‘అంటే సుందరానికీ’ అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ: నజ్రియా నజీమ్ ఇంటర్వ్యూ

405

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా మీడియాతో ”అంటే సుందరానికీ’ విశేషాలు పంచుకున్నారు. నజ్రియా పంచుకున్న ”అంటే సుందరానికీ’ విశేషాలివి.

తెలుగులోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు .. కారణం ?
నిజంగా నేను ఏదీ ప్లాన్ చేసుకోనండి. కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే చాలా మంది నేను రోజు కథలు వింటూ రిజెక్ట్ చేస్తూ ఉంటానని అనుకుంటారు(నవ్వుతూ). అది నిజం కాదు. కొన్ని కథలు మాత్రమే విన్నాను. అందులో ‘అంటే సుందరానికీ’ చాలా ఎక్సయిట్ చేసింది.

మీరు ‘అంటే సుందరానికీ’ కథ విన్నప్పుడు   అంత ఎక్సయిట్ చేసిన అంశం ఏమిటి?
కథ విన్నపుడు భాష గురించి అలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే సుందరానికీ’ కూడా ఒక ఆడియన్ లానే విన్నా. కథ అద్భుతం అనిపించింది. ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ .. ఇలా అన్నీ భావోద్వేగాలు వున్న ఒక కథలో కుదరడం చాలా అరుదు. ‘అంటే సుందరానికీ’ అంత అరుదైన కథ. ఇలాంటి కథ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టిన మీరు సడన్ గా బ్రేక్ తీసుకోవడం ఎలా అనిపించింది ?
బ్రేక్ నేను ప్లాన్ చేసింది కాదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టాను. టీవీకి పని చేశాను. ఒక రెండేళ్ళు వరుసగా సినిమాలు చేశాను. కొంచెం త్వరగానే పెళ్లి చేసుకున్నాను. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత దానికి సమయం కేటాయించాలని భావించాను. ఇంట్లో వుండటం, ప్రయాణాలు, ఇంటి పనులు చూసుకోవడం కూడా ఆనందంగా వుంది. అయితే ఫాహాద్ ‘కథలు వినకుండా ఏం చేస్తున్నావ్” అనేవారు (నవ్వుతూ). నన్ను తెరపై చూడటం ఫాహాద్ కి చాలా ఇష్టం, నాకంటే ఆయనే ఎక్సయిట్ గా వుంటారు. కొన్నాళ్ళుగా కథలు వింటున్నాను. ఐతే నేను ఆల్రెడీ చేసిన పాత్రలే చాలా వరకూ వచ్చాయి. చేసిన పాత్రే మళ్ళీ చేయడంలో ఎలాంటి ఎక్సయిట్ మెంట్ వుండదు కదా.. ఈ కారణంగా కథల ఎంపికలో నేను కొంత పర్టికులర్ గా ఉంటానని భావిస్తారు.

అంటే సుందరానికీ’లో డ్యాన్స్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది ?
నాకు డ్యాన్స్ అంటే భయం. నటిస్తాను కానీ డ్యాన్స్ చేయమంటే మాత్రం అది సహజంగా రాదు(నవ్వుతూ). నాని డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు. నాని డ్యాన్స్ చూసి కంగారు పడ్డా. నేను ఎలాంటి స్టెప్ వేసినా బావుందని నాని, వివేక్ ఆత్రేయ ఎంకరేజ్ చేసేవారు. డ్యాన్స్ విషయంలో చాలా కష్టపడ్డాను. అయితే యాక్టర్ ని కాబట్టి ఆ కష్టాన్ని కనిపించనీయకుండా మ్యానేజ్ చేశా(నవ్వుతూ)

లీలా థామస్ పాత్రలో వున్న సవాళ్ళు ఏంటి ?
లీలా థామస్ పాత్రలో చాలా లేయర్ వున్నాయి. లోపల బాధ వున్నా అది బయటికి కనిపించనీయకూడదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు. లీలా థామస్ కి నజ్రియాకి ఒక్క పోలిక కూడా లేదు.

ఫాహాద్ ని పుష్ప లో చూసినప్పుడు ఎలా అనిపించింది ?
చాలా గర్వంగా అనిపించింది. ఫాహద్ భాష విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు భాష పట్ల ఆయన పడిన శ్రమ నాకు తెలుసు. పుష్ప లో ఆయన చేసిన పాత్ర అద్భుతంగా అనిపించింది. మేము పుష్ప తెలుగు వెర్షన్ ని చూశాం.

కులాంతర, మతాంతర వివాహాలపై మీ అభిప్రాయం ?
అన్నిటికంటే ప్రేమ గొప్పదని నమ్ముతాను. కులాంతర, మతాంతర వివాహాల సమస్య ఇంకా వుంది. మన పిల్లల తరానికైనా ఈ సమస్య వుండదని కోరుంటాను. ఐతే కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని చాలా మందికి అర్ధమైయింది. ఇలాంటి విషయాలపై మొండిగా వుండటం అర్ధం లేదని అర్ధం చేసుకుంటున్నారు. జీవితంలో ఆనందంగా ఉండటమే ముఖ్యం.

తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనీ వుంది ?
ఒక నటిగా నాకు చాలా స్వార్ధం వుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా అందరితో నటించాలని వుంటుంది. సత్యదేవ్ నటన అంటే కూడా ఇష్టం. అందరూ అద్భుతమైన నటులు. అందరికీ యూనిక్ స్టయిల్ వుంది.

దర్శకులు మీ దగ్గరికి ఎలాంటి కథతో రావాలి ?
పాత్ర, నేపధ్యం ఎలా వున్నా.. కథలో నిజాయితీ మాత్రం వుండాలి.

కొత్తగా చేస్తున్నా సినిమాలు ?
ఇంకా ఏదీ సైన్ చేయలేదు. కొన్ని కథలు వింటున్నా.