రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అరణ్య. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాదన్’ పేర్లతో విడుదల కానుంది. శాంతను సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన విక్టరి వెంకటేష్ అరణ్య మూవీ స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల, రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, హీరోయిన్ జోయా హుస్సేన్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పాల్గొన్నారు.
డైరెక్టర్ ప్రభు సాల్మన్ వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ – ‘‘ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రేపు థియేటర్లలో అరణ్య సినిమా మాట్లాడుతుంది. రానా, విష్ణువిశాల్, పుల్‌కిత్ సామ్రాట్, జోయా, శ్రీయాలతో పాటుగా దాదాపు మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ సాంకేతిక నిపుణులకు కూడ ధన్యవాదాలు. ముఖ్యంగా సౌండ్ ఇంజినీర్ రసూల్, శాంతనులకు థ్యాంక్స్. ప్రకృతి, ఏనుగులు వంటి వాటిపై అరణ్య వంటి ఓ సినిమా తీసేందుకు సపోర్ట్ చేసిన ఈరోస్ ఇంటర్‌నేషనల్ సంస్థకు థ్యాంక్స్“ అన్నారు
రానా దగ్గుబాటి మాట్లాడుతూ – “కెమెరా ముందు ఒక వ్యక్తి ఎలా ఉండాలో నాకు నేర్పించింది శేఖర్ కమ్ములగారు ఆయన కార్యక్రమానికి రావడం హ్యాపీగా ఉంది. నేను చాలా యాక్టింగ్ నేర్చుకున్నాను అని చెప్పడానికి ఆయన్ని ఇక్కడికి పిలిచాను (నవ్వుతూ). సాయి మాధవ్‌గారు, క్రిష్‌గారు కలిసి కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో మొత్తం భాగవత తత్వం నేర్పించారు. జీవితంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన ఎలా ఈజీగా తీసుకోవాలో నాకు ఈ సినిమా నేర్పించింది. ఈ నెల 26న మీరు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఈరోస్ వారికి నా స్పెషల్ థ్యాంక్స్“ అన్నారు.
విక్టరి వెంకటేష్ మాట్లాడుతూ – ‘‘ప్రకృతితోనే మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రకృతి పట్ల మనం అందరం బాధ్యతగా ఉండాలి. మనం ప్రకృతితో ఆడుకుంటే ఏం జరుగుతుందో మనందరికి తెలుసు. శనివారం అరణ్య సినిమా చూశాను. అరణ్య సినిమా మనం అందరం గర్వపడేలా ఉంది. లీడర్, ఘాజీ, బాహుబలి వంటి సినిమాల్లో రానా విభిన్నమైన పాత్రలు పోషించాడు మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. అరణ్య సినిమా పెద్ద సక్సెస్ కావాలి“ అన్నారు.