వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు సత్యదేవ్ – గోపి గణేష్ కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్‌ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో..
చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో ముందుగా కె.ఎస్.రామారావుగారికి థాంక్స్ చెప్పాలి. అన్నయ్య నాపై నమ్మకంతో నాకు ఈ సినిమాను లీడ్ చేశారు. సినిమా పూర్తయిన తర్వాత నాకు అనిపించిందేంటంటే.. టి.కృష్ణగారితో నాకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో సినిమా చేయలేదనే ఫీలింగ్ ఉండేది నాకు. గోపీ గణేష్ చేసిన గాడ్సే సినిమాతో ఆ లోటును తీర్చేసింది. సమాజానికి ఉపయోగపడే సినిమా చేయాలని నిర్మాతకు ఉంటుంది. 83 సినిమాలు తీసినా నా అన్ని సినిమాల్లోకి గాడ్సే సినిమాపై చాలా హ్యాపీగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ గోపి గణేష్ కాస్త పిచ్చోడు. తనకు సినిమా తప్పించే మరో ఆలోచన లేదు. ప్రతి ఫేమ్ కోసం తపన పడే దర్శకుడు గోపి. తనకు డబ్బు కంటే సినిమా మీదనే ప్రేమ ఎక్కువ. తనకు సత్యదేవ్ రూపంలో వజ్రం దొరికింది. ఈ సినిమా చూసిన తర్వాత మరో సినిమా చేస్తానని గోపికి చెక్ కూడా ఇచ్చాను. రామారావుగారు, శివాజీ గణేషన్‌లా క్యారెక్టర్‌లో షేడ్స్‌ను చూపించగల నటుడు సత్యదేవ్. సినిమా చూసిన ఆడియెన్స్ మనం ఎందుకు అలా ఆలోచించకూడదనుకునే సినిమా అవుతుంది. జూన్ 17న థియేటర్స్‌లో సినిమా చూడండి’’ అన్నారు.
చిత్ర దర్శకుడు గోపి గణేష్ పట్టాభి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాను నా కంటే కళ్యాణ్‌గారు, రామారావు ఎక్కువగా లైక్ చేశారు. వారి మైండ్‌లో ప్రతీ ఫ్రేముని ఎక్కించేసుకున్నారు. కథ వినగానే కళ్యాణ్‌గారు గొప్ప సినిమా తీస్తున్నాం అన్నారు. నేను, సత్యదేవ్ కలసి బ్లఫ్ మాస్టర్ మూవీ చేశాం. మళ్లీ సినిమా చేయాలనుకోగానే మరో సామాజిక సమస్యపై సినిమా చేయాలని అనుకున్నాం. ఈ దేశంలో 6.7 శాతం మంది మాత్రమే వారి చదివిన చదువుకి సరైన అర్హత ఉండే పోస్ట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్లు అలా చేయడం లేదు. మీ అందరినీ మనసుల్లోని ప్రశ్నలను గాడ్సే ప్రశ్నించబోతున్నాడు. ప్రీ క్లైమాక్స్ సీన్‌ను సత్యదేవ్ సింగిల్ టేక్‌లో చేసేశాడు. బ్రహ్మాజీ, నోయల్ సహా అందరూ చక్కగా సపోర్ట్ చేశారు. శాండీ రెండు నెలలు నాతో పాటు ఉండి సంగీతంతో ప్రాణం పోశాడు. సురేష్ సారంగం చక్కటి విజువల్స్ అందించాడు. సాగర్ చక్కగా ఎడిట్ చేశాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. జూన్ 17న రానున్న గాడ్సే మంచి సినిమాగా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.