కళ్ళను కట్టి పడేసిన హిమగిరి సొగసులు!

138

ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి! ఆయనకు కొండలు, పర్వతాలు, నదులు, చెరువులు అంటే ఇష్టం! ప్రకృతి అంటే ప్రాణం! అందుకే గత రెండు దశాబ్దాల్లో 30 సార్లు హిమాలయాలను సందర్శించి అక్కడి నీటి ప్రవాహాన్ని, నదుల వయ్యారాలు, చెరువుల అందాలు, హిమాలయ సొగసులను తన కెమెరా లో బంధించారు! వాటిలోంచి 24 ఫోటోలను ఎంపిక చేసి ఫ్రేముల్లో దించి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లో వున్న ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ లో ప్రదర్శన ఏర్పాటు చేశారు! ఇంతకీ అద్భుత కేమెరా కళాప్రతిభా వ్యక్తిత్వం మరెవరో కాదు… సత్యప్రసాద్ యాచేంద్ర! ఆయనకు ప్రత్యేక పరిచయ వాక్యాలు అక్కరలేదు! వెంకటగిరి సంస్థానం యువరాజు ఆయన!

హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఫోటో ఫెస్టివల్ లో భాగంగా ఈ నెల 18న సత్యప్రసాద్ ప్రారంభించిన “ది వాక్ ఆఫ్ వాటర్” ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. లదాఖ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలను ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కోసం సందర్శించడం ఆయనకు అత్యంత ఇష్టమైన అలవాటుగా మారింది! సత్యప్రసాద్ యాచేంద్ర కు చిన్నప్పటి నుంచి కొండలు, పచ్చదనం, నది తీరాలు అంటే బాగా ఇష్టం! తిరుమల కొండలను కేమెరా లో తొలిసారి క్లిక్ చేసి చూసుకున్నాక మరింత కిక్ అనిపించింది! టిబెట్ వెళ్లి మానస్ సరోవర్ చూసి మైమరచి పోయారు! ఆ మధురానుభూతులను ఛాయా చిత్రాలుగా మలిచి మురిసిపోయారు! 2004 నుంచి వీలు చేసుకుని మరీ ప్రకృతిని కెమెరా తో పట్టుకోవడం ఆరంభించారు! హిమాలయాల ల్యాండ్ స్కేప్ ఎక్స్ పర్ట్ గా గుర్తింపు పొందారు! అవి ఫోటోలు అనిపించవు ఆయన చెప్పేంతవరకు! చూపరులకు గొప్ప చిత్రరాజాలు అనిపిస్తాయి! గ్రాఫిక్స్ మాయాజాలం అనిపిస్తాయి! అదే సత్యప్రసాద్ ప్రత్యేకత! సజీవంగా అందాల లోయలను క్లిక్ చేయడం, సహజ లైటింగ్ లో క్యాప్చర్ చేయడం వారి శైలి! ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా అద్భుత అందాలను కెమెరా లో బంధించడం వారి సృజనాత్మక దృష్టి! అందుకే అలాంటి అద్భుతాలను సహజ ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తున్నారు!

దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లో సత్యప్రసాద్ యాచేంద్ర ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలకు ప్రముఖులతో ప్రశంసలు లభించాయి! చంద్రభాగ్, జంస్కార్, సట్లేజ్ నదుల అందాలను ఆయన కెమెరాలోంచి చూసి తీరాల్సిందే! దాల్ చెరువు, సుమోరిరి, పంగాగ్సో చెరువులు హిమాలయాలకు ఎంత అందాన్ని ఇస్తున్నాయో ఆయన కళ్ళకు కట్టేలా క్లిక్ మనిపించారు! హిమాలయాలు అంటే కేవలం మంచు అందాలే కాదు, అంతకు మించి వేరే లెవెల్ అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన లక్ష్యమని సత్యప్రసాద్ యాచేంద్ర తెలిపారు. హిమాలయాలకు వెళ్లి చూడలేని వారు సత్యప్రసాద్ తీసిన ఫోటోలను చూస్తే వెంటనే ఎన్ని పనులు అయినా ఆపుకుని హిమాలయ పర్వతాల సొగసు చూసి రావాలనిపిస్తుంది!

– డా. మహ్మద్ రఫీ