మిషన్ ఇంపాజిబుల్ ఎవ‌రినీ నిరాశ‌ పరచదు, న‌న్ను న‌మ్మి సినిమా చూడండి – మెగాస్టార్ చిరంజీవి

421

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్ల‌లు గా రోష‌న్‌, బానుప్ర‌కాష్, జైతీర్థ న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌ లోని ఓ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగా గెస్ట్‌ గా మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని ఫంక్ష‌న్ల‌కు ప్రేమ‌తో వ‌స్తాం. అలా నిర్మాత నిరంజ‌న్‌ రెడ్డిపై వున్న సోద‌ర ప్రేమ‌తో వ‌చ్చాను. చాలా త‌క్కువ స‌మ‌యంలో నాకు అత్యంత ఆప్తుడిగా, సోద‌రుడిలా క‌లిసిపోయాడు. ఒక‌వైపు సుప్రీం కోర్డు లాయ‌ర్‌ గా బాధ్య‌త‌లు నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా వున్నా మ‌రోవైపు సినిమాలు తీయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగింది. నాతో ఆచార్య చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ చేశారు. ఈ సినిమా గురించి నాకు చెబుతూ ద‌ర్శ‌కుడి తీసిన `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు నేను చూడ‌లేక‌పోయా. ఇప్పుడు త‌ప్ప‌కుండా చూస్తాను. నేను చేసిన చంట‌బ్బాయ్ స్పూర్తి అని ద‌ర్శ‌కుడు అన్నాడు. మంచి కాంబినేష‌న్ కుదిరింది. నిర్మాత నిరంజన్ వైల్డ్ డాగ్ సినిమా తీసిన‌ప్పుడు న‌న్ను పిల‌వ‌లేదు. నా ఫ్రెండ్ నాగార్జున పిలిచాడు అంటూ స‌ర‌దాగా గుర్తు చేశారు.