“మనుషుల్లో దేవుడు చంద్రన్న ” పాట ఆవిష్కరణ

36

విజయవాడ నగరంలో వరద సృష్టించిన విధ్వంసంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు అందించిన నిరుపమాన సేవలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. చంద్ర బాబు నాయుడు అవిరళ కృషి, అసమాన పట్టుదల చూసి ఒక స్ఫూర్తివంతమైన పాటను రచించానని గుమ్మడి గోపాలకృష్ణ తెలిపాడు . “మనుషుల్లో దేవుడు చంద్రన్న” అన్న ఈ పాటను నిర్మాత కె .ఎస్ .రామారావు ఆవిష్కరించారు .
మాదాపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి, ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ మాట్లాడుతూ – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంత యోధుడు, ప్రజలకోసం పనిచేసే నాయకుడు, విజయవాడ ప్రజల ఇక్కట్లను, కన్నీటి గాధలను స్వయంగా చూసి, వయసును కూడా మర్చిపోయి రాత్రి, పగలు సేవలు అందించారు. ఆ సేవలకు స్పందించిన గుమ్మడి గోపాలకృష్ణ రాసి, గానం చేసి , స్వర పరచిన ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది అన్నారు .
నిర్మాత రామారావు మాట్లాడుతూ – గుమ్మడి గోపాలకృష్ణ తయారు చేసిన ఈ పాట ఎంతో ఆర్ధవతంగా, సహజంగా వుంది, చంద్ర బాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం అదృష్టం . ఆయన సేవలతో విజయవాడ నగరం త్వరంగా తేరుకుంది అని చెప్పారు .
గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ – చంద్ర బాబు నాయుడు గారంటే నాకు ఎంతో అభిమానం, ఆయన అధికారంలోకి రావాలని ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో పాటలను గానం చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన ప్రజలకోసం నిరంతరం శ్రమిస్తూ చేస్తున్న సేవలు అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో “మనుషుల్లో దేవుడు ” పాటను రూపొందించానని చెప్పారు .