మరో పవర్‌ఫుల్ ట్రైలర్ విడుదల చేసిన మంత్రి కేటీఆర్
సినిమా లేకపోతే ప్రజాసేవలో ఉండేవాడిని కాదు: పవన్‌కళ్యాణ్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భీమ్లానాయక్’. నిత్యామీనన్, సంయుక్తమీనన్ కథానాయికలు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందించారు .సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి. ఈ నెల 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతినిధిగా కాదు.. పవన్‌కు సోదరుడిలా వచ్చా: కేటీఆర్
మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ ‘‘మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్ ఫాలోయింగ్ ఉండే నటుడు పవన్ కల్యాణ్. ఈరోజు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్ కల్యాణ్‌గారి సోదరుడిగా వచ్చా. మేమంతా ఆయన ‘తొలిప్రేమ’ సినిమా చూసిన వాళ్లమే. అప్పటి నుంచీ ఇప్పటి వరకు ఒకేలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అసాధారణమైన విజయం. అందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 8 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ భారత చలన చిత్ర పరిశ్రమకు ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్‌ని రూపొందించాలనే సంకల్పంతో ఉన్నాం. కేసీఆర్‌గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకేౖతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కల్యాణ్‌గారి లాంటి పెద్దలందరూ అండగా ఉంటే.. తప్పకుండా హైదరాబాద్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతుందనే విశ్వాసం ఉంది. ఈ రోజు సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గోదారమ్మకి కూడా దారి చూపెట్టిన కేసీఆర్‌గారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. మీరు షూటింగ్స్ గోదావరి జిల్లాలలోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లో కూడా చేయవచ్చు’’ అని కల్యాణ్‌గారిని కోరుతున్నా. ప్రపంచంలోని అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని ఇక్కడ మూడున్నర సంవత్సరాలలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌గారిది. ఇక్కడ మీరు షూటింగ్స్ చేసి, తెలంగాణ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం తీసుకొస్తారని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను. ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాత సూర్యులను బయటికి తీసుకువచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి, చిత్రయూనిట్‌కి అభినందనలు’’ అని అన్నారు.
‘అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్థం’: పవన్‌కల్యాణ్
పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. నిజమైన కళాకారుడికి, కులం, మతం, ప్రాంతం ఉండవు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎందరో కృషి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో ఆ బంధం మరింత బలపడుతుంది. ఆయన అందిస్తున్న తోడ్పాటుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమకు ఏ అవసరమున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు నేనున్నాను అంటూ ముందుకొస్తారు. జన జీవితంలో ఉన్నప్పటికీ సినిమానే అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజాసేవలో ఉండేవాడిని కాదు. సినిమా మాధ్యమం ఇంతమంది అభిమానులను నాకు భిక్షగా ఇచ్చింది. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకునేలా చేసింది. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. మన రాష్ట్రానికి, మనవాళ్లకు ఎంతో కొంత చేయాలని వచ్చా. రాజకీయాల్లో ఉన్నా కదాని, ఎలాగోలా సినిమా చేయలేదు. చాలా బాధ్యతతో సినిమాలు చేస్తున్నా. ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ చిత్రాలకు ఎలాంటి క్రమశిక్షణతో పనిచేశామో దీనికి అలాగే పనిచేశాం. ‘అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్థం’ ఈ చిత్రం. ఒక పోలీస్ ఆఫీసర్‌కు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. తెలుగువారికి చేరువయ్యేలా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నా రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాతలు చిత్రానికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి టెక్నీషియన్ చాలా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు పరిశ్రమలో యువశక్తి వస్తోంది. అందుకు ఉదాహరణ నల్గొండ నుంచి వచ్చిన తెలంగాణ యువకుడు సాగర్. అమెరికాలో చదువుకుంటూ సినిమాపై ప్రేమతో ఇక్కడకు వచ్చారు. పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన మరిన్ని విజయాలుని సాధించాలి. మొగిలయ్యలాంటి గాయకులను వెలుగులోకి తెచ్చిన తమన్‌కు ధన్యవాదాలు. . రానా, సంయుక్త మేనన్, నిత్యామేనన్ చక్కగా నటించారు. సినిమాకు పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అంటూ
చిత్ర సాంకేతిక బృందానికి తన తరఫున జ్ఞాపికలు బహూకరించారు పవన్ కళ్యాణ్. చాలామంది స్టార్స్‌తో చేశా.. కానీ పవన్‌కల్యాణ్ డిఫరెంట్: రానా
రానా మాట్లాడుతూ ‘‘యాక్టర్ అయ్యి 12 ఏళ్లు అయింది. దర్శకులు చెప్పినట్లు నాకు ఇచ్చిన పాత్రలన్నీ చేసుకెళ్లిపోయాను. ఏదోలా యాక్టర్ అయ్యా. కానీ హీరో ఎలా అవ్వాలనే కాన్సెప్ట్ బుర్రలో తిరుగుతూనే ఉంది. అప్పుడు నా కళ్ల ముందుకొచ్చిన హీరో…. పవన్‌కల్యాణ్. ఇండియాలో చాలామంది స్టార్‌లతో కలిసి చేశాను కానీ.. అందులో పవన్ కల్యాణ్ డిఫరెంట్. ఇప్పటి వరకే నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ పవన్‌కల్యాణ్ ప్రభావంతో కొత్తగా ఉంటాయి. అలాగే నేను కలిసిన మరో మేధావి త్రివిక్రమ్‌గారు. ఆయన పొరపాటున సినిమాల్లోకి వచ్చారు కానీ బయట ఉండి ఉంటే రాకెట్‌లను మార్స్‌కి ఎగరేసేవారు. అలాంటి తత్వం ఆయనది. ఇందులో మంచి ఆర్టిస్ట్‌లతో పనిచేశా. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో ఇండియన్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కానుంది’’ అని అన్నారు.
పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు: తలసాని శ్రీనివాస యాదవ్
‘‘24 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎంత క్రేజ్ ఉందో.. ఇప్పుడూ అంతే ఉంది. రోజురోజుకీ ఆయన క్రేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఆయన వయసు పెరుగుతందో.. తగ్గుతుందో నాకైతే అర్థం కాదు. రెండు రాష్ట్రాల అభిమానులు, ప్రేక్షకులు ఏడాదిగా ఈ చిత్రం కోసం వేచి చూస్తున్నారు.హైదరాబాద్ కేంద్రంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశానికి హబ్‌గా మారాలని కేసీఆర్ కృషి చేస్తున్నారు. సినిమాకు సంబంధించి మా ప్రభుత్వం పరిశ్రమకు అండగా ఉంటుంది. ఇండస్ట్రీ బాగుండాలి.. అందులో పని చేసే అందరూ ఆనందంగా ఉండాలని మా ప్రభుత్వం కోరుకుంటుంది. మారుమూల ఉన్న కళాకారులను గుర్తించి వారిని వెలుగులోకి తీసుకురావడం అనేది కల్యాణ్‌గారిలో ఉన్న గొప్ప గుణం’’ అని అన్నారు.
గెలుపంటే మోజు లేని వ్యక్తి ఆయన: సాగర్ చంద్ర
దర్శకుడు సాగర్ కె.చంద్ర మాట్లాడుతూ ‘‘నల్గొండ నుంచి దర్శకుడి కావాలని వచ్చాను. నా కుటుంబ సభ్యుల అండతో ముందుకెళ్తున్నాను. 2011లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. అదే సమయంలో ‘పంజా ఆడియో ఫంక్షన్ పాస్ సంపాదించి కల్యాణ్‌గారిని చూడొచ్చు అని గచ్బిబౌలి స్టేడియంకు వెళ్లా. పాస్ ఉన్నా… మూడు సార్లు బయటకు తోసేశారు. ఆ స్టేజ్ నుంచి ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అదంతా నా చుట్టూ ఉన్న మంచి వాళ్ల వల్లే సాధ్యమైంది. రానా గురించి చిన్న మాటలో చెప్పలేను. గొప్ప నటుడు అని చెప్పగలను. ఎప్పుడూ ఒకటే ఎనర్జీతో ఉంటారు. నాగవంశీగారు నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు. చినబాబుగారి కుటుంబం నాకు ఆత్మీయులు. త్రివిక్రమ్‌గారు లేకుండా ఈ సినిమా లేదు. ఇండస్ట్రీలో అతి కొద్ది మంది దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ త్రివిక్రమ్‌గారి దగ్గర చాలా నేర్చుకున్నా. ఆయన నాకొక టీచర్‌లాగా. పవన్‌కల్యాణ్‌గారంటే నాకు తెలిసింది ఒకటే! గెలుపంటే మోజు లేదు.. ఓటమి అంటే భయం లేదు.. చావే అంతం కాదు అన్నప్పుడు చావుకి మాత్రమే ఎందుకు భయపడతాం? వెళ్లి ఆకాశం నుంచి గర్జించు’’ అని ఓ రచయిత చెప్పిన మాటలు ఆయన్ని చూస్తే గుర్తొస్తాయి’’ అని అన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘‘తమ్ముడు’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆయన ఉన్న వేదికను షేర్ చేసుకోవాలని, ఆయన సినిమాకు పాటలు రాయాలని కోరిక ఉండేది. ఆయన సినిమాలకు సెలవు అన్నప్పుడు కళ్యాణ్‌గారితో పనిచేయలేకపోతున్న అన్న బాధ ఉండేది. ఇప్పుడు భీమ్లానాయక్‌తో నా కల నెరవేరింది’’ అని అన్నారు.
మొగిలయ్య మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో పాడటం గొప్ప అవకాశం. ఈ అవకాశం నన్ను ఢిల్లీ వరకూ తీసుకెళ్లి పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం సన్మానించడంతోపాటు ఆర్థికంగానాకు సాయం చేసింది. పవన్‌కల్యాణ్‌గారి నుంచి ఇలాంటి పాటలు పాడే అవకాశం మరెన్నో రావాలని ఆశిస్తున్నా. నిర్మాణ సంస్థకు నాకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.
సంయుక్త మీనన్ మాట్లాడుతూ ‘‘కేరళలో ఓ చిన్న గ్రామంలో పుట్టిన నాకు ఇదొక డ్రీమ్ లాంటిది. 2017లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. నాలాంటి కొత్త హీరోయిన్‌కు తెలుగులో ఇంతకన్నా మంచి పరిచయం చిత్రం ఉండదు. నేను అసాధ్యం అనుకున్నది సాధ్యం అయింది. సినిమా సెట్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. ఈ సినిమాలో నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలీదు కానీ.. ‘భీమ్లానాయక్’ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ప్యాషన్ ఉన్న ఆడియెన్స్ ముందుకు హీరోయిన్‌గా రావడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ నాకు నచ్చింది. హైదరాబాద్ నా ఇల్లు కాబోతుంది’’ అని అన్నారు.
తమన్ మాట్లాడుతూ ‘‘పవన్‌కల్యాణ్‌గారితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. ఛాలెంజింగ్‌గా తీసుకుని పని చేశాం. పాటలకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ నెల 25 తర్వాత సినిమా గురించి మాట్లాడతా’’ అని అన్నారు.
మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ‘‘సినిమా సూపర్‌హిట్ కావాలని ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
దానం నాగేందర్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం ఎంతో నిరీక్షిస్తున్నారు. పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
సముద్రఖని, మొగిలయ్య, డాన్స్ మాస్టర్లు విజయ్, గణేష్. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్, రామ్‌జోగయ్య శాస్ట్రి, కాసర్ల శ్యామ్, రామ్ మిరియాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, సునీల్, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, రామకృష్ణ, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: సాగర్ కె చంద్ర