చిత్రం “క్షీరసాగర మథనం”తో దర్శకుడిగా మారుతున్న అనిల్ పంగులూరి !!

662

ఐ.టి రంగం నుంచి సినిమా దర్శకత్వంలోకి వచ్చినవాళ్లంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో ‘అనిల్ పంగులూరి’ అనే మరో పేరు చేరుతోంది. ఓ ప్రఖ్యాత బహుళ జాతీయ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్న అనిల్ ‘క్షీరసాగర మథనం’ పేరుతొ ఓ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు నవలా రారాణిగా అలరారిన యద్దనపూడి సులోచనారాణికి ఈయన స్వయంగా మనవడు కావడం విశేషం. ‘పిట్టకథ’ ఫేమ్ సంజయ్ రావ్ (ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు), మానస్ నాగులపల్లి హీరోలు. మహేష్ కొమ్ముల, ప్రియాంత్, గౌతమ్ ముఖ్య పాత్రధారులు. అయిదు కథల సమాహారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షత సోనావల, చరిష్మా శ్రీకర్ హీరోయిన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ రూపొందిస్తున్న ‘మేజర్’లో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రదీప్ ‘క్షీర సాగర మథనం’లో విలన్ గా నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ టర్నెడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి.. తన గురించి.. తన సినిమా ‘క్షీర సాగర మథనం’ గురించి పలు విషయాలు వెల్లడించారు!!

>>హాయ్ అనిల్ గారు.. ముందుగా మీ గురించి చెబుతారా?
మాది ఒంగోలు. అక్కడే బి.ఎస్.సి(కంప్యూటర్స్) వరకు చదువుకుని, ఎం.బి.ఏ వైజాగ్ లోని బుల్లయ్య కాలేజ్ లో చేశాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మా అమ్మమ్మగారు కావడంతో చిన్నప్పటి నుంచి సాహిత్యంలోనూ ప్రవేశం ఉండేది. మా తాతగారు పంగులూరి సుబ్బారావుగారు అన్నపూర్ణ పిక్చర్స్ లో మేనేజర్ గా పని చేసేవారు. ఇక.. పలువురు ప్రముఖ దర్శకులతో సన్నిహిత సంబంధాలు కలిగి, కొన్ని చిత్రాలకు కథలు అందించిన గౌరీ శంకర్ మా కాలేజీ లెక్చరర్. ఆయన తన కథల గురించి, సినిమాల గురించి నాతో చర్చిస్తూ ఉండేవారు. ఆ విధంగా నాకూ సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది.

>> ‘క్షీర సాగర మథనం’ ఎలా శ్రీకారం చుట్టుకుంది?
ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్న నేను.. వేరే నిర్మాతలను కలవడం కోసం.. అదేపనిగా తిరిగేందుకు తగిన టైమ్ కేటాయించలేని పరిస్థితుల్లో.. నేనే స్వయంగా దర్శకత్వం, నిర్మాణం చేపట్టాను. అప్పటికే నేను నా కథను కనీసం ఓ వంద మందికి చెప్పెను. వాళ్ళల్లో ఏ ఒక్కరూ కథ బాలేదని చెప్పలేదు. దాంతో ఎవరి చుట్టో తిరగడం ఎందుకని.. నా ఫ్రెండ్స్ తో కలిసి ‘క్షీర సాగర మథనం’ చిత్రానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రఖ్యాత ఐ.టి కంపెనీల్లో పని చేస్తున్న నా మిత్రులు ఓ 20 మంది ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్నారని చెప్పడానికి గర్వపడతాను.

>> క్లుప్తంగా కథ ఏంటో చెబుతారా?
ఇందులో అయిదు కథలు ఉంటాయి. ఐదూ సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ‘వేదం, చందమామ కథలు’ చిత్రాల తరహాలో ఉంటుంది. ఈ చిత్రాల్లో లేని థ్రిల్లింగ్ ఎలిమెంట్ ‘క్షీర సాగర మథనం’లో ఉంటుంది. తెలుగు తెరపై ఇంతవరకు ఈ తరహా చిత్రం ఇదే మొదటిసారి అని చెప్పగలను. ఈ జోనర్ ను ‘ఆంథోలజీ విత్ థ్రిల్లర్’ అని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.

>> సినిమాను ఎన్ని రోజుల్లో, ఎక్కడెక్కడ తీశారు?
41 రోజుల్లో.. హైదరాబాద్, వికారాబాద్ లోని సుమారు 40 లొకేషన్స్ లో తీశాం.

 >> దర్శకుడిగా మీకు ఎటువంటి పేరు వస్తుందని భావిస్తున్నారు?
నా పేరు మరీ మారుమ్రోగిపోతుందని చెప్పను కానీ.. మన తెలుగు ఇండస్ట్రీకి ‘మరో మంచి దర్శకుడు దొరికాడు’ అనే ప్రశంసలైతే వస్తాయి. నా తదుపరి చిత్రానికి సూటయ్యే హీరోని పెద్దగా కష్టపడకుండానే కలిసి కథ చెప్పగలుగుతాను. నా మీద నమ్మకంతో ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన 20 మంది మిత్రుల్లో చాలా మంది నిర్మాతలవుతారు. మిగతావాళ్ళు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం కొనసాగిస్తారు. వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు. వడ్డీతో సహా తిరిగి వస్తాయి.

>> అంటే మీ నెక్స్ట్ సినిమాకి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారా?
అవును. ‘క్షీర సాగర మథనం’తో దర్శకుడిగా నాకు వచ్చే పేరు చెడగొట్టుకోకుండా.. దాన్ని పెంచేలా ఉండేలా మంచి కథ సిద్ధం చేశాను. ‘క్షీర సాగర మథనం’ 25 డేస్ ఫంక్షన్ లో నా నెక్స్ట్ సినిమా డిటైల్స్ అనౌన్స్ చేస్తాను!!