చిత్రిస్తూ.. న‌టిస్తూ.. వివరెడ్డి పాతికేళ్ళ సినీ ప్రస్థానం

73


▪️ ఈ ‘ఫస్ట్ లుక్’లకు పాతికేళ్లు!
▪️ ఇండస్ట్రీలో వివ పాత్ర ప్రత్యేకం
▪️ టైటిల్ వివ చిత్రించాడంటే సినిమా హిట్ కొడుతుందనే సెంటిమెంట్
▪️ జన్మదినం జరుపుకుంటున్న వివ రెడ్డి

ఆ అక్ష‌రాల‌కు ‘ముహూర్తం’ పెట్టారంటే సినిమా ‘సూప‌ర్’ హిట్ కొట్టాల్సిందే..! ఎలాంటి స‌బ్జెక్టుకైనా ‘రెడీ’ అంటూ ‘దూకుడు’ చూపించాల్సిందే.. ఆ కుంచె నుంచి ‘ప‌రుగు’ తీసే అక్ష‌రాలు ప్రేక్ష‌కుల గుండెల్లో ‘దిల్‌’గా నిలిచి పోతాయి. సినిమా అనే ‘బొమ్మ‌రిల్లు’లో ‘దేశ‌ముదురు’, ‘పోకిరీ’, ‘డాన్ శీన్’, ‘ఆర్య‌2’, ‘అప్ప‌ల్రాజు’, ‘శివ‌మ‌ణి’, ‘ఏకల‌వ్‌యుడు’, ‘దొంగోడు’, ‘ఆగ‌డు’.. ఇలా ఎలాంటి వారికైనా ఆ కుంచె ఓ రూప‌మిస్తుంది. నిరంత‌రం ‘కిత‌కిత‌లు’ పెడుతూ ‘ఇంకోసారి రెడీ’ అంటూ పాతికేళ్లుగా నిరంత‌రం వెలుగుతోంది వివ రెడ్డి అనే ఓ అక్షర ‘ఆయుధం’.

వివ‌.. అంటే ‘విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు’కి షార్ట్ క‌ట్. ఈ ప‌బ్లిసిటీ డిజైన‌ర్ చేతిలో రూపొందే ‘చిత్రం’.. చ‌ల‌నచిత్రాన్ని ప‌రిచ‌యం చేస్తుంది.. సినిమా ఇతివృత్తమేంటో చెబుతుంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. థియేట‌ర్‌ల‌కు ప‌రుగులు పెట్టిస్తుంది. అంత‌టి శ‌క్తి ఉన్న వివ‌ కుంచెకు పాతికేళ్లు నిండాయి. ఇదే స‌మ‌యంలో ‘ఈనాడు’ (మే 24న‌) విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్న సంద‌ర్భంగా స్పెష‌ల్ స్టోరీ.

▪️ సినీ ‘ప్రస్థానం’ ఇలా…
అనుకున్న రంగంలో విజ‌యం సాధిస్తే జీవితంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. వ‌రంగ‌ల్‌కు చెందిన విష్ణువ‌ర్థ‌న్ రెడ్డిది దిగువ మ‌ద్య‌తర‌గ‌తి కుటుంబం. చిన్న‌ప్ప‌టి నుంచే చిత్ర‌క‌ళలో ఎంతో ప్ర‌తిభ చూపించేవాడు. స్కూల్‌లో డ్రాయింగ్ చ‌క్క‌గా వేసేవాడు. ఓ సారి స్కూల్ వ‌య‌సులోనే స్టేట్ ఫ‌స్ట్ వ‌చ్చాడు. త‌న ప్ర‌తిభ‌కు త‌గిన ప్లాట్‌ఫాం కావాలి. 1999లో హైదరాబాద్ వచ్చాడు విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి. ఆ క్రమంలో జేఎన్‌టీయు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఎఫ్ఏ చేశాడు. ఆ స‌మ‌యంలోనే హైద‌రాబాద్‌లో ఆర్ట్ ఎగ్జిబిష‌న్‌ల‌కు హాజ‌ర‌య్యేవాడు. అలా ఆర్టిస్టు ల‌క్ష్మ‌ణ్ ఏలే, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ధని ఏలే వంటి ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు ఏర్ప‌డ్డాయి. అవే వివ కెరీర్‌కు బాట‌లు వేశాయి.

ధ‌ని ఏలే ఆఫీసులో దిల్ సినిమా లోగో సెల‌క్ష‌న్ న‌డుస్తోంది. ఎన్నో లోగోలు త‌యారు చేసినా ద‌ర్శ‌కుడి వ‌ద్ద ఓకే కాలేదు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న వివ స‌ర‌దాగా రాసిన లోగోకు డైరెక్ట‌ర్ ఓకే చెప్పారు. ధ‌ని ఏలే త‌న వ‌ద్ద ఫ్రీలాన్స‌ర్‌గా ప‌ని చేయాల‌ని వివ‌కు అవ‌కాశ‌మిచ్చారు. ‘దిల్‌’తో వివ ద‌శ కూడా తిరిగిపోయింది. కంప్యూట‌ర్ ఫాంటుల కృత్రిమ రాత‌ల‌కు భిన్నంగా చేతిరాత‌తో ఫ్రెష్‌నెస్ నింపే వివ రైటింగ్ స్టైల్ ఇండ‌స్ట్రీలో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

దిల్ సినిమా లోగోతో సినీ డిజైనర్ కెరీర్ ప్రారంభించిన‌ విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి.. పాతికేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 500 పైగా సినిమాలకు లోగో డిజైన్ చేశాడు. పబ్లిసిటీ డిజైనర్‌గా మొదటి సినిమా ‘బంగారు కొండ’. వంద‌ సినిమాలకు పైన పబ్లిసిటీ డిజైనర్‌గా చేశాడు. బంగారుకొండ‌, పోకిరి, దూకుడు, అర్జున్, బొమ్మ‌రిల్లు, చంద్ర‌ముఖి, వినాయకుడు, దొంగోడు, ముహూర్తం, జై బోలో తెలంగాణ‌, ఆర్య‌2, ఆయుధం, దేశ‌ముదురు, కిత‌కిత‌లు, డాన్ శీను, ప‌రుగు, ప్ర‌స్థానం, ర‌క్త చ‌రిత్ర‌, శివ‌మ‌ణి, ‘ సింహ, సర్కారు నౌకరి, రెడీ, ఢీ డాన్స్ షో లోగో.. ఇలా ఎన్నో సినిమాల‌కు, టీవీ సీరియ‌ల్‌ల‌కు, షోల‌కు లోగోల‌ను రాశాడు. స్టార్ హీరోల‌కు వివ అందించిన లోగోలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, వంశీ లాంటి ద‌ర్శ‌కులు పిలిపించుకుని ప్ర‌శంసించారు. అవ‌కాశాలు ఇచ్చారు. దాసరి “పరమవీరచక్ర” , వంశీ ” గోపి గోపిక గోదావరి” సినిమాలకు లోగోలు రాయించుకొని వివ‌రెడ్డికి మంచి భ‌విష్య‌త్ ఉందంటూ ప్రశంసించారు.

వివ ఆర్టిస్టు. చిత్రాలు గీయాడంలోనే కాదు, సినిమాల్లో న‌టించడం కూడా ఆయ‌న‌లో ఉన్న మ‌రో క‌ళ‌. న‌టించాల‌నే క‌ల‌ను నెర‌వేర్చుకుంటున్నాడు. ఇప్ప‌టికే పాతిక సినిమాల్లో న‌టించాడు. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి ప్రియదర్శిని. ఆ తర్వాత జోరుగా హుషారుగా, స్వామి, రౌడీ, . లవ్ టుడే, నిన్నుకలిసాక , లవ్ కే రన్, కళావర్ కింగ్, ది బెల్స్, గంధర్వ , టాప్ గేర్.. వంటి సినిమాల్లో న‌టించాడు. మేక సూరి మూవీలో విలన్ గా చేశాడు. భీమదేవరపల్లి బ్రాంచి, సోదర సోదరీమణులారా, అష్టదిగ్బంధనం.. వంటి సినిమాల్లో యాక్ట‌ర్‌గా నిరూపించుకునే క్యారెక్ట‌ర్‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఓ తండ్రి తీర్పు (హీరో), ద స్కూల్ లో (విలన్) , జయతు జయతు (విలన్), నంద, లగ్గం సినిమాల్లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం.. ‘అందరి కథ ఇంతే ‘ ‘జయతు జయతు’, ‘లగ్గం’.. వంటి సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా చేస్తున్నాడు.

సినిమా షూటింగ్ ముగిసిందంటే దాదాపు అన్నీ శాఖ‌ల ప‌నులూ పూర్త‌యిన‌ట్టే. ఒక్క ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌కు త‌ప్ప‌. ఫ‌స్ట్ లుక్‌, పోస్ట‌ర్‌ల నుంచి మొద‌లు పెడితే, రెండోవారం, మూడో వారం.. యాభై రోజులు, వంద రోజులు.. ఇలా ఎప్పుడూ ప‌నే ఉంటుంది. నిత్యం ప‌నిలో మునిగిపోయే సృజ‌నాత్మ‌క‌త కుంచె వివ‌. ఈ రోజుల్లో ఆడియో-ఫ్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లు జ‌రిగిన‌ట్టే.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ఫంక్ష‌న్‌లు జ‌రుగుతున్నాయి. టైటిల్, పోస్ట‌ర్ వంటి సృజ‌నాత్మ‌క‌త‌కు సినీ ఇండ‌స్ట్రీ ఇటీవల పెద్ద పీట వేస్తోంది. ఏదేమైనా తన ప్రతిభతో సినీ ప‌య‌నం విజయవంతంగా సాగిస్తూ త‌న క‌ళ‌ల‌తో క‌లల‌ను నెర‌వేర్చుకుంటున్నాడు వివ‌రెడ్డి.