HomeTeluguఅకిరా కురసోవా క్లాసిక్‌ మూవీ 'సెవెన్ సమురాయ్'లో డైలాగ్‌ స్ఫూర్తితో 'బెదురులంక 2012' తీశాం - దర్శకుడు...

అకిరా కురసోవా క్లాసిక్‌ మూవీ ‘సెవెన్ సమురాయ్’లో డైలాగ్‌ స్ఫూర్తితో ‘బెదురులంక 2012’ తీశాం – దర్శకుడు క్లాక్స్‌ ఇంటర్వ్యూ

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

క్లాక్స్… ఈ పేరు కొత్తగా ఉంది. దాని వెనుక కథ ఏమిటి?
పెద్ద కథ ఏమీ లేదు. పదో తరగతి అయ్యాక ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కొన్ని పదాలు పలకడం రాకపోతే ఏదో ఒక సౌండ్ చేస్తాం కదా! అలా అలా క్లాక్స్ అనడం మొదలైంది. నేను ఆ వర్డ్ ఎక్కువ చేస్తున్నానని టీజ్ చేసేవాళ్ళు. అది ఏదో బావుందని అనిపించింది. యాహూ మెస్సెంజర్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఆ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేశా. స్లో స్లోగా అందరూ అలా పిలవడం మొదలైంది. ఆ తర్వాత Clax అంటే నథింగ్ అని తెలిసింది.

మీ అసలు పేరు ఏంటి?
ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు.

మీది ఏ ఊరు? మీ నేపథ్యం ఏమిటి?
మాది భీమవరం దగ్గర ఓ పల్లెటూరు. చిత్రసీమలోకి రాకముందు చాలా ఉద్యోగాలు చేశా. డీజేగా కొన్ని రోజులు పని చేశా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. దొరికిన ఉద్యోగాలు అన్నీ చేశా. క్రెడిట్ కార్డ్స్, సేల్స్ లో కూడా చేశా. నా రూమ్మేట్స్ సినిమాల్లో ట్రై చేసేవారు. వాళ్ళతో కథలు డిస్కస్ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. అయితే, అనుకోకుండా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అని ఇటాలియన్ సినిమా చూసా. అది నాపై చాలా ప్రభావం చూపించింది. సినిమాతో ఇంత ప్రభావం చూపించవచ్చా? అనిపించింది. అమెరికా నుంచి వస్తున్న వాళ్ళతో సినిమాకు సంబంధించిన పుస్తకాలు తెప్పించుకుని చదివా.

దర్శకత్వ శాఖలో ఎవరెవరి దగ్గర పని చేశారు?
నా ఫ్రెండ్ చరణ్ ద్వారా సుధీర్ వర్మ గారు పరిచయం అయ్యారు. అప్పుడు ఆయన ‘వీడు తేడా’కి పని చేస్తున్నారు. ఆ సినిమాకు పని చేశా. తర్వాత ‘స్వామి రారా’కు కూడా పని చేశా. టెక్నికల్ విషయాల్లో ఆయన చాలా స్ట్రాంగ్. సుధీర్ వర్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. బుక్స్ ఎక్కువ చదవడం వల్ల ప్రతి సినిమాలో తప్పులు కనిపించేవి. తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర ఆరు నెలలు పని చేసే అవకాశం లభించింది. సినిమా అనేది సైన్స్ కాదు. దీన్ని రూల్స్ బట్టి చూడకూడదు. ఆర్ట్ / కళగా చూడాలని అర్థమైంది. అప్పుడు నాలో భయం పోయింది. దేవా కట్టా గారు ‘బాహుబలి’ సిరీస్ తీయాలని వర్క్ చేశారు. దానికి కూడా పని చేశా. సుధీర్ వర్మ గారు, దేవా కట్టా గారు సెకండ్ యూనిట్ డైరెక్షన్ ఛాన్సులు ఇచ్చారు. అందువల్ల, ‘బెదురులంక 2012’ ఫస్ట్ డే డైరెక్ట్ చేసేటప్పుడు నాకు స్ట్రెస్ ఏమీ అనిపించలేదు.

‘బెదురులంక 2012’ కథను కార్తికేయకు ఎప్పుడు చెప్పారు?
రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పని చేసినప్పుడు నాకు అజయ్ భూపతి పరిచయం అయ్యారు. ఆయన ‘కిల్లింగ్ వీరప్పన్’కి పని చేశారు. నేను కథలు చెప్పడం మొదలు పెట్టినప్పుడు… ‘ఆర్ఎక్స్ 100’ షూటింగ్ జరుగుతుంది. అజయ్ భూపతి ద్వారా కార్తికేయ పరిచయం కావడంతో వేరే కథ చెప్పా. ఆయనకు నచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’ భారీ విజయం సాధించడంతో ఆయన దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. కొన్ని రోజుల తర్వాత షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం ఒక సెట్ కు వెళ్ళా. అక్కడ ‘చావు కబురు చల్లగా’ జరుగుతుంది. ‘ఇంకో కథ ఉంది. వింటారా?’ అని కార్తికేయను అడిగితే… ‘ఓకే’ అన్నారు. ఈయన 5 గంటలకు రమ్మంటే… మరో హీరో 6 గంటలకు రమ్మన్నారు. ఏదో చేసి ఇద్దరికీ కథ చెప్పా. ఇద్దరికీ నచ్చింది. లాక్‌డౌన్ రావడంతో ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

మళ్ళీ ఎప్పుడు సినిమా మొదలైంది?
లాక్‌డౌన్ తర్వాత ‘సూపర్ ఓవర్’ కోసం హైదరాబాద్ వచ్చాం. ఆ సినిమా దర్శకుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఆ ప్రమాదంలో నాకు కూడా గాయాలు అయ్యాయి. ఆ సమయంలో సుధీర్ వర్మ తమ్ముడు ఫణి గారి ద్వారా బెన్నీ ముప్పానేని పరిచయం అయ్యారు. ఆయనకు స్టోరీ సినాప్సిస్ పంపిస్తే… కథ చెప్పడానికి రమన్నారు. కథ చెప్పగానే కోర్ పాయింట్ చెప్పారు. ఆయన కథను అర్థం చేసుకోవడంతో హ్యాపీగా ఫీలయ్యాను. తర్వాత ఆయన మెసేజ్ చేసేవారు. ఆ తర్వాత కార్తికేయకు కథ చెప్పా. ఆయన మొదటి ఆప్షన్ అనుకోలేదు. కానీ, చివరకు ఆయనతో సినిమా ఓకే అయ్యింది.

‘బెదురులంక 2012’ టైటిల్ వెనుక కథ ఏమిటి?
సినిమా అంతా ఫిక్షనల్ ఐలాండ్‌లో జరుగుతుంది. మేం ‘ఎదురులంక’ అని ఓ ఊరిలో షూటింగ్ చేశాం. బోర్డులపై ‘బెదురులంక’ అని రాశాం. ఎందుకంటే… కథలో ఓ ఫియర్ ఉంటుంది. దానిని కంటిన్యూ చేసేలా ఆ పేరు పెట్టాం. ముందు వేరే టైటిల్స్ అనుకున్నాం. చివరకు, ‘బెదురులంక 2012’ బావుంటుందని కార్తికేయ, బెన్నీ గారు చెప్పారు. బావుందని ఓకే చేశాం.

అసలు, కథ ఏమిటి? దీనికి స్ఫూర్తి ఏమిటి?
నాకు అకిరా కురసోవా ‘సెవెన్ సమురాయ్’ చాలా ఇష్టం. అందులో ఓ డైలాగ్ ఉంటుంది. రేపు ఉండదని అన్నప్పుడు… సమాజం ఏమనుకుంటుందో మనం పట్టించుకోము. ఆ మాట నచ్చింది. ఆ పాయింట్ మీద ఏదో ఒకటి తీయాలని అనుకున్నా. అప్పుడు హాలీవుడ్ సినిమా ‘2012’ వచ్చింది. ఆ రెండిటి స్ఫూర్తితో పల్లెటూరి నేపథ్యంలో కొత్త కథ రాశా. డ్రామెడీ జానర్ సినిమా తీశా. సందేహం కూడా అంతర్లీనంగా ఉంటుంది తప్ప… వినోదం, డ్రామా ఎక్కువ ఉంటుంది. తెరపై పాత్రల కంటే ప్రేక్షకుడికి ఎక్కువ కథ తెలుస్తుంది. దాంతో వినోదం బావుంటుంది.

కార్తికేయ ఎలా చేశారు?
ఊరిని ఎదిరించే కుర్రాడిగా ఆయన కనపడతారు. ఆయన మీద ఓ షాట్ తీస్తే… ప్రేక్షకులు ఈజీగా నమ్ముతారు. నేను ఆయనకు చెప్పింది ఒక్కటే… మీ బాడీ లాంగ్వేజ్ ఫైటర్ లా కాకుండా డ్యాన్సర్ లా ఉంటే బావుంటుందని చెప్పా. ఆయన చాలా బాగా చేశారు.

నేహా శెట్టిని ‘డీజే టిల్లు’ విడుదలకు ముందు ఎంపిక చేశారా? ఆ తర్వాత సెలెక్ట్ చేశారా?
‘డీజే టిల్లు’ విడుదల తర్వాత ఎంపిక చేశాం. ఆమె అయితే బావుంటుందేమో ఓసారి చూడు అని నిర్మాత చెప్పారు. మాది పల్లెటూరి నేపథ్యంలో సినిమా. నేహా శెట్టి బాగా ఫెయిర్. సూట్ అవుతారో? లేదో? అని సందేహించా. తర్వాత లుక్ టెస్ట్ చేశాం. ఓకే అనుకున్నాం. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ సర్‌ప్రైజ్ చేశారు. నేహా శెట్టి అందమైన నటి. చాలా చక్కగా నటిస్తారు.

సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకోవాలనే ఆలోచన ఎవరిది?
నిర్మాత బెన్నీ గారు, నేను తీసుకున్న నిర్ణయం అది. ఆ తర్వాత కార్తికేయకు బాగా ఇష్టమైన సంగీత దర్శకుడు ఆయన అని తెలిసింది. మణిశర్మ గారు అనేసరికి కొందరు నన్ను హెచ్చరించారు కూడా! దర్శకుడిగా నాకు ఇది తొలి సినిమా కనుక మణిశర్మ గారితో చేయించుకోవడం కష్టం అని చెప్పారు. ఆయనకు నో చెప్పడం ఈజీ. నాకు సంగీతం, రాగాలు ఏవీ తెలియదు. ఆ విషయం ఆయనకు కూడా చెప్పా. ‘నీ మనసులో ఏముందో కక్కెయ్’ అనేవారు. మా సినిమాకు అద్భుతమైన సంగీతం అందించారు.

సుధీర్ వర్మ గారు సినిమా చూశారా? ఏమన్నారు?
టీజర్, ట్రైలర్స్ చూశారు. బావుందని చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి… ఈ కథను అందరి కంటే ముందు చెప్పింది ఆయనకే. ‘స్వామి రారా’ కంటే ముందు వినిపించా. ఆ తర్వాత చాలా మందికి చెప్పా. ప్రొఫెషనల్ గా తొలిసారి చెప్పింది అయితే రాజీవ్ కనకాల గారికి. కామన్ ఫ్రెండ్ ద్వారా వెళ్లి కలిశా. కథ ఎలా చెప్పాలో నాకు తెలియదు. మొత్తం పూర్తయ్యాక… ‘మీరు ఇలాగే కథ చెప్పండి’ అన్నారు. ఈ సినిమాలో ఆయనకు సరిపడా క్యారెక్టర్ లేక తీసుకోలేదు.

కార్తికేయకు కాకుండా వేరే హీరోలకు కథ చెప్పానని అన్నారు. ట్రైలర్స్ చూసి వాళ్ళు ఏమన్నారు?
ఫోన్స్ చేసి బావుందని చెప్పారు. ఆ హీరోలకూ కథ నచ్చింది. అయితే, రెగ్యులర్ మాస్ మసాలా అంశాలు ఉన్న కథ కాదు. ఎలా ఉంటుందో అని ఆలోచనలో ఆగారు. లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చింది. మా పేరెంట్స్ కూడా మలయాళ, ఇతర భాషల సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహా కథలతో సినిమాలు తీయవచ్చని అందరూ నమ్ముతున్నారు. మా నిర్మాత బెన్నీ గారు ముందే నమ్మారు.

సినిమా ఎవరికి చూపించారు?
ప్రస్తుతానికి సెన్సార్ సభ్యులు మాత్రమే చూశారు. మా సినిమాకు ఒక్క విజువల్ కట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. హ్యాపీగా అనిపించింది. ఆడియన్స్‌ రియాక్షన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES