మీరు పెట్టే టికెట్ కు రెండింతలు వినోదాన్ని అందిస్తాం- భళా తందనాన ట్రైలర్ ఆవిష్కరణ లో శ్రీవిష్ణు
శ్రీవిష్ణు, క్యాథరిన్ థ్రెసా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే6న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ విశాఖపట్నంలో ఆదివారంనాడు ఆహ్లాదకరవాతావరణంలో జరిగింది. సిరిపురంలో జరిగిన ఈ వేడుకను వినూత్నంగా ప్రేక్షకులు `ట్రైలర్ రిలీజ్` అనడంతో ఆవిష్కరణ జరిగింది.
అనంతరం చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ, వైజాగ్ అంటే ఇష్టం. నా మొదటి సినిమా `బాణం` ఇక్కడే షూటింగ్ చేశాం. నేను దర్శకుడిని అవ్వకముందు వేసవి సెలవులకు సినిమాలకు వెళ్ళేవాడిని. అలా కొన్ని మైండ్ లో వుండిపోయాయి. ఈనెల 6న సినిమా విడుదలవుతుంది. అప్పటికి కాలేజీ చదివేవారికి ఎలాగూ చదువు పూర్తవుతుంది. సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోండి. ఈ సినిమా మీకు తీపిగుర్తును ఇస్తుంది. శ్రీవిష్ణు బ్యూటిఫుల్ యాక్టర్. సర్‌ప్రైజ్‌కూడా ఇస్తాడు. సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. శ్రీవిష్ణు నటన, మణిశర్మ సంగీతం పోటీపడినట్లుగా వుంటుంది. క్యాథరిన్ ఇంతకుముందు చేసిన సినిమాకు భిన్నమైన పాత్ర వుంటుంది. నిర్మాత బాగా సహకరించారు. నిర్మాత సాయిగారు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఆయన వల్లే సినిమా బాగా వచ్చింది అని తెలిపారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఈ సినిమాకు కారణం సాయి కొర్రపాటిగారే. ఆయన డేరింగ్ నిర్మాత. వారాహి సంస్థలో పనిచేయడం సంతోషంగా వుంది. క్వాలిటీపరంగా అన్నీ సమకూర్చి ప్రోత్సహించారు. చైతన్య నేను 14 ఏళ్ళుగా స్నేహితులం. మొదటి సారి ఆయన సినిమాలో డైలాగ్ చెప్పాను. ఇప్పుడు హీరోగా చేశాను. ఇదే సిరిపురంలో థియేటర్‌లో సినిమాలు చూసేవాడిని. ఇక్కడివారు జన్యూన్ రిపోర్ట్ ఇస్తారు. ఈ సినిమాలో క్యాథరిన్ బాగా నటించింది. ఆమె కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. ఇక కెజిఎఫ్. గరుడ రామ్‌గారు టాప్ విలన్‌గా మారారు. ఆయన బయట చాలా సాఫ్ట్‌గా వుంటారు. కెజిఎఫ్ తర్వాత ఆయనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. మణిశర్మగారి సంగీతం చాలా బాగుంది. రీరికార్డింగ్ అద్భుతంగా ఇచ్చారు. ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరామెన్ సురేష్ పనితనం కనువిందు కలిగిస్తుంది. మే6న సినిమాను థియేటర్‌కు వచ్చి చూడండి. మీరు పెట్టే టికెట్ కు రెండింతలు వినోదాన్ని అందిస్తాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. మే6న వస్తున్నాం. హిట్ కొడుతున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి కొర్రపాటి, నటుడు రామచంద్రరాజు (గరుడ) పాల్గొన్నారు.