“దేవినేని” పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేశారు

428

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘దేవినేని’. దీనికి ”బెజవాడ సింహం” అనేది ట్యాగ్ లైన్. నందమూరి తారకరత్న టైటిల్ పాత్రలో నటించారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, కెఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు.

బెజవాడలో ఇద్దరు మహా నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో సెంటిమెంట్‌ కలయికలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ లేబ్లో జరిగిన వేడుకలో ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను “మా” అసోసియేషన్ కార్యదర్శి జీవిత రాజశేఖర్ విడుదల చేయగా, చిత్రం ఫస్ట్ లుక్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదరప్రసాద్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జీవిత, కె.ఎల్.దామోదరప్రసాద్ లు మాట్లాడుతూ, కరోనా పరిస్థితులు వల్ల చిత్ర పరిశ్రమ ఆటుపోట్లకు గురైంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ మళ్లీ ట్రాక్ లోకి వస్తుండటం, థియేటర్లు తిరిగి ప్రేక్షకులతో కళ కళ లాడటం ఆనందంగా ఉందన్నారు. నందమూరి తారకరత్న అద్భుతమైన నటుడు. అతనికి ఈ చిత్రం పెద్ద బ్రేక్ నివ్వాలని కోరుకుంటున్నామని వారు అన్నారు.

నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, దేవినేని పాత్రకు తారకరత్న ప్రాణప్రతిష్ట చేశారని అన్నారు. అలాగే పాత్రధారులంతా వాళ్ల వాళ్ల పాత్రలకు చక్కటి న్యాయం చేకూర్చారని అన్నారు. ఇందులో చలసాని వెంకటరత్నం పాత్రలో నటించడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు.

చిత్ర దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరిస్తారు. గతంలో బెజవాడను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకు ఎవరు చూపించనిరీతిలో నిజాలను నిర్భయంగా ఇందులో చూపించాం. ఎందరు మెచ్చుకుంటారు, ఎంతమంది నొచ్చుకుంటారు అన్న అంశంతో పనిలేకుండా వాస్తవాలను ఆవిష్కరించాం. రంగాను ఎవరు చంపారు అన్నది చూపించాం అని అన్నారు. నిర్మాతలలో ఒకరైన రాము రాథోడ్ మాట్లాడుతూ, ఒక గొప్ప చిత్రాన్ని తీసే అవకాశం లభించిందని, త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తామని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు బెనర్జీ, ప్రముఖ దర్శకులు పి.ఎన్. రామచంద్రరావు, వి. సముద్ర, నిర్మాత ఎం. ఎన్. ఆర్. చౌదరి, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, నటీనటులు తేజారెడ్డి, తేజా రాథోడ్, హీరో డాక్టర్ మెగా సుప్రీమ్, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్, ఇంకా ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.