విభిన్న చిత్రాలు, పాత్రలలో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు విజేత సూర్య. ప్రస్తుతం సూర్య నటిస్తున్న రెట్రో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.
ఒక వైపు వరుస సినిమాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మరోవైపు పంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. లియో (తమిళం), దేవర (తెలుగు), భ్రమయుగం (మలయాళం) వంటి చిత్రాలను తెలుగునాట విజయవంతంగా పంపిణీ చేసింది. ఇప్పుడు తెలుగులో రెట్రో చిత్రాన్ని విడుదల చేస్తుంది. సితార పంపిణీ చేస్తుందంటే, తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదల ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య తెలుగు అభిమానులు థియేటర్లలో పండుగ జరుపుకునేలా ఘనంగా రెట్రో విడుదల ఉండనుంది.
ప్రతిభగల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో రూపొందుతోంది. భారీ తారాగణంతో, అద్భుతమైన సాంకేతిక బృందంతో, కార్తీక్ సుబ్బరాజ్ శైలి విలక్షణమైన దర్శకత్వ ముద్రతో.. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించేలా రెట్రో రూపుదిద్దుకుంటోంది. ప్రచార చిత్రాలు కూడా విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా రెట్రో నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ చిత్రంలో పూజా హెగ్డే, జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు.
సూర్య, జ్యోతిక నేతృత్వంలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రెట్రో రూపొందుతోంది. ఈ చిత్రంతో కార్తీక్ సుబ్బరాజ్, తన అసాధారణ ప్రతిభతో వెండితెరపై అద్భుతం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
రెట్రో తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకోవడంతో తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో రెట్రోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సితార సంస్థ తెలిపింది.