ఈ నెల 30న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మైన జీరో బ‌డ్జెట్ సినిమా ‘గండ’

161

సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. అలాంటిది జీరో బ‌డ్జెట్ తో సినిమా సాధ్య‌మా? అంటే సాధ్య‌మే అంటూ వార‌ణాశి సూర్య ఓ వినూత్న ప్ర‌యోగానికి తెర‌తీస్తూ ఈజీ మూవీస్ బేన‌ర్ పై `గండ` అనే చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తూ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వార‌ణాశి సూర్య మాట్లాడుతూ…“మా జీరో బ‌డ్జెట్ కాన్సెప్ట్ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోంది. ఈ సినిమా తో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియ‌న్స్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. మా ఈజీ మూవీస్ సంస్థ త్వ‌ర‌లో ఓ పెద్ద సంస్థ‌తో క‌లిసి పెద్ద ప్రాజెక్ట్స్ చేయ‌బోతుంది. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు వెల్ల‌డిస్తాం. అలాగే విజ‌య్ జెడ అనే ద‌ర్శ‌కుణ్ని ప‌రిచ‌యం చేస్తూ మా సంస్థ‌లో ఓ జీరో బ‌డ్జెట్ సినిమా చేయ‌బోతున్నాం. ఇక ఇండ‌స్ట్రీలో థియేట‌ర్స్ ఆ న‌లుగురు చేతిలోనే ఉంటాయి. అదొక మాఫియా అంటుంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆ న‌లుగురు అనే కాన్సెప్ట్ కేవ‌లం అపోహ మాత్ర‌మే. నాది కూడా చిన్న సినిమానే. నా సినిమాకు థియేట‌ర్స్ స‌మ‌స్యే రాలేదు. 22 థియేట‌ర్స్ లో రిలీజ్ చేయ‌బోతున్నా. మంచి కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తే థియేట‌ర్స్ దొరుకుతాయి. ఆడియ‌న్స్ సినిమాల‌ను ఆద‌రిస్తారు. అంతే కానీ మ‌రొక‌రి మీద నింద‌లు వేయ‌డం మానుకోవాలి. అలాగే చిన్న సినిమాలు ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల‌కు నోచుకోక ల్యాబ్ ల్లోనే ఉండిపోయాయి. అలాంటి సినిమాల‌ను టేక‌ప్ చేసి వాటికున్న స‌మ‌స్య‌ల‌ను సాల్వ్ చేసి కంటెంట్ ఉన్న సినిమాల‌ను రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో కూడా ఉన్నాం. దానికి సంబంధించిన ప‌నులు కూడా జ‌రుగుతున్నాయి. అలాగే కోట్లు పెట్టి పోగొట్టుకున్న చిన్న నిర్మాత‌లు కేవ‌లం పింఛ‌న్ మీద ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వారున్నారు. అలాంటి వారికి మా ఈజీ మూవీస్ సంస్థ‌లో వ‌చ్చే మ‌నీతో కొంత సాయం చేయాల‌ని సంక‌ల్పించాం. ఇక ఎవ‌రి ఇన్స్ స్పిరేష‌న్ తో అయితే జీరోబ‌డ్జెట్ సినిమా చేశానో…అటువంటి ఆర్జీవీ గారు ఇంత వ‌ర‌కు ఎన్ని మెసేజ్ లు పెట్టినా స్పందించ‌లేదు. ఎవ‌రు స‌పోర్ట్ చేసినా , చేయ‌కున్నా జీరో బ‌డ్జెట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూనే ఉంటాను“ అన్నారు.