క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. ఇందులో రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా, సుకుమార్ విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫస్ట్ టికెట్ అల్లు అర్జున్ గారికి ప్రజెంట్ చేశారు. ‘టికెట్ ఎంత పెట్టి కొంటున్నారు?’ అని సుమ అడగ్గా… ”సుకుమార్ గారి సినిమా. కోటి రూపాయలు అయినా పెడతా” అని చెప్పారు అల్లు అర్జున్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… ”నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను… హీరోని చూసి అందరూ ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్‌ను చూసి హీరో అయ్యా. సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మిమ్మల్ని ఇంకోసారి ఇంత ఇబ్బంది పెట్టను. ఎక్కువ సినిమాలు చేస్తా. సుకుమార్ గారి వైఫ్ తబితా సుకుమార్ గారు ప్రొడ్యూస్ చేశారు. ‘పుష్ప 2’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు వచ్చి ఒక్కటే మాట అడిగారు… ‘బన్నీ గారు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా. ఎలాగో సుకుమార్ గారు వస్తారు. మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతా’ అన్నారు. ‘పుష్ప 2’ విషయానికి వస్తే… సాధరణంగా ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే నాకు భయం ఉంటుంది. సినిమా ఎలా వచ్చింది? అనేది జనం చెప్పాల్సిన విషయం. అందుకు భయపడతా. కానీ, ‘పుష్ప 2’ సినిమా వస్తున్న విధానం అభిమానులకు నచ్చుతుంది. డిసెంబర్ 6న అసలు తగ్గేది లే. ఇది మాత్రం ఫిక్స్” అని అన్నారు.
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మాట్లాడుతూ… ”మా ఆవిడ ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఈవెంట్ దగ్గర ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఏమీ అనుకోవద్దు. మా ఆవిడ సినిమా చూసింది. పగలబడి నవ్వానని చెప్పింది. మా ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకు వెళ్ళింది. అందరికీ సినిమా నచ్చింది. నన్ను చూడమని చెప్పింది. నాకు టైం దొరకడం లేదు. ఒక రోజు హోమ్ థియేటర్లో చూశా. నాకు చాలా బాగా నచ్చింది. కానీ, ఇప్పుడు ఉన్న బిజీలో సినిమా మీద కాన్సంట్రేట్ చేసి రిలీజ్ చేయడం కష్టమని చెప్పా. ‘మంచి సినిమా. నేను వదలను. చేస్తా’ అని చెప్పింది. రావు రమేష్ గారి లాంటి నటులు హీరో పాత్రలు చేస్తే చాలా కథలు బయటకు వస్తాయి. బన్నీకి స్టార్ కంటే ముందు పెర్ఫార్మన్స్ చేయాలని ఉంటుంది. రావు రమేష్ గారికి అటువంటి పెర్ఫార్మన్స్ చేసే అవకాశం దొరికింది. క్లైమాక్స్ వచ్చేసరికి నాకు కళ్ల వెంట నీళ్లు వచ్చాయి. రావు రమేష్ గారికి ప్రతిదీ ఫస్ట్ టేక్ లో చేశానని చెప్పారు. లక్ష్మణ్ కార్య అద్భుతంగా తీశాడు. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తబితా సుకుమార్ మాట్లాడుతూ… ”నా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ గురించి తెలిసింది. లక్ష్మణ్ కార్యను కలిసినప్పుడు సినిమా చూడమని అడిగారు. అప్పటికి సినిమా పూర్తి కాలేదు. ఒక సాంగ్ తీయాలి. ఆ టైంలో చంద్రబోస్ గారికి ఫోన్ చేసినప్పుడు సాంగ్ రాయడానికి ఒప్పుకొన్నారు. చిన్న సినిమా అని చూడలేదు. భాస్కరభట్ల రాసిన పాటలు సినిమాకు హెల్ప్ అయ్యాయి. నేను అడిగిన వెంటనే ట్రైలర్ ట్వీట్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ ఈవెంట్‌కి వచ్చిన బన్నీ గారికి థాంక్స్. పుష్ప 2 క్లైమాక్స్ షూట్ అవుతుంది. బన్నీ గారు, సుక్కు చాలా బిజీ. రాలేనని బన్నీ గారు చెప్పొచ్చు. కానీ, నేను వెళ్లి ఫస్ట్ టైమ్ ప్రజెంట్ చేస్తున్నానని, రావాలని అడిగినప్పుడు ‘తబితా గారు… మీరు ఫ్యామిలీ అండీ, మీ కోసం తప్పకుండా వస్తా. అది నా బాధ్యత’ అన్నారు. ఆయనకు థాంక్స్. రావు రమేష్, అంకిత్ కాంబినేషన్ సీన్స్ చూసి క్రేజీగా ఫీలయ్యాను. నాకు సినిమాలో ఇంద్రజ గారి డ్యాన్స్ సీక్వెన్స్ చాలా ఇష్టం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్టు 23న అందరూ సినిమా చూడండి” అని అన్నారు.
రావు రమేష్ మాట్లాడుతూ… ”నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంలోనో, జీవితంతోనో పోరాటం చేస్తూ ఉంటాడు, వాళ్ళ పట్ల దయతో ఉండండి – నేను ఇది చెబితే సీరియస్ గా ఉంటుంది. ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే… మా నాన్న అల్లు అరవింద్ గారు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటుంటే అతడిదొక యుద్ధం. కానీ, అతనితో దయగా ఉండాలి. మారుతి నగర్ సుబ్రమణ్యానిది ఓ యుద్ధం. రామ్ చరణ్ గారు బిజీగా ఉన్నా ట్రైలర్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఆయనకు థాంక్స్. బన్నీ గారు, సుకుమార్ గారితో ‘పుష్ప 2’ షూటింగ్ చేస్తున్నాను. వాళ్లిద్దరూ ఇక్కడికి వస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. వాళ్లను ఇక్కడికి తీసుకు రావడం తబిత గారికి మాత్రమే సాధ్యమైంది. ఆవిడ డైనమిక్ లేడీ. దయచేసి ఆగస్టు 23న థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేసే చిత్రమిది” అని అన్నారు
నిర్మాత శ్రీహరి మాట్లాడుతూ ”రావు రమేష్ గారికి నటనలో తెలియని మెళకువలు ఉండవు. ఆయన ఇరగదీశారు. ఇంద్రజ గారు, అంకిత్, రమ్యతో పాటు నటీనటులు అందరూ బాగా చేశారు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ‘మేడమ్ సార్ మేడమ్..’ సాంగ్ పెద్ద హిట్ చేశారు. థాంక్స్. మా పర్వతం తబిత సుకుమార్ గారు, సుకుమార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సినిమాను తబిత గారు చూడటం మేము ఏ జన్మలో చేస్తున్న అదృష్టమో తెలియదు. ఆవిడ వల్ల సినిమా ఈ స్థాయికి వచ్చింది. సుకుమార్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. తబిత గారితో పాటు సినిమా ఇండస్ట్రీ అందరికీ నచ్చిందంటే కారణం లక్ష్మణ్ కార్య దర్శకత్వం. తను నా ఫ్రెండ్” అని అన్నారు.
నిర్మాత పీబీఆర్ సినిమాస్ బుజ్జి మాట్లాడుతూ… ”బన్నీ గారికి, ఆయన అభిమానులకు నమస్కారం. తబిత గారి సాయంతో సినిమాను ఈ స్థాయికి తీసుకు వచ్చాం. రావు రమేష్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నటీనటులు అంతా బాగా చేశారు. ఆగస్టు 23 నుంచి థియేటర్లలో సినిమా చూడండి” అని చెప్పారు.
నటి బిందు మాట్లాడుతూ… ”ఈ సినిమాలో నేను హీరోయిన్ రమ్య పసుపులేటి అమ్మ పాత్ర చేశా. అంకిత్ కొయ్య కామెడీ టైమింగ్ బావుంది. రావు రమేష్ గారితో ఏ సినిమా చేసే అవకాశం దొరికినా ఆయన దగ్గర యాక్టింగ్ క్లాసులు తీసుకుంటా. ఆయన నా ఇన్స్పిరేషన్, నా గైడ్, నా మోటివేషన్. హర్షవర్ధన్ గారు, నేను భార్యాభర్తలుగా నటించిన మూడో చిత్రమిది. సినిమా ప్రజెంట్ చేస్తున్న తబిత సుకుమార్ గారికి థాంక్స్. ముఖ్య అతిథులుగా వస్తున్న అల్లు అర్జున్, సుకుమార్ గారికి థాంక్స్. నేను ‘పుష్ప 2’లో నటిస్తున్నా” అని చెప్పారు.
సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ… ”అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అందరికీ సాంగ్స్. ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పదం తీసుకుని సాంగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేశా. బన్నీ గారి ఫ్యాన్స్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా కూడా మామూలుగా ఉండదు. అంత అందంగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, పీబీఆర్ సినిమాస్ ప్రసాద్, లోకమాత్రే సినిమాటిక్స్ మోహన్ కార్యతో పాటు పలువురు ప్రముఖులు, చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు.