ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగింది అనిపించింది – సంపూర్ణేష్ బాబు

135

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు విలేకర్లతో ముచ్చటించిన సంపూర్ణేష్ బాబు, వెంకటేష్ మహా చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ రీమేక్ చేయడానికి కారణం ఏంటి? తెలుగుకి తగ్గట్టుగా ఎలాంటి మార్పులు చేశారు?
సంపూర్ణేష్ బాబు: తెలుగుకి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు. మహా గారు సినిమా చేద్దామని పిలిచి, మండేలా మూవీ చూపించారు. నాకు తమిళ్ అంతగా అర్థంకాదు అంటే, పర్లేదు మీ ఆ పాత్రను అర్థం చేసుకోండి చాలు. ఇప్పటిదాకా మీరు చేసిన సంపూర్ణేష్ బాబు, భారీ డైలాగ్ లు అలాంటివి వద్దు. మాకు కొత్తగా కావాలని చెప్పారు. నా నుంచి కొత్తగా ఏదో ఆశిస్తున్నారని అర్థమై, సరే చేద్దామని చెప్పాను.

ఈ పాత్రను సంపూర్ణేష్ గారితో చేపించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది?
వెంకటేష్ మహా: మొదట వైనాట్ స్టూడియోస్ నుంచి ఈ సినిమా డైరెక్ట్ చేయమని నాకు ఫోన్ వచ్చింది. అప్పటికే నా దగ్గర ఒరిజినల్ కథలు చాలా ఉన్నాయి. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కూడా అప్పుడు కాస్త ఖాళీ సమయం ఉండటం మరియు ఇతర కారణాల వల్ల చేయడం జరిగింది. ఈ సినిమా విషయంలో మాత్రం నేను చేయలేనని చెప్పాను. ఒకసారి సినిమా చూడమంటే చూశాను. చూశాక అర్థమైంది.. ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన కథ. ప్రజాస్వామ్యం ఎన్ని దేశాల్లో ఉంటే అన్ని దేశాల్లో చూపించాల్సిన సినిమా. అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ. ఆ తర్వాత పూజ గారిని దర్శకురాలు అనుకున్నాం. సుధ కొంగర లాంటి వారితో సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి పూజ ఎంపిక పట్ల వైనాట్ స్టూడియోస్ వారు చాలా హ్యాపీ. అయితే ఈ పాత్రకి ఏ నటుడిని తీసుకోవాలి అనేదే అసలైన చిక్కు. వైనాట్ స్టూడియోస్ శశి గారు 20 రోజుల్లో వస్తాం అన్నారు. మేము పీపీటీ రెడీ చేసి, తెలుగుకి తగ్గట్టుగా ఎలా తీయబోతున్నాం అనేది ఆయనకి వివరించాలి. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ నటుడి ఎంపిక జరగలేదు. రూపురేఖల్లో యోగిబాబులా ఉండే నటుడి కోసం మేం వెతకలేదు. తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా ఆ పాత్రకి సరిపోయే నటుడిని వెతికాం. 19 రోజులు గడిచాయి. రేపే శశి గారికి అన్నీ వివరాలు చెప్పాలి. ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఓ 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని పడుకొని ఆలోచించడం నాకు అలవాటు. అప్పుడు సడెన్ గా సంపూర్ణేష్ గుర్తుకొచ్చారు. సంపూ గారి లైఫ్ స్టైల్ గురించి ఒక డాక్యుమెంటరీ చూశాం. ఈయన తెర మీద ఆ పాత్రలో కనిపిస్తే ఒక సగటు మనిషి వచ్చాడురా అనే భావన చూసే ప్రేక్షకులకు కలుగుతుంది అన్నాను. ఆ తర్వాత ఆయనతో మాట్లాడటం, ఆయన ఈ పాత్ర చేయడానికి అంగీకరించడం జరిగిపోయాయి.

ఇప్పటిదాకా సంపూ గారు చేసిన పాత్రలు, సినిమాలు వేరు. ఆ ఇమేజ్ కి భిన్నంగా ఈ పాత్ర చేయించడం ఛాలెంజింగ్ గా అనిపించలేదా?
వెంకటేష్ మహా: ఆయన కూడా పాత్రకి తగ్గట్టుగా తనని తాను మలుచుకొని ఎంతో సహకరించారు. వర్క్ షాప్స్ లో కూడా పాల్గొన్నారు. దాదాపు ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ ముందుగానే రిహార్సల్స్ చేశారు. డైరెక్టర్ గారు కొత్త టెక్నిక్స్ తో వర్క్ షాప్స్ చేశారు. షూటింగ్ మొదలయ్యాక సెట్స్ లో సంపూ గారికి, డైరెక్టర్ గారికి మధ్య సింక్ చూసి ఆశ్చర్యమేసేది. వాళ్ళు వర్క్ షాప్స్ లో అంతలా ట్రైన్ అయ్యారు.

సంపూర్ణేష్ బాబు: నేను హృదయ కాలేయం సినిమా చూసినప్పుడు స్క్రీన్ మీద ఉన్నది, నేను ఒక్కడేనా అనే ఫీలింగ్ కలిగింది. నరసింహాచారి అనే వ్యక్తి సంపూర్ణేష్ బాబు కావడం, హృదయ కాలేయం సినిమా రావడం అప్పటికి నన్ను నేను నమ్మలేకపోయాను. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఈ సినిమా చూస్తే కలిగింది. నేను ఎన్ని సినిమాలు చేసినా, పెద్ద పెద్ద డైలాగ్ లు చెప్పినా, డ్యాన్స్ లు చేసినా.. డైరెక్టర్ గారు వర్క్ షాప్ చేద్దామన్నారు. ఆమెకి మొదటి సినిమా కానీ నేను ఇప్పటికే సినిమాలు చేసి ఉన్నాను కదా.. వర్క్ షాప్ ఏంటి? సరే చూద్దాంలే అనుకున్నాను. కానీ నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను మళ్ళీ గుర్తు చేశారు.

రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు ఒరిజినల్ నటుడి ప్రభావం ఎంతో కొంత పడుతుంది. దానిని మీరు అధిగమించారు?
సంపూర్ణేష్ బాబు: నేను ఆ నటుడుని ఫాలో అవ్వలేదు. మీరు నరసింహాచారిలా ఊరిలో ఎలా ఉంటారో అలా ఆఫీస్ కి రండి అని చెప్పారు. చెప్పులు కుట్టే సాధారణ వ్యక్తి ఎలా నడుస్తాడో అలాంటి నడక కావాలి అన్నారు. నేను ఎప్పుడో నేర్చుకున్న నటనను నిద్ర లేపింది ఈ పాత్ర. నేను ఆ పాత్ర అంత బాగా చేయడానికి కారణం డైరెక్టర్ గారే.

ఈ సినిమాలో మీరు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఆ ఆలోచన ఎవరిది?
వెంకటేష్ మహా: ఈ పాత్ర మీరు చేస్తే బాగుంటుందని మొదట పూజ గారు అన్నారు. అప్పటికి నేను అంటే సుందరానికీ వంటి కొన్ని సినిమాలు చేయడం ఆమె చూశారు. అలా ఆమె మీరు ఈ పాత్ర చేస్తే బాగుంటుంది అన్నారు. కానీ నాకు ఎవరైనా వేరే మంచి నటుడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపించింది. దానికోసం ఆడిషన్స్ కోసం చేశాం. ఎంతో ప్రతిభగల ఒక నటుడిని ఎంపిక చేశాం. అయితే మా సినిమా మొదలయ్యే సమయానికి ఆయన ఒక పెద్ద సినిమాలో పాత్ర కోసం డేట్లు ఇచ్చి ఉండటం రాలేకపోయారు. ఇంకో 10-15 రోజుల్లో షూటింగ్ కి వెళ్తాం అనగా.. నరేష్ గారు కూడా ఈ పాత్ర మీరు చేయాలని నాతో అన్నారు. ఆ నటుడి డేట్స్ కుదరకపోవడం వల్ల అలా నేను ఈ పాత్ర చేయాల్సి వచ్చింది.

ఈ సినిమాకి డైరెక్టర్ గా పూజ గారిని ఎంచుకోవడానికి కారణం?
వెంకటేష్ మహా: తెలుగుకి తగ్గట్టుగా రచన పరంగా నేను మార్పులు తీసుకొస్తాను కానీ.. కొత్త డైరెక్టర్ అయితే సినిమాకి కొత్తదనం వస్తుంది అనిపించింది. శశి గారితో అదే మాట చెప్పాను. నేను నిర్మాణ భాగస్వామిగా, రచయితగా వ్యవహరిస్తాను. డైరెక్టర్ ఎంపిక కోసం మాత్రం కాస్త సమయం కావాలని అన్నాను. అలా ఆయనతో ఫోన్ మాట్లాడి పెట్టేశాను. నా ఎదురుగా పూజ ఉన్నారు. నేను ఈ సినిమా డైరెక్ట్ చేస్తా అన్నారు. ఆమె అసోసియేట్ గా నా టీమ్ లో పని చేశారు. నేను అప్పుడు ఆమెని ఒక్కటే ప్రశ్న అడిగాను.. మీరే ఎందుకు డైరెక్ట్ చేయాలని?. నన్ను ఇండస్ట్రీలో చాలామంది నేను చెప్పాలనుకుంటున్న కథలు కాకుండా.. ఆ కథలు తీయి, ఈ కథలు తీయి అంటూ నా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో పాత్రకి తన ఐడెంటిటీ తెలియదు. చివరికి తన ఐడెంటిటీ చాటుకుంటాడు. మీ అందరి కంటే కూడా ఆ పాత్రని నేనే బాగా అర్థం చేసుకోగలను అని చెప్పారు. ఆ తర్వాత నేను శశి గారితో మాట్లాడాను. మేము సుధ కొంగర, పుష్కర్ గాయత్రి వంటి వారితో పనిచేశాం.. మాకు ఎలాంటి సమస్య లేదు.. సంతోషమే అన్నారు. అలా పూజ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా విషయంలో నేను తీసుకున్న నిర్ణయాలలో సంపూర్ణేష్ గారిని నటింపచేయాలి అనుకోవడం, పూజ గారిని డైరెక్టర్ గా తీసుకోవడం ఉత్తమమైనవి.

ఎన్నికల వేడి మొదలైన సమయంలో సినిమా విడుదలవుతుంది.. ముందుగానే ఇలా ప్లాన్ చేశారా?
వెంకటేష్ మహా: లేదండీ.. అలా కుదిరింది. ఫిబ్రవరికి ఈ సినిమా రెడీ అయింది. మే లోనే విడుదల చేయాలి అనుకున్నాం. కానీ ఆ సమయంలో చాలా సినిమాల విడుదల ఉండటంతో కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. అదే సమయానికి ఎన్నికలు హడావుడి మొదలవ్వడం అనేది అనుకోకుండా జరిగింది.

ఈ సినిమా ప్రభావం మీ తదుపరి సినిమాల ఎంపికపై ఎలా ఉండబోతుంది?
సంపూర్ణేష్ బాబు: ఇప్పటికైతే దాని గురించి ఏం ఆలోచించడంలేదు. ఇదొక కొత్త సినిమా. ప్రయోగం చేశారు. నన్ను కొత్తగా చూపించారు. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్లు వేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలామంది నీకు సరైన సినిమా పడిందని అన్నారు. సినిమా విడుదల కోసం ఎంతగానో ఎదరుచూస్తున్నాను. ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగింది అనిపించింది.

కామెడీ సినిమాలు చేయడం సులభంగా ఉందా? ఇలాంటి సినిమా చేయడం సులభంగా ఉందా?
సంపూర్ణేష్ బాబు: ఇది నా మొదటి సినిమా లాగా చేశాను. కష్టమైనా, ఇష్టమైనా నటుడిగా అన్నీ చేయాలి. గత సినిమాలు నాకు కష్టం అనిపించలేదు. ఈ సినిమానే కష్టం అనిపించింది. ఎందుకంటే పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా కొద్ది నెలలు పాటు ఓ సన్యాసిలా బ్రతకాలి. ఒక ఖాళీ బాటిల్ లా ఉండాలి. దానిలో పాలు పోస్తే పాల బాటిల్, నీళ్ళు పోస్తే నీళ్ళ బాటిల్, పెట్రోల్ పోస్తే పెట్రోల్ బాటిల్ అవ్వాలి. అలా ఉండటం కోసం చాలా వర్క్ చేశాను.

సినిమా చూశాక ప్రేక్షకులు ఎవరిని కింగ్ లా భావిస్తారు?
వెంకటేష్ మహా: ప్రేక్షకులు తమని తాము కింగ్ లా ఫీలయ్యి థియేటర్ల నుంచి బయటకు వస్తారు. టీమ్ పరంగా చెప్తే మాత్రం.. సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరూ కింగే.

దర్శకుడిగా గ్యాప్ రావడానికి కారణం ఏంటి?
వెంకటేష్ మహా: రెండు మూడు కథలు రాసుకొని ఎందరికో చెప్పారు. చాలామందికి నచ్చాయి కానీ కార్యరూపం దాల్చలేదు. దానికి పలు కారణాలు ఉన్నాయి. ప్రధాన కారణం నేను అనుకున్న మూల కథను మార్చేలా మార్పులు చెప్పడం. అసలు మూల కథ మార్చేస్తే ఇంకేం ఉంటుంది. అందుకే నా మనసు ఒప్పలేదు. కాస్త ఆలస్యమైనా ప్రస్తుతం మర్మానువు అనే ఓ మంచి సినిమాని రూపొందిస్తున్నాను. ఒక జానర్ కి పరిమితం కాకుండా విభిన్న చిత్రాలు చేయాలనేది ఆ ఉద్దేశం. ఆ దిశగానే నా అడుగులు పడుతున్నాయి.