ఘ‌నంగా హైయ్‌ ఫైవ్ ప్రీ రిలీజ్ వేడుక‌- జులై 22న విడుద‌ల‌

522

నృత్య‌ద‌ర్శ‌కుడి నుంచి `ర‌ణం` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన అమ్మ రాజ‌శేఖ‌ర్ తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `హైయ్‌ ఫైవ్`. ఫ‌న్ అండ్ గ‌న్ అనేది ఉప‌శీర్షిక‌. రాధా రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. కొత్త పాత న‌టీనటుల క‌ల‌యిక‌తో రూపొందిన ఈ చిత్రం జూలై 22న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రాత్రి హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ముఖ్యతిథి జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, అమ్మ‌ను ఎవ‌రైతే చ‌క్క‌గా చూసుకుంటారో వారు అంద‌రిక‌న్నా ధ‌న‌వంతులు. అమ్మ రాజ‌శేఖ‌ర్ స‌క్సెస్ వ‌స్తే నా కుటుంబానికి వ‌చ్చింద‌ని అనుకునేవారు. ఇలాంటి వ్య‌క్తులు అరుదుగా వుంటారు. హైయ్‌ ఫైవ్ సినిమా మొద‌లు పెట్టిన‌ప్పుడు నాకు చెప్పాడు. ఆ త‌ర్వాత చాలా క‌ష్టాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాన‌ని అన్నాడు. అవ‌న్ని ఎదుర్కుకొని నిల‌బ‌డ్డాడు. అలాంటి వారికి స‌పోర్ట్‌గా వుండాల‌ని ఈరోజు వ‌చ్చాను. ఈరోజుల్లో సినిమా రూపురేఖ‌లు మారిపోయాయి. కోవిడ్ త‌ర్వాత ప్రేక్ష‌కులు పెద్ద‌గా థియేట‌ర్ల‌కు రావ‌డంలేదు. ఓటీటీ అనేది స‌పోర్టింగ్‌గా నిలిచింది. ఈ హైయ్‌ ఫైవ్ సినిమాకు డ‌బ్బులు బాగా వ‌చ్చి అమ్మ రాజ‌శేఖ‌ర్ భార్య రాధ‌కు మంచి వ‌సూళ్ళు రావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి మాట్లాడుతూ, అమ్మ రాజ‌శేఖ‌ర్ నాకు డాన్స‌ర్ నుంచి తెలుసు. ఒక్కో మెట్టు ఎక్కుతూ డాన్స్ డైరెక్ట‌ర్‌గా మారాడు. ఆ త‌ర్వాత చిత్ర ద‌ర్శ‌కుడుకూడా అయ్యాడు. మా ఇద్ద‌రి కెరీర్ ఒకేలా వుంది. 2004లో నేను య‌జ్ఞం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేస్తే, అదే బేన‌ర్‌లో ర‌ణం చిత్రానికి త‌ను ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఇద్ద‌రం మోతీ న‌గ‌ర్‌లోనే వుంటాం. అమ్మ రాజ‌శేఖ‌ర్ క‌ష్ట‌జీవి. నేను అమ్మ‌దొంగ సినిమాకు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన‌ప్పుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ డాన్స్ చేసేవాడు. నేను ద‌ర్శ‌కుడిగా సినిమా చేసిన‌ప్పుడు త‌ను డాన్స్ డైరెక్ట‌ర్‌గా నా సినిమాకు ప‌నిచేశాడు. త‌ను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాల‌ని కోరుకుంటున్నాను. ఇందులో ప‌నిచేసిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.

మ‌రో ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ మాట్లాడుతూ, అంద‌రినీ హైయ్ ఫైవ్ చేసే వ్య‌క్తి అమ్మ రాజ‌శేఖ‌ర్. త‌ను చాలా ఎన‌ర్జీగా వుంటాడు. అందుకే టైటిల్ కూడా అలానే పెట్టాడు. హైస్కూల్‌లో నాకు సీనియ‌ర్. స్టేజీ ప్లేకూడా చేశాం. నేను ఓసారి ఆసుప‌త్రిలో వుంటే అమ్మ రాజ‌శేఖ‌ర్ వ‌చ్చాడు. మ‌నం బాధ‌గా వున్న‌ప్పుడు ప‌క్క‌నున్న‌వాడే మంచి ఫ్రెండ్‌. నాకు అలాంటిఫ్రెండ్ దొరికాడు. నేను తెలుగులో ఓ సినిమా చేస్తున్నాను. షూటింగ్ ఖ‌మ్మంలో వుంది. అమ్మ రాజ‌శేఖ‌ర్ ఫంక్ష‌న్ కోసం వ‌ర్షం అయినా రావాల‌నిపించింది. అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు సురేష్ కొండేటి అండ‌గా వున్నాడు. నేను తెలుగులో కొత్త సినిమా చేస్తున్నా. అందులో సురేష్ కొండేటి ఓ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ హైయ్ ఫైవ్ సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, హీరో నితిన్‌కు 10రోజుల క్రిత‌మే ఫంక్ష‌న్ గురించి చెప్పాను. వ‌స్తాన‌ని అన్నారు. కానీ ఇంటిలోనే వుండి రాలేదు. అందుకు చాలా బాధ‌క‌లిగింది. త‌న‌కు డాన్స్ రాదు. నేను డాన్స్ నేర్పించాను. లైఫ్‌లో ఎంత ఎదిగినా అమ్మ‌ను, గురువును మ‌ర్చిపోకూడ‌దు. నా అనుకున‌న్న‌వాళ్ళే న‌న్ను ఆశీర్వ‌దించ‌డానికి వ‌చ్చారు. నిర్మాత నా భార్య రాద‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. నాతోపాటు సినిమా క‌ష్టాలు ప‌డి విడుద‌ల‌వ‌రకు తీసుకువ‌చ్చింది అని చెప్పారు.

చిత్ర నిర్మాత రాధా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, మా హైయ్ ఫైవ్ సినిమా అంద‌రూ బాగా ఎంజాయ్ చేసేలా వుంటుంది. చిన్న నిర్మాత‌ల‌కు అంద‌రూ స‌హ‌క‌రించాలి. డైరెక్ట‌ర్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్న‌ట్లు అమ్మ రాజ‌శేఖ‌ర్ ప్ర‌తి ప‌నిని ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. టెక్నీషియ‌న్స్‌ను అలెర్ట్ చేస్తారు. మేం ఓసారి స‌ముద్రంలో వెళుతుంటే మ‌ధ్య‌లో ఇంజ‌న్ ఆగిపోయింది. ఆ త‌ర్వాత కొన్ని చిన్న బోట్‌లు వ‌చ్చి మ‌మ్మ‌లి ఒడ్డున చేర్చాయి. అంద‌రినీ జాగ్ర‌త్త‌గా అమ్మ రాజ‌శేఖ‌ర్ చూసుకున్నారు. ఈ సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

న‌టుడు విశ్వ మాట్లాడుతూ, అంద‌రినీ అమ్మ రాజ‌శేఖ‌ర్ కుటుంబ స‌భ్యుల్లా చూసుకున్నారు. నేను మాస్ట‌ర్‌తో కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాకు డ‌బ్బులు రావాల‌ని ఆశిస్తున్నాను అని తెలిపారు.

శివారెడ్డి మాట్లాడుతూ, మంచి వారికి మంచి జ‌రుగుతుంద‌ని చెబుతుంటారు. మా మాస్ట‌ర్‌కు ఆల్ ది బెస్ట్‌. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చాల‌ని డ‌బ్బులు రావాల‌ని ఆకాంక్షించారు.

బిగ్‌బాస్ దివి మాట్లాడుతూ, ఈ సినిమా హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాన‌ని అన్నారు.
ఇంకా నిర్మాత రామ‌స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు మాట్టాడారు. ఈ వేడుక‌కు యాంక‌ర్లుగా అవినాష్‌. అరియానా వ్య‌వ‌హ‌రించి సంద‌డి చేశారు.