మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతోన్న భారీ హిస్టారికల్ మూవీ `సైరా నరసింహారెడ్డి`. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ లెవల్లో ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్, నిర్మాత రామ్‌చరణ్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. సైరా నరసింహారెడ్డి`లో నిజమెంత? ఫిక్షన్ ఎంత? సురేందర్ రెడ్డి: మాకు దొరికిన ఆధారాలను బట్టి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేశాం. కథలో భాగంగా.. కథ డిమాండ్ చేయడంతోనే అమితాబ్‌గారిని, సుదీప్, విజయ్ సేతుపతిగారిని తీసుకున్నాం.
ఈ సినిమా కోసం చేసిన రీసెర్చ్‌ను సినిమాగా ఎలా మలిచారు?
సురేందర్ రెడ్డి: నరసింహారెడ్డిగారి గురించి సినిమా స్టార్ట్ చేయడానికి ముందు చాలా తక్కువగా తెలుసు. 6 నెలలు పాటు రీసెర్చ్ చేశాను. పుస్తకాలు చదివాను. ఇప్పుడు నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిగారు రేనాటి సూర్యచంద్రులు అనే ట్రస్ట్‌కి ఆయన అధ్యక్షుడు. ఆయన్ని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆయనపై ఉన్న ఉన్న పుస్తకాన్ని నాకు బ్రహ్మానందరెడ్డిగారు ఇస్తూనే అప్పటి గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఓ స్టాంప్‌ను కూడా ఇచ్చారు. మద్రాస్‌కెళ్లి గెజిట్స్ తీసుకొచ్చి రీసెర్చ్ చేశాం. అందులోని కొన్ని ఆధారాలు.. నేను తెలుసుకున్న ఆధారాలను ఆధారంగా చేసుకుని సినిమా చేశాను.
చిరంజీవి లుక్, యాక్షన్ పార్ట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు?
రామ్‌చరణ్: లుక్‌కి సంబంధించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్‌గారు, ఆయన టీమ్ చాలా కేర్ తీసుకుని అద్భుతంగా చేశారు. ఆయనపై చేసిన డిజైన్స్ చక్కగా కుదిరాయి.
పవన్ కల్యాణ్ వాయిస్ ట్రైలర్‌కే పరిమితమా?
రామ్‌చరణ్: సినిమాలో కూడా ఉంటుంది
సురేంర్‌రెడ్డితో ఈ సినిమా చేయాలనే నమ్మకం ఎప్పుడు వచ్చింది?
రామ్‌చరణ్: సురేందర్ రెడ్డిగారు సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌పార్ట్ బాగా ఉంటుంది. అయితే ధృవ చేసిన తర్వాత ఆయన ఇన్‌టెన్స్ సినిమా కూడా చేయగలరని అర్థమైంది. అదే నమ్మకంతో ముందుకెళ్లాం.
మీరు డైరెక్ట్ చేయాలని అనగానే మీకేమనిపించింది?
సురేందర్ రెడ్డి: నేను నిజంగా ఊహించలేదు. నేను నిర్ణయం తీసుకోవడానికి 15 రోజులు సమయం అడిగాను. ఇంత బడ్జెట్‌లో చిరంజీవిగారితో ఈ స్కేల్ మూవీ చేయగలనా? అని ఆలోచించుకోవడానికి ఆ సమయం తీసుకున్నాను. అప్పుడు నాకు చిరంజీవిగారు మాత్రమే కనపడ్డారు. ఆయనెంత కష్టపడి ఎంత ఎత్తుకు ఎదిగారనేదే కనపడింది. ఆయన ఇన్‌స్పిరేషన్, చరణ్‌గారు వెనక ఉన్నారనే ధైర్యంతోటే ముందుకు వెళ్లగలిగాను.
సైరా నరసింహారెడ్డి సినిమా చేయడానికి కారణమేంటి?
రామ్‌చరణ్: ఇది నాన్నగారు 10 ఏళ్ల నుండి చేయాలనుకుంటున్న సినిమా. కరెక్ట్ సమయంలో, కరెక్ట్ బడ్జెట్‌తో చేసిన సినిమా. ఇది నాన్నగారి కోరిక.
ఇంత ప్రెస్టీజియస్ సినిమాలో చిరంజీవితో మీరు ఎందుకు నటించలేకపోయారు?
రామ్‌చరణ్: అక్టోబర్ 2 ఎప్పుడొస్తుందా? అని ఓ నిర్మాతగా ఎదురుచూస్తున్నాను. మా టీమ్ అందరం పనిచేసిన తీరు చూసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాకు నిర్మాతగా అవకాశం దక్కడమే ఎక్కువ.
నిర్మాతగా ఈ సినిమా చేయడం ఎంత కష్టమనిపించింది?
రామ్‌చరణ్: చాలా కష్టమనిపించింది. నాన్నగారికి కావాల్సిన సినిమా చేయడమే కాదు.. కథకు కావాల్సిన సినిమా కూడా చేయాల్సిన అవసరం ఉంది. నాన్నగారు, పరుచూరిగారు కలిసి చేసిన ఆలోచన. అది తెరపైకి రావాలంటే డబ్బులో, దర్శకుడో ఉంటే సరిపోదు. చాలా రెస్పెక్ట్‌తో చేయాలి. చాలా ప్యాషన్‌తో చేయాలి. అదే గౌరవంతో సినిమా చేశాం.