‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది బాలీవుడ్ నటి ఆలియా భట్. అయితే అంతకంటే ముందే ‘గంగూబాయ్ కథియావాడి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భన్సాలీతో కలిసి పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతీలాల్ గడ నిర్మించారు. ఫిబ్రవరి 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సినిమా గురించి, తన పాత్ర గురించి ఆలియా చెప్పిన విశేషాలివి.
ప్యాండమిక్ తర్వాత విడుదలవుతున్న మొదటి మేజర్ సినిమా గంగూబాయ్. మీరెలా ఫీలవుతున్నారు?
చాలా నెర్వస్‌గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దాంతో మొన్నటి వరకు నా మనసులో చాలా ప్రశ్నలు తిరిగాయి. ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ని మర్చిపోయారా? ఇంతకు ముందులాగే థియేటర్లకు వస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మంచి సినిమా అయితే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారనే నమ్మకాన్ని పుష్ప సినిమా కలిగించింది. దాంతో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. మాది చాలా మంచి సినిమా. కాబట్టి కచ్చితంగా ఆడియెన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను.
ఈ ఆఫర్ మీకెలా వచ్చింది?
నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు (2005) సంజయ్ సర్ ‘బ్లాక్’ సినిమా ఆడిషన్‌లో పాల్గొన్నాను. సెలెక్ట్ కాలేదు. కానీ ఆయన నా కళ్లలోకి చూసి నేను కచ్చితంగా హీరోయిన్ అవుతానని చెప్పారు. ఈ సినిమా కథ విన్నప్పుడు నేనిది చేయగలనా అని ఆయన్ని అడిగాను. ఎందుకంటే గతంలో నేను పోషించిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంది. కానీ నేను చేయగలనని సంజయ్ గారు నమ్మారు. నువ్వేం కంగారుపడకు, అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పారు.
మీ క్యారెక్టర్ కోసం ఎలా ప్రిపేరయ్యారు?
నేను చేసే పాత్రల్లో నన్ను నేను ఊహించుకుంటూ ఉంటాను. ఏ సీన్ ఇచ్చినా మనసులో ఊహించుకుని వెంటనే చేసేస్తాను. ఈ సినిమా విషయంలో సంజయ్ సర్ చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. వాయిస్ విషయంలో అయితే చాలా హార్డ్ వర్క్ చేశాను. గంగూబాయ్ చిన్నగా ఉన్నప్పుడు, పెద్దయిన తర్వాత స్వరంలో మార్పు ఎలా చూపించాలనేదానిపై ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. సినిమాలో కొంత పార్ట్ కోసం బరువు కూడా పెరగాల్సి వచ్చింది. డైట్ ఫాలో అవ్వకుండా ఏది తినాలనిపిస్తే అది తినేయమని సంజయ్ సర్ చెప్పారు. గుజరాతీ యాస పట్టుకోవడం కాస్త కష్టమయ్యింది. పైగా గంగూబాయ్ కథంతా 1950ల కాలంలో జరిగింది కదా. అప్పటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా నటించాల్సి వచ్చింది.
పాత్రలపై రీసెర్చ్ చేస్తుంటారా?
అలా ఏమీ ఉండదు కానీ డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను. వాళ్లేం చెప్తే అది చేస్తాను. ఏమీ ప్రిపేరవ్వకుండా సెట్‌కి రమ్మనే డైరెక్టర్లు ఉన్నారు. రెండు మూడు నెలలు ప్రిపేరయ్యి రమ్మనేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకి తగ్గట్టుగా చేస్తాను. చెప్పాలంటే గంగూబాయ్ కథియావాడి ఆ పద్ధతులన్నిటినీ మార్చేసింది. నా అంచనాలను మించి ఉంది. సంజయ్ సర్ స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేస్తుండేవారు. ఎప్పుడు ఏ సర్‌ప్రైజ్ ఉంటుందో తెలిసేది కాదు. ఓ నటికి ఇలాంటి అనుభవం చాలా అరుదుగా దొరుకుతుంది.
ఈ సినిమా నుంచి మీరేదైనా కొత్త విషయం తెలుసుకున్నారా?
ఒక సీన్ చేయడానికి ఒక్క పద్ధతే ఉండదనే విషయం తెలుసుకున్నాను. మొదట్లో సీన్ చదివి సెట్‌కి వచ్చేదాన్ని. కానీ సెట్‌కి వెళ్లాక నా ఆలోచన మారిపోయేది. ఆ సిట్యుయేషన్‌లో గంగూబాయే ఉంటే ఎలా రియాక్టవుతుందో ఊహించుకునేదాన్ని. సీన్ పేపర్ ఒక స్టార్టింగ్ పాయింట్ అంతే. మనం ఎగరాలంటే రెక్కలు విప్పుకోవాలి కదా. నేనూ అదే చేసేదాన్ని.
ఇలాంటి ఎమోషనల్ పాత్ర చేయడం కష్టమనిపించలేదా?
నిజానికి కష్టమే. చెప్పాలంటే నేనిప్పటికీ ఆ పాత్రకి ఎమోషనల్‌గా అటాచ్ అయి ఉన్నాను. ప్యాండమిక్ వల్ల రెండేళ్ల పాటు షూట్ చేశాం కదా. అందుకే అందులో నుంచి బైటికి రావడం కష్టంగా ఉంది. ఆ పాత్ర నా మనసులోనే ఉండిపోయింది. మూడేళ్లుగా నేను దానితో ప్రయాణం చేస్తున్నాను. ఆడియెన్స్ సినిమా చూశాక కానీ నేను రిలాక్స్ అవ్వలేను.
అత్యంత చాలెంజింగ్‌గా అనిపించిన సీన్ ఏది?
అసలు ఆ క్యారెక్టరే ఎంతో చాలెంజింగ్. సినిమా మొత్తం దాని చుట్టూనే తిరుగుతుంది. చూస్తే మీరు కూడా ఈ పాత్రతో లవ్‌లో పడిపోతారు. నేను పూర్తిగా తన ప్రపంచంలోకి వెళ్లిపోయాను. నా జీవితంలో కామాఠిపురని ఎప్పుడూ చూడలేదు. ముంబైలోని ఫిల్మ్ సిటీలో వేసిన కామాఠిపుర సెట్‌కి మాత్రమే వెళ్లాను. కానీ అక్కడికి వెళ్లగానే వేరొక మనిషిలా మారిపోయేదాన్ని. కొన్నిసార్లు ఇంట్లో కూడా నాకు తెలియకుండానే గంగూబాయ్‌లా కూర్చునేదాన్ని. తనలాగే మాట్లాడేదాన్ని. మా ఇంట్లో వాళ్లంతా నువ్వెవరు, నువ్వు ఆలియావి కాదా అనేవారు. మీరు మీలా కాకుండా వేరొకరిలా మారడం అంత ఈజీ కాదు. నేను మారానంటే ఆ క్యారెక్టర్ అంత ఎమోషనల్‌గా ఉండటం వల్లే. తను రెబెల్. తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎదిరించింది. ఓ బలమైన శక్తిగా ఎదిగింది. అదే తన గొప్పదనం.
గంగూబాయ్ పాత్ర కల్పితమా?
ఈ సినిమా హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ ఆధారంగా రూపొందింది. గంగూబాయ్‌ది అందులో ఓ చిన్న చాప్టర్. ప్రతి సినిమాలాగే ఇందులోనూ క్రియేటివ్‌గా ఆలోచించి కొన్ని సీన్స్, డైలాగ్స్ యాడ్ చేశాం.
అజయ్ దేవగన్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
చాలా ఎంజాయ్ చేశాను. గంగూబాయ్ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి పాత్రలో నటించారు అజయ్. ఆయనే తన జీవితాన్ని ముఖ్యమైన మలుపు తిప్పుతారు. అంత గొప్ప నటుడితో కలిసి పని చేయడం చాలా బాగుంది. చెప్పిన టైమ్ కంటే ముందే సెట్‌కి వచ్చేస్తారు. నాకంటే ముందే ఎక్కడ వచ్చేస్తారో అని చాలా టెన్షన్ పడేదాన్ని. నటనలోనూ నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆర్‌ఆర్‌ఆర్ కంటే ముందు గంగూబాయ్ సినిమాతో టాలీవుడ్‌లో మీ ముద్ర వేయగలనని అనుకుంటున్నారా?
ఇవన్నీ ప్లాన్ ప్రకారం జరుగుతున్నవేమీ కాదు. అలా కుదిరాయంతే. ప్యాన్ ఇండియా యాక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఆ విషయంలో శ్రీదేవి గారు నాకు స్ఫూర్తి. ఆవిడ తెలుగు, తమిళం, హిందీ అంటూ ప్రతి భాషలోనూ స్టార్ అయ్యారు. నేనూ అలా అవ్వాలనేదే నా కోరిక. అందుకు భాష సరిహద్దు కాదని నేను నమ్ముతాను. ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. దేవుడి దయవల్ల అక్కడితో ఆగిపోకుండా తెలుగులో నా ప్రయాణం మరింత ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385