HomeTeluguవిజయదశమి పర్వదినాన ‘శ్రీసత్యసాయి అవతారం’ సినిమా షూటింగ్‌ ప్రారంభం

విజయదశమి పర్వదినాన ‘శ్రీసత్యసాయి అవతారం’ సినిమా షూటింగ్‌ ప్రారంభం

శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబా గురించి తెలియంది కాదు. ఆయన్ను భక్తులు కదిలే దైవంగా చూస్తారు. కోట్లాది మంది భక్తులు ఆయన కున్నారు. అలాంటి స్వామి గురించి ఇప్పటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియ జేయాలనే మంచి సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్‌ ఫిలింస్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌ సారధి స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ వైభవంగా ప్రారంభం అయింది. ముందుగా ముఖ్య అతిథులతో పాటు, యూనిట్‌ సభ్యులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రఖ్యాత దర్శకుడు సాయిప్రకాష్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్న 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు ప్రముఖ డాక్టర్‌ దామోదర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌ నివ్వగా, కె. అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్‌ చేశారు. ఎస్‌.వి. కృష్ణారెడ్డి తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సి.హెచ్‌. మధన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, నటులు సాయికుమార్‌, సుమన్‌, బాబూమోహన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సాయిప్రకాష్‌ మాట్లాడుతూ… బాబాగారికి నాతో పాటు 180 దేశాలలో భక్తులు ఉన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపే అదృష్టం నాకు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వ అవకాశం నాకు రావడం కూడా ఆయన దయ అనేది నా అభిప్రాయం. స్వామి ఎప్పుడూ అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెపుతూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ఈ విజయదశమి పర్వదినాన ఎలాగైనా సినిమా ప్రారంభోత్సవం జరిపించాలని మా నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ గారు పట్టుబట్టారు. స్వామి కృపతో దిగ్విజయంగా ప్రారంభోత్సవం జరుపుకుంది మా సినిమా. ఇందులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటించబోతున్నారు. వీరిలో ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ ప్రముఖులకు, బాబా గారి భక్తులకు నా కృతజ్ఞతలు. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌గా షూటింగ్‌ చేస్తాం. రెండు భాగాలుగా చేయాలనేది మా నిర్మాతల నిర్ణయం. అవసరం అయితే మరిన్ని భాగాలు చేయడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు అన్నారు.

పృథ్వి మాట్లాడుతూ… బాబాగారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ చిత్రంలో నేను విష్ణుమూర్తిగా నటించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. సాయిప్రకాష్‌ వంటి గొప్ప దర్శకులు రూపొందిస్తున్న ఈ సినిమా తప్పకుండా సూపర్‌ సక్సెస్‌ సాధిస్తుంది. దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.

నటి అర్చన మాట్లాడుతూ… విజయదశమి పర్వదినాన ఆ మహాలక్ష్మి పాత్రలో షూటింగ్‌ చేయడం నిజంగా నా అదృష్టం. శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్రకు నాకు ఎంతో పేరు వచ్చింది. ఈ సినిమాలో కూడా ఈ పాత్ర అంతకు మించి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. సత్యసాయి గారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక భక్తులు అభిమానం, ఆశీర్వాదం ఈ సినిమాకు ఖచ్చితంగా ఉంటాయి అన్నారు.

కో`ప్రొడ్యూసర్‌ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ… నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ గారు అర్జంటు పనిమీద దుబాయ్‌లో ఉన్న కారణంగా ఈ అద్భుతమైన ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మా అందరిపై ఉన్నందు వల్లనే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగింది. సాయిప్రకాష్‌ గారు ఓ లెజెండ్‌ పర్సనాలిటీ. ఆయనతో మేం సినిమా చేయడం మా అదృష్టంగా చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం మీద కోట్లాది మంది సత్యసాయి గారికి పరమ భక్తులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన జీవిత చరిత్రను సినిమాగా చేసే అవకాశం మాకే దక్కడం బాబా గారి అనుగ్రహం అనుకుంటున్నాం అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: జె.జి. కృష్ణ, ఎడిటర్‌: ఈశ్వర్‌రెడ్డి కె., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : సత్యనారాయణ్‌, పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, ఆర్ట్‌ డైరెక్టర్‌ : నాగు, కో`ప్రొడ్యూసర్‌ : గోపీనాథ్‌రెడ్డి, నిర్మాత: డా॥ బి. దామోదర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం సాయిప్రకాష్‌.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES