ఎన్టీఆర్ బావకి ‘మ్యాడ్’ సినిమా చాలా నచ్చింది: కథానాయకుడు నార్నే నితిన్

96

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ వినోదాత్మక చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. రోజురోజుకి వసూళ్ళను పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చిత్ర బృందం తమ ఆనందాన్ని పంచుకున్నారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “కళ్యాణ్ ముందు నాకు ఒక కథ చెప్పి, నేను ఓకే అనుకొని, హీరో డేట్స్ కుదరకపోవడంతో లేట్ అయింది. ఆ టైంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇంకో సినిమా చేద్దాం అనుకొని, బాబాయ్(చినబాబు గారు)కి ఈ కథ చెప్పమన్నాను. కథ చెప్పిన దగ్గర నుంచి రిలీజ్ రోజు దాకా ప్రతిరోజూ బాబాయ్ తోనే డిస్కస్ చేశాడు. బాబాయ్ ఆల్మోస్ట్ ఒక రైటర్ లాగా ఈ సినిమా కోసం ఎఫర్ట్ పెట్టారు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమాని ఎంతో క్రిస్ప్ గా, ప్రతి పంచ్ పేలేలాగా ఎడిట్ చేశాడు. బాబాయ్, నవీన్ నూలి ఇద్దరూ ఈ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా ఎంతో ఎఫర్ట్ పెట్టారు. అలాగే మీడియా కోసం ఫ్యామిలీలకు ఈ సినిమా ప్రత్యేక షో వేస్తాము” అన్నారు.

నిర్మాత హారిక మాట్లాడుతూ.. “మా సినిమాని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. నాకు సపోర్ట్ గా నిలిచిన నాన్న గారికి, వంశీ అన్నకి థాంక్స్. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. “మాది చిత్తూరు జిల్లా మంగళంపేట. ఆరు దాటితే బస్సు లేని ఊరి నుంచి వచ్చాను. జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు మీడియం. అక్కడి నుంచి ఇక్కడిదాకా రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెండు త్రివిక్రమ్ శ్రీనివాస్. కళ్యాణ్ గారి పేరు నా పేరులో పెట్టుకున్నా, త్రివిక్రమ్ పేరు నా గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయడం మొదలుపెట్టాను. ఆ ఇద్దరి స్ఫూర్తితో ఇక్కడి వరకు వచ్చాను. ఆ తర్వాతి స్థానం అనుదీప్ ది. అనుదీప్ ని కలిసినప్పుడే ఇతను గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. మ్యాడ్ లాంటి సినిమా రావడానికి జాతిరత్నాలే పునాది. ఇక నాగవంశీ అన్నని కలవడం నా లైఫ్ లో గొప్ప ఛేంజ్. మ్యాడ్ కథ చినబాబు గారికి నచ్చడంతో నాతో పాటు దాదాపు 40 మంది లైఫ్ మారిపోయింది. మ్యాడ్ టీం కోసం వెతుకుతుంటే సంగీత్, రామ్ నితిన్, నార్నే నితిన్ ఇలా ఒక్కొక్కరిగా ప్రాజెక్ట్ లోకి వచ్చారు. విష్ణు లేట్ గా ప్రాజెక్ట్ లోకి వచ్చినా హీరోల కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రైలర్ రిలీజ్ చేసి మా సినిమాకి హైప్ తీసుకొచ్చారు. ఆయన హ్యాండ్ ఎంత మంచిదో మళ్ళీ రుజువైంది. మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు ట్వీట్ చేసి మాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విశ్వక్ సేన్ గారు సినిమా చూసి బాగుందని ట్వీట్ చేశారు. రవితేజ గారు ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఎనర్జీ ఇచ్చింది” అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. “నేను ముందుగా దర్శకుడు కళ్యాణ్ అన్నకి థాంక్స్ చెబుతున్నాను. తర్వాత ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నాను. మేము మంచి కామెడీ సినిమా చేశామని తెలుసు కానీ, మీ ఇంత ఎంజాయ్ చేస్తారని అసలు ఊహించలేదు. మేము అనుకున్నదానికంటే ప్రేక్షకులు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ థాంక్స్” అన్నారు.

కథానాయకుడు నార్నే నితిన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే. కళ్యాణ్ అన్న ఇంకా చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టాలి. ఆ హిట్లలో మేము ఉండాలి. ఈ సినిమాని మా అక్క(లక్ష్మి ప్రణతి), బావ(జూనియర్ ఎన్టీఆర్) చూశారు. బావకి సినిమా చాలా నచ్చింది. అక్కకి డబుల్, ట్రిపుల్ నచ్చింది. పిల్లలైతే నితిన్ మామ నితిన్ మామ అంటూ బాగా ఎంజాయ్ చేశారు. డైరెక్టర్ ని, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వంశీ అన్నకి, హారికకి, చినబాబు గారికి థాంక్యూ వెరీ మచ్.” అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మనోజ్ పాత్రకి న్యాయం చేయగలనని నమ్మిన డైరెక్టర్ కళ్యాణ్ గారికి థాంక్స్. మమ్మల్ని నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేసిన చినబాబు గారికి, హారిక గారికి, వంశీ గారికి థాంక్స్. షూటింగ్ టైంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతో సపోర్ట్ చేశారు. నా తోటి నటుల నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కోటి నేర్చుకున్నాను. సంగీత్, విష్ణు నుంచి కామెడీ టైమింగ్ నేర్చుకున్నాను. నితిన్ నుంచి యాక్షన్(ఫైట్స్) నేర్చుకున్నాను.” అన్నారు.

శ్రీ గౌరీ ప్రియా రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరిని చిన్న సైజు పిచ్చి అయితే ఉంటుందని నేను నమ్ముతాను. మా అందరి పిచ్చి, క్రేజీ నెస్ ఒకే లెవెల్ లో ఉండటం వల్ల.. మేము ఇచ్చిన అవుట్ పుట్ 10, 20 రెట్లు మ్యాడ్ అయిపోయింది. మా సినిమాని పిచ్చిగా ప్రేమించాం, పిచ్చిగా కష్టపడ్డాం. మా సినిమా మీ అందరికీ నచ్చాలి, మంచి హిట్ కావాలని కోరుకున్నాం. సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మా లాంటి కొత్తవాళ్ళకి ఇది ఎంతో ఎనర్జీ ఇస్తుంది. ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తుంటాం, మీరు ఇలాగే ఆదరించండి. నా ఇంత అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్యూ సో మచ్” అన్నారు.

గోపికా ఉద్యాన్ మాట్లాడుతూ.. “గత ఏడాది అక్టోబర్ లో సినిమా ప్రారంభమైంది. ఈ అక్టోబర్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా అవకాశం ఇచ్చిన చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి, దర్శకుడు కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం కావడం గర్వంగా ఉంది. ఇంకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది” అన్నారు.

ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించిన దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ.. “ఈ మధ్య కాలంలో నేను థియేటర్లలో ఏ సినిమాకి ఇంత రెస్పాన్స్ చూడలేదు. థియేటర్లలో ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాతగా మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్న హారిక గారికి శుభాకాంక్షలు. కొత్తవారిని ప్రోత్సహిస్తూ ఈ సినిమాని చేసిన నాగవంశీ గారికి థాంక్స్. ఎవరైనా ఇంకా చూడకపోతే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. “ఒక రైతు పండించిన పంటని కొన్ని కోట్ల మంది స్వీకరిస్తారు. కానీ రైతు ఎక్కడా ఇది నేను పండించిన పంట, మీరు తింటున్నారని చెప్పడు. అలాగే ఈ భూమ్మీద ఎన్నో వృక్షాలు, జీవులు ఉన్నాయి. అవన్నీ బ్రతకడానికి అవకాశం ఇచ్చింది భూమి. కానీ భూమి ఆ ప్రేమని ఎప్పుడూ బయటకు చెప్పదు. అలాగే ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ రాత్రిబవళ్ళు నిద్రపోకుండా నా దగ్గరకు వచ్చి అలా కావాలి, ఇలా కావాలి అంటూ పాటలు, నేపథ్య సంగీతం విషయంలో ప్రతిదీ దగ్గరుండి ఎంతో కష్టపడి చూసుకున్నాడు. ఆయన కష్టం చెప్పడానికి నా దగ్గర మాట లేదు, పాట లేదు. ఆ కష్టం వల్లే ఆ దేవుడు, ప్రేక్షకుల ఆశీస్సులతో ఇంత పెద్ద విజయం దక్కింది” అన్నారు.