హైదరాబాద్, ఆగస్టు 15, 2022: ప్రముఖ స్థిరాస్తి సంస్థ సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం జెండాపండుగను వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని సుచిర్ కేపిటల్ కార్యాలయంలో ఉదయం 8.48 గంటలకు ప్రముఖ బహుభాషా నటుడు సాయికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో త్యాగధనుల పుణ్యంతో ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని, వారి త్యాగాలను స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా సాయికుమార్ అన్నారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు నుంచి 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్య్ర సమరంలో ఎన్నో మరుపురాని మేలిమలుపులు ఉన్నాయని, నేటి తరం వాటన్నింటినీ తెలుసుకుని.. నవభారత నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఇందుకు యువతరం నడుం బిగించాలని చెప్పారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారని సుచిర్ ఇండియా ఛైర్మన్ లయన్ డాక్టర్ వై.కిరణ్ అన్నారు. నాటి విద్యార్థి నాయకులు ఆ తర్వాతి కాలంలో దేశనాయకులుగా ఎదిగారని గుర్తుచేశారు. దేశ పునర్నిర్మాణంలో తొలితరం జాతీయనాయకుల పాత్రను ప్రస్తావిస్తూ.. ఇప్పటికే పలు రంగాల్లో మన దేశం అగ్రగామిగా ఎదిగిందని, అదే సమయంలో మిగిలిన రంగాలూ పురోగమించాలని సూచించారు. జాతీయ నాయకులు తమ స్వార్థాన్ని వదిలిపెట్టి, జీవితాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారని, దాని ఫలాలను నేటితరం అనుభవిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.