‘అల.. వైకుంఠపురములో’థాంక్స్ మీట్

613

‘అల.. వైకుంఠపురములో’ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు!

* తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను

– స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

“రికార్డ్స్ కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇదొక దాటుకుంటూ వెళ్ళిపోయే దశ. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైంలో రికార్డ్ కొడతారు. ఈ రికార్డు ఎంత త్వరగా బద్దలు కొడితే ఇండస్ట్రీ అంత ముందుకు వెళ్లినట్టు. తెలుగు సినిమా మరో మెట్టు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడుగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) సాధించిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

నటుడు సుశాంత్ మాట్లాడుతూ, “ఎవరిమైనా సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం. అయితే ఇంత హిట్టవుతుందని నాకు తెలియదు. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నేను చూశాను. ఫలితం ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీ. టీం మొత్తానికి నా అభినందనలు. ప్రేక్షకులు ఈ సినిమాని ఈ స్థాయి హిట్ చేసినందుకు థాంక్స్.

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి షీల్డ్ అందుకున్న ఆదిత్య మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ, “తమన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవి మేము గర్వపడే క్షణాలు. సంగీత పరంగా ఈ సినిమా ఆల్ టైం హిట్ అయింది. సినిమా కూడా అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను” అన్నారు.

తమన్ మాట్లాడుతూ, “క్రికెట్లో హ్యాట్రిక్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఇక్కడ కూడా హ్యాట్రిక్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. త్రివిక్రమ్ కు, బన్నీకి హ్యాట్రిక్. నాకు, బన్నీకి ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’ తర్వాత ఇది హ్యాట్రిక్. అందుకే మొత్తం ఎనర్జీ ఈ సినిమాకి పని చేసింది. మా టెక్నీషియన్స్ అందరూ 100 శాతం బెస్ట్ వర్క్ ఇచ్చారు. కలెక్షన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయి. ఇండస్ట్రీ హిట్ కావటం వెరీ వెరీ హ్యాపీ.అని చెప్పారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “మేము తీశాము, మీరు చూశారు. మేము తీయటానికి మీరు చూడటానికి మధ్య డిస్ట్రిబ్యూటర్లు అనే వారధులు ఉన్నారు. సినిమాని మీకు (ప్రేక్షకులకు) చూపించడానికి మాకు డబ్బులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ ని, ఎగ్జిబిటర్స్ ని గౌరవించుకోవడం మా విధి. నేను ‘విజేత’ సినిమా నుంచి పదుల సంఖ్యలో చిరంజీవి గారి సినిమాలకు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి, షీల్డులు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు సినిమా ఆడే రోజులు తగ్గిపోయి, లెక్కలు కలెక్షన్ల కింద, రెవెన్యూ కింద మారిపోయాక ఈ ఫంక్షన్ లు లేకుండా పోయాయి. కానీ మళ్లీ ఈ రోజుకి ఇంత ఆల్ టైం రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, “ఇంత ప్రేమగా మమ్మల్ని దగ్గరకు తీసుకొని పాటల దగ్గర్నుంచి ఇక్కడిదాకా నడిపించి ఆశీర్వదించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా అందరి తరపున కృతజ్ఞతలు, నా పాదాభివందనం” అన్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ, “గీతా ఆర్ట్స్ లో ప్రొడక్షన్ కంపెనీయే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా ఉంది. ఎప్పుడైనా ఆఫీసు వైపు వెళ్ళినప్పుడు ‘ఏవండీ ఎప్పుడూ సెలబ్రేషన్ మీరేనా చేసుకునేది, మమ్మల్ని జనం దగ్గరికి తీసుకెళ్ళరా, మమ్మల్ని పట్టించుకోరా, మాకు షీల్డ్స్ ఇచ్చి సత్కరించరా?’ అని అడిగేవాళ్లు. ‘అంత సినిమా వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తాను’ అని చెప్పేవాడిని. నిజంగా అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది. మాకు ఆ అవకాశం ఇచ్చింది ప్రేక్షకులు. మా టీం కలిసి చేసింది 50 శాతం అయితే ప్రేక్షకుల దగ్గరకు సినిమాని తీసుకువచ్చింది 50 శాతం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. వాళ్లందరికీ చాలా కృతజ్ఞతలు.

ఈ ఈవెంట్ లో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అల్లు అర్జున్, సుశాంత్, త్రివిక్రమ్ షీల్డులను బహూకరించారు. అలాగే చిత్ర నటీ,నటులకు, సాంకేతిక నిపుణులకు షీల్డ్స్ బహుకరించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ఏరియాల్లో ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ (నాన్-బాహుబలి) అయిందని డిస్త్రి బ్యూటర్స్ తెలిపారు. సుమతో పాటు నటుడు బ్రహ్మాజీ కూడా ఈ ఈవెంట్ కు యాంకర్ గా వ్యవహరించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.