అఖిల భారత 131వ బ్రహ్మ సమాజం సమావేశాలకు భాగ్యనగరం వేదిక కానున్నది. ఈ నెల 29 నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ రాం కోఠి లోని ఈడెన్ బాగ్ కచ్చి భవన్ లో అఖిల భారత బ్రహ్మ సమాజం సమావేశాలు భారీ ఎత్తున జరగనున్నాయని దక్కన్ బ్రహ్మ సమాజం అధ్యక్ష కార్యదర్సులు సి.హెచ్. కేశవ్ చంద్, అజయ్ గౌతమ్ తెలిపారు. దేశం లోని వివిధ రాష్ట్రాల తో పాటు బంగ్లాదేశ్ నుంచి వందలాది ప్రతినిధులు పాల్గొంటున్నారని వారు వివరించారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయా విశేషాలు వెల్లడించారు. ఈ సమావేశం లో సీనియర్ బ్రహ్మ సమాజం సభ్యులు డాక్టర్ జ్యోత్స్న ఇలియాస్, ఇలియాస్ అహ్మద్, డి. మధుబిందు, ప్రవీణ్ వేమ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ దక్కన్ బ్రహ్మ సమాజం, ఆంధ్ర బ్రహ్మ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో 27 ఏళ్ళ తరువాత జరగనున్న ఈ సమావేశాల్లో ఎక్కువగా యువత భాగస్వాములయ్యేలా నిర్వహిస్తున్నామని, దేశ భవిష్యత్, సామాజిక సంక్షేమం యువత, బాలల పై ఆధారపడి ఉందనే ఉద్దేశ్యం తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. రాజారామ్ మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం అందరికి అందుబాటులోకి తీసుకు వచ్చేలా “భవిత కు ప్రోది” అనే నినాదం తో సమావేశాలు రూపకల్పన చేసినట్లు చెప్పారు.
సమావేశాలను 29వ తేదీ ఉదయం 11 గంటలకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య లాంఛనంగా ప్రారంభిస్తారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మావతి రాహుల్ శాస్త్రి, అలిండియా బ్రహ్మ సమాజం అధ్యక్షులు డాక్టర్ అరూప్ కుమార్, బ్రహ్మ సెంట్రల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ వూడి పి. కృష్ణ, కార్యదర్శి సౌరవ్ డే తదితరులు పాల్గొంటారు.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో వివిధ అంశాలపై చర్చా వేదికలు నిర్వహించి రానున్న ఐదేళ్ల కు భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నట్లు సి. హెచ్. కేశవ్ చంద్ తెలిపారు. ఆధ్యాత్మిక విలువలు, సామాజిక సూత్రాలను ఆదర్శ భావాలను విస్తృతం చేసేందుకు, మరింత మందికి చేరువ అయ్యేందుకు ఈ సమావేశాలు దోహద పడతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం లో డిజిటల్ మీడియా వ్యసనం నుంచి యువత ను బయటకు తీసుకు వచ్చేందుకు బ్రహ్మ సమాజం పోషించాల్సిన అత్యవసర పాత్ర, మస్తీష్కమ్ అంతరదృష్టి, విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధ ఆలోచనా సరళి, సమాజంలో రాజకీయాలు సృష్టిస్తున్న ప్రభావంలో చిన్నారుల నైతిక విలువలు సామాజిక విలువలు కాపాడటంలో బ్రహ్మ సమాజం నిర్వహించాల్సిన బాధ్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. అలాగే బ్రహ్మోపాసన, సంగీతోపాసన, భజనలు, వేద పఠనం, క్విజ్ తో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి 150 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని వారు వివరించారు. ఆసక్తిగల వారు విచ్చేసి ఈ సమావేశాల్లో పాల్గొనవచ్చని, బ్రహ్మ సమాజంలో సభ్యులుగా చేరవచ్చని ఆహ్వానిస్తున్నారు.
– డా. మహ్మద్ రఫీ
Rafee Vartha