మత్తువదలరాను అందరూ ఆదరిస్తున్నారు!

717


మత్తువదలరా చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాడు దర్శకుడు రితేష్‌రానా.పరిమిత వ్యయంతో , నవ్యమైన కథ, కథనాలతో మత్తువదలరాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నాడు. మైత్రీమూమీమేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చిన ఈ చిత్రం విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా దర్శకుడు రితేష్ రానా శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో సంభాషిచారు. ఆ విశేషాలివి..
తొలిసినిమా అవకాశం ఎలా వచ్చింది?
ఓ కామన్‌ఫ్రెండ్ రిఫరెన్స్‌తో మైత్రీమూవీ మేకర్స్ చెర్రిగారిని కలవడం జరిగింది. మూడేళ్ల క్రితం ఆయనకు ఈ కథ చెప్పాను. కొత్తవాళ్లమైనా మా ప్రతిభ మీద నమ్మకంతో ఈ సినిమా బాధ్యతల్ని అప్పజెప్పారు. వారు ఆశించిన విధంగా సినిమాకు న్యాయం చేశామని భావిస్తున్నా.
సినిమా మీరు అనుకున్న విజయాన్ని సాధించిందా?
అన్ని కేంద్రాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మా టీమ్ అందరికతో కలిసి హైదరాబాద్ థియేటర్స్‌లో సినిమా చూశాం.కథలోని సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. తక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం వల్ల అందరికి సినిమా చూసే అవకాశం లభించడం లేదు. మరికొన్ని థియేటర్లు పెరిగితే సినిమా అందరికి చేరువవుతుందని అనుకుంటున్నా.
మూడేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేస్తున్నారు. సెట్స్‌మీదక వెళ్లే సరికి స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు జరిగాయా?
కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. తొలుత అనుకున్న స్క్రిప్ట్‌నే తెరకెక్కించాం. మైత్రీమూవీమేకర్స్ మా టీమ్‌ను పూర్తిగా విశ్వసించారు. దాంతో మేము కోరుకున్న విధంగా సినిమాను తెరపైకి తీసుకొచ్చాం. హూ డన్ ఇట్ అనే జోనర్‌లో ఈ స్క్రిప్ట్‌ను రాసుకున్నాం. క్రైమ్ చేసిన వ్యక్తిని అన్వేషిస్తూ చేసే ఉత్కంఠభరిత ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం.
తొలి చిత్రానికే మైత్రీమూవీ మేకర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అవకాశం దక్కించుకోవడం ఎలా అనిపించింది?
అంతటి పేరున్న సంస్థ కాబట్టే ఈరోజు సినిమా ప్రేక్షకులకు చేరువైంది. లేదంటే విడుదల కోసమే చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. పెద్ద సంస్థలో అవకాశం వచ్చింది కాబట్టి మమ్మల్ని మేము నిరూపించుకోవాలనే తపనతో పనిచేశాం. ప్రతి విషయంలో నిజాయితీగా శ్రమించాం కాబట్టే సినిమాకు అంతటా ప్రశంసలు లభిస్తున్నాయి.
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి తనయులతో కలిసి ఈ సినిమాకు పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
మా కథకు శ్రీసింహా బాగా కుదిరాడు. తన బ్యాక్‌గ్రౌండ్‌ను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా సినిమా కోసం కష్టపడ్డాడు. మేము కూడా అతన్ని ఓ న్యూకామర్‌లాగానే ట్రీట్ చేశాం. ఆడిషన్స్ చేసిన తర్వానే అతన్ని ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నాం. అతని కుటుంబ సభ్యులెవరూ కూడా సినిమా విషయంలో జోక్యం చేసుకోలేదు. కాలభైరవ కథానుణంగా మంచి నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు.
టీవీ సీరియల్ ఎపిసోడ్‌లో మంచి వినోదం పండిందని ప్రశంసలు లభిస్తున్నాయి?
అవును. ఓ తమిళ ధారావాహిక స్ఫూర్తితో ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశాను. ఆ సీరియల్ ప్రహససం థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నది.
ఇండస్ట్రీ వారు సినిమా గురించి ఏమంటున్నారు?
రాజమౌళిగారు మూడుసార్లు సినిమా చూశారు. ఆయన ట్విట్టర్ ద్వారా మా టీమ్‌ను అభినందించారు. తొలిప్రయత్నంలోనే మంచి సినిమా చేశారని మెచ్చుకున్నారు.

ఓ మిస్టరీ థ్రిల్లర్‌ను కొత్త పంథాలో ఆవిష్కరించాలనుకున్నాం. ఈ స్టోరీకి పాటలు, ఫైట్స్ అవసరం లేదనిపించింది. పాటలు కథను ముందుకు నడిపించేవిగా ఉండాలి. ఉత్కంభరితమైన కథనం, అనూహ్య మలుపులతో సినిమా ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురిచేస్తున్నది.