స్టార్ మా లో మళ్ళీ వెలగనున్న”కార్తీకదీపం” ఇది నవ వసంతం

143


తెలుగు తెలివిజన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం “కార్తీకదీపం”. స్టార్ మా సృష్టించిన ఒక సంచలనం, ఒక ప్రభంజనం “కార్తీకదీపం” సీరియల్. భారతదేశ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సాధించి ఆశ్చర్యపరిచిన షో ఇది. సీరియల్ ప్రసారమయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు వారున్న ఇతర ప్రాంతాల్లో ఏ రోజూ మిస్ అవ్వకుండా టీవీల ముందుకు చేరి కథా కథనాలతో విపరీతంగా కనెక్ట్ అయ్యేలా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన ధారావాహిక “కార్తీకదీపం”. అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎలా వుంటాయో.. అనుమానాలు, అవమానాలు, అపనిందలు ఎలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తాయో… ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం జీవితాల్ని ఎలా మలుపు తిప్పుతాయో అద్భుతంగా చెప్పిన ఈ కథకి తెలుగువారు జేజేలు పలికారు. కార్తీకదీపం సీరియల్ లో పాత్రలు సంతోష పడితే తెలుగు లోగిళ్ళు ఆనందించాయి. ఆ పాత్రలు బాధపడితే వాళ్ళకంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకున్నారు. డాక్టర్ బాబు, దీప కేవలం బుల్లితెర పైన కనిపించే రెండు పాత్రలు మాత్రమే కాదు.. ప్రతి ఇంట్లో ఇద్దరు మనుషులు. అలాంటి “కార్తీకదీపం” సీరియల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ మా లో రాబోతోంది.

నిరుపమ్ (కార్తీక్): కార్తీక దీపం ఫస్ట్ సీజన్ – నెంబర్ వన్ సీరియల్. అప్పట్లో ప్రజాభిమానానికి కొలమానమైన బార్క్ – ఈ సీరియల్ తెలుగువాళ్లు ఎంతగానో ఇష్టపడి చూసిన సీరియల్ అని లెక్కల్లో తేల్చి చెప్పింది. జాతీయ స్థాయిలో – రిలేషన్షిప్స్, ఎమోషన్స్ ని అద్భుతంగా చూపించి, ఫామిలీ డ్రామాని గొప్పగా పండించిన మొట్టమొదటి తెలుగు సీరియల్ “కార్తీక దీపం 1”.

ప్రేమి విశ్వనాథ్ (దీప): నేను ఎక్కువగా కన్నీళ్లు పెడతాను అని చాలామంది అన్నారు. నన్ను ఆశీర్వదించినవాళ్ళూ వున్నారు. ఇవాళ ఓ సారి వెనక్కి తిరిగి చూస్తే.. ఈ “కార్తీక దీపం ” సీరియల్ ని మీకు ఎంతో ఇష్టమైన సీరియల్ గా మార్చిన ప్రతి క్షణాన్ని, ప్రతి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంటున్నాను.

విన్న కథో, చూసిన కథో, పరిచయమైన మనుషుల ఇళ్లలో జరిగిన కథో అనిపించేలా “కార్తీక దీపం” స్టార్ మా నుంచి వినూత్నమైన ప్రయత్నం. విభిన్నమైన కథతో, మరింత బలమైన కథనంతో భావోద్వేగాల సమ్మేళనంగా “కార్తీకదీపం” తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. “ఇది నవ వసంతం” అనే టాగ్ లైన్ తో ముస్తాబవుతున్న ఈ ధారావాహిక దీపని, డాక్టర్ బాబు ని భిన్నమైన పాత్రలలో పరిచయం చేయబోతోంది. పాత్రల మధ్య సంఘర్షణ, ప్రతి పాత్రకీ ఒక స్పష్టమైన ముద్ర, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడని మనస్తత్వం, నమ్మిన విలువలకు కట్టుబడే బలమైన వైఖరి.. ఈ సరికొత్త కార్తీకదీపాన్ని మరికొత్తగా వెలిగించబోతున్నాయి. స్టార్ మా లో “కార్తీక దీపం 2” ప్రచార చిత్రాలు (ప్రోమోలు) ప్రసారమైనప్పటి నుంచి.. రాబోతున్న ధారావాహిక వేరే కథతో వస్తోందన్న విషయం ప్రేక్షకులకు స్పష్టమైంది. కానీ అసలు ప్రధానమైన రెండు పాత్రలు, దీప పాత్రకు వున్న అమ్మాయి, ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణలు ఎన్నో ప్రశ్నలను లేవదీసింది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతోంది “కార్తీక దీపం 2”. మీ అభిమాన సీరియల్ కార్తీక దీపం 2 మీకెంతో ప్రియమైన స్టార్ మా లో మర్చి 25న ప్రారంభం అవుతుంది. ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు మీ కుటుంబం అంతా కలిసి చూడండి.