తెలియజేస్తూ… ‘’థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. దర్శకుడు మాధవ్‌ మల్టీమీడియాలో గోల్డ్‌మెడల్‌ పొందిన వ్యక్తి. తన ఆలోచనలు వినూత్నంగా వున్నాయి. కథ చాలా బాగా వచ్చింది. ఇప్పటికి దాదాపు 95శాతం చిత్రీకరణ పూర్తయింది. ఓ పాట, ఫైట్‌ చిత్రీకరిస్తే మొత్తం పూర్తవుతుంది. ఫిబ్రవరిలో ఫస్ట్‌లుక్‌, చిత్ర టైటిల్‌ను ప్రకటిస్తాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ’’ని తెలిపారు.

”తెలుగు చిత్రసీమలో ప్రవేశించడం చాలా ఆనందంగానూ గౌరవంగా భావిస్తున్నాననీ, స్క్రిప్ట్‌ చాలా ఆసక్తిదాయకంగా వుంటుందనీ, తర్వాత ఏమిటనే ఆసక్తితో ప్రేక్షకుడ్ని ఉత్కంఠరేకెతిస్తుందని” కథానాయకుడు మిమో చక్రవర్తి వెల్లడించారు. ”ఈ చిత్రం చూసే ప్రేక్షకుడికి ఆసక్తికల్గిస్తుందనీ, తెలుగులో పరిచయం కావడం చాలా ఆనందంగా వుందనీ, చిత్రయూనిట్‌ డెడికేషన్‌ తనకెంతో స్పూర్తినిచ్చిందని” నాయిక సశాఛెత్రి పేర్కొన్నారు. మహేష్‌ మంజ్రేకర్‌ తెలుపుతూ.. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం వినూత్నంగా వుంటుంది. మిథున్‌ చక్రవర్తి మంచి స్నేహితుడు. ఆయన కుమారుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో నేను ఓ కీలక పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జయపాల్‌ నిమ్మల, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఫైట్స్‌: శంకర్‌, సహ నిర్మాత: మారుతీ శ్యాంప్రసాద్‌రెడ్డి